పరమాచార్యుల అమృతవాణి: పరులకు మార్గనిర్దేశం చెయ్యటానికి ముందు ...
ఈ యూర పండితపరిషత్తొకటి యేర్పడుట సంతోషావహము. దీనికి పండితాభిమానులును లౌకికులును అగువారధ్యక్షులగుటయు, విద్యభిమానముగలఇతరులును సహాయపడుటయు కొనియాడతగియున్నది. మన సంఘమునకు పండితులు హృదయమువంటివారు తక్కిన అంగములు దుర్బలములైనను హృదయ స్థానమొకటిపదిలముగనుడెనేని రోగికి ప్రాణభయములేదని వైద్యులు చెప్పుదురు. తక్కిన అవయవములన్నియు బాగుండినను హృదయము చెడినచో నంతయు చెడినట్లే యగును. కావున పండినపరిషత్తును కాపాడుట ఎల్లరకును కర్తవ్యము.
'యద్యదాచరతిశ్రేష్ఠః తత్త దేవేతరో జనః
సయత్ర్పమాణంకురుతే లోక స్తదనువర్తతే'
అని భగవదుక్తికలదు.
శ్రేష్ఠుడనగానెవడు?
ఏ విషయమున నొకనికంటె, నొకడధికుడగునో, నలుగురకంటె నధికుడగునో, వాడు శ్రేష్ఠుడగుచున్నాడు. ఒక విషయమున ఒకడు శ్రేష్ఠతను గడించినపిదప అట్టివానిని లోకులన్నింట ననుసరింతురు. ఇయ్యది లోకధర్మము. ఇప్పుడు లోకముచే శ్రేష్ఠులుగా పరిగణింపబడువారందరును మనదేశమందలి దారిద్ర్యమును నిర్మూలించుటకును. జనులందఱకును అన్నవస్త్రముల లభింపజేయుటకును పాటుబడుచుండువారే. దీనికొఱకు వారు చేసిన స్వార్థత్యాగమెంతయేనికలదు. కావున లోకులు వారి మాటను శిరసావహించుటయందు వింతలేదు. కాని వీరిదృష్టి ఉదరపోషణముతో మాత్రము పర్యాప్తమైనది. ఇట్టిస్థితి పశుపక్షి క్రిమికీటక సామాన్యమైనది. అదియునుంగాక ఐశ్వర్య సమృద్ధికలిగిన పాశ్చాత్య దేశములందుకూడ దుఃఖము బహుళ ముగానుండుట, శాంతి బొత్తుగాలేకుండుట మనము చూచుచున్నాము. వీనినిబట్టి ధనమాత్ర సంపాదనచేత సుఖము పూర్తి కాలేదనుట ఋజువగుచున్నది.
మనుష్యులను పశువులనుండి వేఱుపఱచు విశేషమిచ్చటనేకలదు. వానికి మేతయున్న చాలును. మనకావశ్యకమగు ఆశనమునకుతోడు చిత్తనైర్మల్య హేతువగు కొండొకయంశముండినగాని మానవత్వము పరిపూర్ణతనొందదు. దీనికి మార్గదర్శకులు కావలసినవారు పండితులుతప్ప వేరొకరుకాజాలరు.
'శక్నోతీహైవయస్సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్
కామక్రోధోద్భవంవేగం సంయుక్త స్ససుఖీ నరః'
అని గీతలో భగవంతుడర్జునకు వాక్రుచ్చియున్నారు. ఎన్నియున్నను కామక్రోధముల నణగద్రొక్కక ఎవరికిని సుఖము లభించుటకల్ల. ఇయ్యది తెలియనివారలే పెక్కురుకలరు. దీని నెఱిగిన పండితుడు స్వాచరణమునకు దెచ్చుకొనుట ప్రధమ కర్తవ్యముగానున్నది.
ఈ పరిషత్సభ్యులు పక్షమున కొకమారో మాసమున కొకమారో, సమావేశమై విజగీషుత్వమును తలపెట్టక, ఈ పక్షమున, లేక ఈ మాసమున మీరెంతమాత్రము కామక్రోధముల తగ్గించుకుంటిరి. ఎంతమాత్రము భక్తిని సాధింపగలిగితిరి అని పరీక్షించుకొనవలెను. ప్రతిదినమొక డైరీవ్రాసుకొని మనమీ దినము ఎట్టి మంచి కార్యమొనర్చితిమి? ఎంతమాత్రము కామక్రోధముల తగ్గించుకుంటిమి? ఎంతమాత్రము భగవంతునిపై ప్రేమ సంపాదించితిమి. అని మనలను పరీక్షించుకొనవలెను. ఆనాడు మనము ఇతరులకు మార్గదర్శకులము కాగలము. అప్పుడు మనల నందరును అనుసరింతురు. అప్పుడు దేశమునకు నిజమగు స్వాతంత్ర్యము, మోక్షము, శాంతి కలదు.
కాబట్టి ఈ పరిషత్సభ్యులు ముందు తమ్ము తాము సంస్కరించుకొని పరులకు మార్గదర్శకులై దేశమునుద్ధరించుట కర్తవ్యముగా భావించి దానికి బూనుకొనినయెడల మరల భారత దేశము పూర్వపుటౌన్నత్యమునందగలదు. మీరందరునుస్వకర్మా చరణబద్ధులు కావలెను. ఈ పండిత పరిషత్తు దినదినము అభివృద్ది చెంది ఈ మండలమునకేగాక దేశమునకంతయు మార్గదర్శక మగుగాక!