పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-1: శివునితో మొదలైన అమ్మవారి స్తోత్రం
శివః శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితు మపి |
అతస్త్వాం ఆరాధ్యాం హరి హర విరిఞ్చ్యాదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి || 1 ||
మన స్తోత్రం ఈ శ్లోకంతో మొదలవుతోంది. ఈ శ్లోకం - సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, రుద్రులకంటే అమ్మవారు శక్తివంతురాలు - అనే శాక్తసాంప్రదాయానికి చెందిన ఒక ముఖ్య సిద్ధాంతాన్ని చెబుతోంది. శివుడు ద్వంద్వాతీతుడైన నిర్గుణ పరబ్రహ్మమే. కానీ ఆ శివుడు కూడా అమ్మవారు క్రియాశీలం చేస్తేనే, స్పందించి త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, రుద్రులు) జగత్తులో వారివారి పనులు నిర్వహించేలా చేయగలడు.
" త్రిమూర్తులూ, ఇతర శక్తివంతులైన దేవతలూ నిన్నే పూజిస్తున్నారు. బ్రహ్మమునుకూడా వశంలో ఉంచుకుని నీవే క్రియాశీలంగా చేస్తావు. ఒక ఈగ రెక్కలు అల్లార్చడం, చీమ ప్రాకడం నుండీ ప్రపంచములోని ఏ పని, క్రియ అయినా నీ శక్తి, సంకల్పముల వలననే జరుగుతోంది. అలా అయినప్పుడు, ఎవరైనా (నీవు శక్తినీయకపోతే) నీకు నమస్కరించడం గానీ స్తుతించడం గానీ ఎలాచేయగలడు ? "
" నీపై నా భక్తి విశ్వాసములు, నీకు నేను చేసే ప్రణామములు, ఇవి అన్నీ నా ఇచ్ఛతోనో సంకల్పంతోనో జరుగుతున్నాయా ? కర్తను నేనా ? నేను ఈ స్తోత్రం వ్రాయటం ఇప్పుడే ప్రారంభించాను. కానీ నీవిచ్చే శక్తి లేకుండా, నీ కరుణ లేకుండా, నీ అనుమతి లేకుండా నేను వ్రాయగలనా ? "
ఇంత వివరంగా, ఇన్ని మాటలూ లేకుండా, తను చెప్పదలుచుకున్నది నిగూఢంగా తెలిసేలా, ఆచార్యులు అమ్మవారిని ఈ ప్రశ్నలు అడుగుతున్నారు.
అదేవిధంగా అంటున్నారు - " నిన్ను స్తుతిచేయటానిని శక్తిని నీవే ప్రసాదిస్తావు. కానీ అలాంటి శక్తిని ప్రతీ ఒక్కరికీ ఇస్తావా ? ఇవ్వవు. నీవు జగన్మాతవు అయినా సరే మా కర్మకు అనుగుణంగానే నీ అనుగ్రహం చూపుతావు. కాబట్టి యోగ్యతలేనివారికి నిన్ను స్తుతించే భాగ్యాన్ని ప్రసాదించవు. ఆ భాగ్యానికి ఎవరైనా ఎలా పాత్రుడవుతాడు ? గత జన్మలలో మంచిపనులు చేసి పుణ్యం సంపాదించి ఉండాలి. అలాగ పాత్రుడౌతాడు. వేరందరూ నిన్ను వందనం చేయుటకైనా, స్తుతించుటకైనా యోగ్యత లేనివారే. "
ఆచార్యులు ప్రతీ విషయాన్నీ స్పష్టంగా చెప్పరు. నిజానికి ఈ మెదటి శ్లోకంలో చాలా విషయాలు నిగూఢంగా చెప్పబడ్డాయి. కవిత్వానికి ఇది ఒక ముఖ్య లక్షణం. గద్యంవలే కాకుండా ప్రతీ విషయమూ స్పష్టంగా వివరించనక్కరలేదు. కొన్ని విషయాలు చెప్పబడవు, లేదా చెప్పబడేదానితో సూచితమౌతాయి. అప్పుడే చదువరి ఆసక్తి పెరుగుతుంది. అప్పుడే రసజ్ఞత ఉంటుంది. ఫలములోని రసము బయటకు రాక లోపలే ఉన్నట్లు. కవిత్వంలోనూ అంతే. కవిత రసవత్తరంగా ఉండాలి - కవితలో రసజ్ఞులకు ఆనందం కలుగజేయునది అంతర్లీనంగా చెప్పబడాలి. అలాగే కవిత సారవంతంగా ఉండాలి అంటారు. అంటే కవితకు సారం ఉండాలి. అనవసరమైన విషయాలు వదలివేసి రసం/సారం మాత్రం గ్రహించాలి. అంటే (కవితలో) అనవసరమైన వాగాడంబరం ఉండకూడదు. చెప్పబడిన అంశము స్పష్టముగా క్లుప్తముగా ఉండాలి. ఒక బుట్ట నిండా ఉన్న నిమ్మకాయల రసము ఒక చిన్న సీసా అంతే ఉంటుంది. అలాగే కవిత్వంలో అంశాలను క్లుప్తంగా, సారరూపంలో చెప్పాలి. సంగీత విద్వాంసుడు ఒక చిన్న పల్లవిని విస్తారంగా, సంగతుల మీద సంగతులతో, ఆలాపిస్తాడు. అలాగే రసజ్ఞుడు కవితలో అంతర్లీనంగా చెప్పబడిన విషయాలు, సౌందర్యమూ తానే కనుగొని అర్థం చేసుకోగల రీతిలో కవితను కూర్చాలి.
(సశేషం)