పరమాచార్యుల అమృతవాణి : తిలకధారణతో బ్రహ్మవ్రాతను మార్చుకోవడం
(జగద్గురుబోధలనుండి)
మన హిందుమతములో మాత్రమే బొట్టు పెట్టుకొనే ఆచారమున్నది. ప్రపంచములో ఏ ఇతర మతములలోనూ ఈ ఆచారములేదు.
''లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే''
''బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన గీత తప్పింప ఎవరికి శక్యముగాదు,'' అని చెప్పుకొంటారు లోకములో, కష్టములు తప్పించుకోలేము అంటారు, కాని ఎవ్వరు ముఖమున బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతను చెరిపి మంచి వ్రాత వ్రాసుకుంటున్నారన్నమాట, ఒక టేపురికార్డరు మీద ఏదైనా ఒక ఉపన్యాసము రికార్డు చేస్తే దానిని చెరిపి వేసి మరొకటి రికార్డు చేయటములా - అలాగే ఇది కూడా, బ్రహ్మదేవుడి వ్రాత ఎలా తప్పుతుంది అంటారేమో - పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు, పరమేశ్వరుని గుర్తుగా విభూతి, పార్వతీదేవిగుర్తుగా కుంకుమ మనము ధరిస్తాము. ముఖము చూడగానే విభూతి కుంకుమలు చూస్తే మనకు పార్వతీపరమేశ్వరులు జ్ఞాపకమువస్తారు, అట్లాగే ఇతర విధములైన బొట్లుకూడా భగవంతుని స్మరింపచేస్తాయి, భగవంతుడు జ్ఞాపక మున్నంతవరకూ మనకు మంచిబుద్ధి కలుగుతూనే వుంటుంది. మంచిబుద్ధి కలిగితే పాపములు చేయలేము. ఈ విధముగా పుణ్యకర్మలుచేసి బాగుపడుతాము. కాబట్టి హిందువులందరూ ముఖమున బొట్టు పెట్టుకొనడము తప్పక చేయాలి.
ఉదయమున లేచి బొట్టుపెట్టుకుని శుచిగా భగవంతుని ధ్యానము చేయాలి. తమకు ఇష్టము వచ్చిన స్తోత్రమునో, శ్లోకమునో, మంత్రమునో చదువుకొని భగవంతుని మానసికముగా ప్రార్థించాలి. కేవలము తమక్షేమము కొరకు మాత్రమే భగవంతుడిని ప్రార్థించకూడదు. ''అందరూ క్షేమముగా వుండాలి. వర్షాలు కురవాలి. అందరికీ కష్టములు తొలగిపోవాలి. అందరి మనస్సూ శాంతిగా ఉండాలి" అని ప్రార్థించాలి. అంటే "లోకాస్సమస్థా స్సుఖినోభవంతు" అనుకోవాలి. తమ క్షేమముకొరకు ప్రార్థించేవారికంటే, అందరిక్షేమము కొరకూ ప్రార్థించేవారు ఉత్కృష్టులు. మానసికంగా ప్రార్థన చేయటానికి డబ్బుఖర్చు లేదు కదా!
లోకాలు మూడువిధాలుగా ఉన్నాయి, సుఖలోకములు. దుఃఖలోకములు. మిశ్రమలోకములు. ఇంద్రాది దేవతలున్న స్వర్గాదులు పుణ్యలోకములు. నరకాదులు దుఃఖలోకములు, స్వర్గములో దుఃఖముండదు. నరకములో సుఖముండదు. మానవలోకము మిశ్రమలోకము, ఇక్కడ సుఖము, దుఃఖము రెండూ ఉంటవి. సుఖదుఃఖములు రెండూ తెలుసు కాబట్టే దుఃఖము తొలగేందుకు సుఖము కలిగేందుకు పుణ్యకర్మ చేయాలి. స్వర్గనరకాదులలో దేనిని పొందడానికైనా మార్గము మానవలోకములోనే వున్నది.''జంతూనాం నరజన్మ దుర్లభం'' అన్నారు శంకరులు, అట్టి మానవ జన్మ పొందిన తరువాత దానిని వ్యర్థము చేయకూడదు.
లోకములో కొందరు హృదయంలో కేవలం ధ్యానం చేస్తే చాలదా, కర్మానుష్ఠానము ఎందుకు అంటారు. కాని అది సరికాదు, మానవుడు తరించటానికి ఈశ్వరభక్తి, కర్మానుష్ఠానము రెండూ ఉండాలి. అంతశ్శౌచము, బాహ్యశౌచము రెండూ కావాలి. ముందు బాహ్యశౌచము పాటిస్తే హృదయ శుద్ధి ఏర్పడుతుంది. దేవపూజ చేసేముందు, ఇక్కడికి వచ్చే ముందు స్నానముచేసి రావాలి. భగవన్నామము స్మరిస్తూ స్నానమాచచించాలి. జీవితమంతా వ్యర్థ సంభాషణలతో, కేవలము ఉదరపోషణ ప్రయత్నములో గడుపుతే మనకూ, జంతువులకూ భేదమేమి? ఒక యంత్రములా తిని, నిద్రపోయి చనిపోతే జీవితము వ్యర్థమవుతుంది. కొందరు, అన్నీ భగవంతుడే చేస్తాడని, మనము ఏమీ చేయనక్కరలేదని చెప్పుతుంటారు. జంతువులకు కావలసినవన్నీ భగవంతుడు చూస్తాడు కానీ, మానవులకు భగవంతుడు స్వతంత్రంగా ఆలోచించే బుద్ధియిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి యుక్తాయుక్త విచక్షణతో కర్మను ఆచరించమని భగవంతుని అభిప్రాయము. ఆ బుద్ధిని సక్రమముగా వినియోగించు కొనక, కాలము వ్యర్థముచేస్తే పతితుడవుతాడు.
కావున హిందువులందరూ 1. తిలకధారణము, 2. సమిష్టి క్షేమము కొరకు మానసిక ప్రార్థన, 3. ఈశ్వరభక్తి, 4.కర్మానుష్ఠానమునందు శ్రద్ధ అలవరచుకొందురుగాక !