సౌందర్యలహరిలో భక్తిమార్గము
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-6
భక్తి జ్ఞానమార్గములలో ఏ మార్గము అవలంబించినప్పటికీ, ఆ మార్గములో నిజాయితీగా లీనమవాలి. పరిపక్వత ఇంకా రానప్పుడు మార్గమునుండి ప్రక్కదోవ పట్టి తదేక ధ్యాసను కోల్పోరాదు.
ఓ మాతృమూర్తి తన బక్కపలుచని పిల్లడికి చేదుమందు ఇస్తూ అది తియ్యగా ఉంటుందని చెప్పినదనుకోండి. అది అబద్ధమా ? కాదు, ఆమె సత్యమే చెబుతోంది. విరేచనాలతో బాధపడుతున్న మరో పిల్లడు మైసూరుపాకు తినాలనుకున్నప్పుడు, తల్లి అది చేదుపదార్థమని చెప్పి తినడం మానిపించిందనుకోండి. ఆమె ఇప్పుడూ సత్యమే చెబుతోందా లేదా ? ఏది సత్యము ? సత్యనిర్ధారణ జరిగేటప్పుడు, "ఇతరులకు మంచి చేయాలి" అనే విషయం ప్రమాణం. కానీ కొందరికి ఉపయోగమైనది మరికొందరికి హాని కలిగించేది అవవచ్చు. అంటే సత్యవస్తువు ఎవరికీ హాని కలిగించనిది అయి ఉండాలి. స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాలకు చోటు ఉండకూడదు. ఎవరి మంచి కోరి బోధ జరుగుతోందో, ఆ బోధను ఆ ప్రజలు ఇష్టమైనదిగా అంగీకరించాలి. (బోధ అలా ఉండాలి), కష్టంలేకుండానే ఆ బోధను అనుసరించగలగాలి.
ఈ ఉద్దేశ్యం - సదుద్దేశ్యం - తో, ఒక మార్గమునకు మరొక మార్గముకన్నా ఉన్నతస్థానమునిచ్చారు. అంటే రెండవ మార్గము విలువలేనిది అని కాదు. ఒక మార్గము ఉపదేశించబడిన వ్యక్తి, ఆ మార్గము తనకొరకు నిర్దేశింపబడినదని, తనకు సరిపోయినదనీ తెలుసుకున్నప్పుడు, ఉత్సాహంతో, మనస్సు లగ్నంచేయగలడు. అలాగే రెండవ మార్గము తక్కువచేసి చూపడంద్వారా ఒక మార్గంలోని వ్యక్తి తరచూ మార్గాలుమారుస్తూ తద్వారా గందరగోళానికి గురికాకుండా ఉండగలడు.
ఇది దృష్టిలో ఉంచుకునే ఆచార్యులు, తాను అద్వైతిగా తిరస్కరించే భక్తిని, మనను పట్టుకోమంటున్నారు. తాను అద్వైతము మాట్లాడుతూ మాయగా తిరస్కరించునది, భక్తిమార్గము అవసరములేనివారికోసమే. భక్తుడవాలంటే, భగవంతుడికన్నా కొంచెమయినా వేరుభావం ఉండాలి. అద్వైతములో ఆ ’వేరు’ అను భావముకు చోటులేదు. అంతా ఏకత్వమే. ఈ (అద్వైత) మార్గంలో వెళ్ళేవారికి మనం అనుకునే భక్తి అవసరం లేదు. వారికోసం ఆచార్యులు "స్వస్వరూపానుసంధానము" భక్తి అంటారు. కానీ అలాంటి భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు.
మరి మనబోటి అధికసంఖ్యాకుల సంగతి ఏమిటి ? ఉచితానుచిత విచక్షణ లేకుండా, మనస్సు, ఇంద్రియాలు ఎటు లాక్కెడితే అటు వెడుతూ, మనను సంతోషపెట్టేదే ఉచితమైనదని భావిస్తూ తప్పులు చేస్తున్నాము. (ఇలాంటి మనకి) బ్రహ్మాది దేవతలను కూడా నడిపించే దేవత శక్తి అనీ, ఈ పరాశక్తి పరబ్రహ్మమును కూడా స్పందింపజేయగలదని మనకి నేర్పినప్పుడు, తప్పులు, చెడు చేయటానికి వెనుకాడతాం, వినయంతోనూ, భక్తితోనూ, నిర్భయంగా ఉండటం అలవాటు అవుతుంది.
నిశ్చల పరబ్రహ్మమైన శివమే సత్యము. దానికి తప్పు, ఒప్పులు లేవు. ఉచితమూ అనుచితమూ లేవు అలాగే పుణ్యమూ పాపమూ లేవు. మనం చూసేదంతా మాయ. సత్యము (శివం) నకు వేరొకదానితో సంబంధం లేదు. అది అనుగ్రహించదు, శిక్షించదు.
ఇలా మనం అద్వైతపరంగా మాట్లాడామనుకోండి. మనం దీనికి విపరీతవ్యాఖ్యానంచేసి, మనకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి అనుమతి, స్వతంత్రత ఉన్నట్లు, మన మనస్సుకు నచ్చినట్లు నడుస్తాము. అందుకే ఆచార్యులు తమ స్తోత్రం తొలిశ్లోకం లోనే మన అహం తొలగించుకోవాలని ఉద్బోధిస్తున్నారు. క్రియారహితమైన నిర్గుణ పరబ్రహ్మమును స్పందింపచేయగలదీ, బ్రహ్మవిష్ణురుద్రులచే ఆరాధింపబడునదీ అయిన గొప్పశక్తి అమ్మవారు అని నొక్కిచెప్పుతున్నారు. "హరిహరవిరిచ్ఞ్యాధిభిరపి ఆరాధ్యాం" అంటున్నారు ఆచార్యులు. అమ్మవారికి సాష్టాంగం చేయాలనీ, స్తోత్రంచేయాలనీ ఆలోచించటానికి కూడా మనకు శక్తిలేదు. ఆమెను ప్రార్థించాలన్నా, స్తోత్రం చేయాలన్నా ఆమె కరుణ కావలసినదే. ఆ కరుణకోసం మనం ధార్మికజీవనం సాగించాలి. మనం భక్తితో, నీతిమంతంగా జీవించాలి. తొలిశ్లోకంలో ఈ విషయము అంతర్లీనంగా చెప్పబడింది.
(సశేషం)
తరువాతి భాగం : పంచకృత్య పరాయణా