Saturday, 16 July 2016

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-2 : శంకరులు తాను పుణ్యవంతుడననుకున్నారా ?



శంకరులు తాను పుణ్యవంతుడననుకున్నారా ?
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-2

ఈ శ్లోకం చివరి పాదం లో అంతర్గతంగా చెప్పబడిన అర్థం ఒకటి కనపడుతోంది. "ప్రణన్తుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి".  "పుణ్యం సంపాదించనివాడు నీకు ఎలా వందనము చేయగలడు ? నిన్ను ఎలా స్తుతించగలడు ? " అని అడుగుతున్నారు ఆచార్యులు. కానీ ఆయనే అమ్మవారిని స్తుతిస్తున్నారు కదా ? మరి తాను చాలా పుణ్యం సంపాదించాను అనుకుంటున్నారా ? అలా అనుకోవడం తప్పే అవుతుంది. తరువాతి శ్లోకాలలో ఆచార్యులు "నీ క్రీగంటిచూపును నాపై కూడా ప్రసరింపజేయి" అనీ "నీ పాదమును నా శిరముపై కూడా ఉంచు" అంటారు. అలా అనేవారు "నేను కొంత పుణ్యం చేశాను, అందుకనే నిన్ను స్తోత్రం చేయగలుగుతున్నాను" అని గొప్పలు చెప్పుకోరు. కాబట్టి మనం ఈ శ్లోకాన్ని పరిశీలించి అందులోని పదాల నిగూఢార్థమును కనుగొనాలి.

ఆచార్యులు మొదలులో ఏమన్నారు ? "అమ్మ నిశ్చలుడైన శివుని స్పందింపచేసి క్రియాశీలంగా చేస్తుంది". ఇలాగే ఆలోచిస్తే ఆచార్యులు ఈ స్తోత్రం కూర్చేటప్పుడు "నేనేమీ పుణ్యమును సంపాదించలేదు. అమ్మవారు పుణ్యవంతులకోసం ఈ స్తోత్రం కూర్చుటకు నాకు శక్తిని ప్రసాదించింది" అని అనుకుని ఉంటారు.

"పుణ్యం సంపాదించనివారు నిన్ను ఎలా స్తుతించగలరు ? " ఆచార్యులనే ఈ ప్రశ్న అడిగితే మనం వారి జవాబు ఈ విధంగా ఊహించవచ్చు. "నీవు ఏమైనా సాధించగలదానవు. నిశ్చలుడైన శివునికూడా క్రియాశీలంగా చేయగలవు. నీ ఈ శక్తియే నా నాలుక, వాక్కులకు నిన్ను స్తుతించే స్ఫూర్తినిచ్చింది." ఇలా అనటం, ఆచార్యుల మనసుకు దగ్గరగా ఉంటుంది. (ఆచార్యుల ఆలోచన ఇలాగే ఉంటుంది).

"ప్రణన్తుం" (వందనం చేయటం). ఇది శారీరక క్రియ. "స్తోతుం" (స్తుతించటం) ఇది వాచిక క్రియ. "మనో-వాక్-కాయ"ములనే మూడింటిలో చివరి రెండూ "స్తోతుం" తోనూ "ప్రణన్తుం" తోనూ సూచించబడ్డాయి. మరి మొదటిది ? అమ్మవారిగూర్చి ఆలోచించి, ధ్యానించిన తరవాతే ఎవరైనా నమస్కరించడమూ, స్తుతించడమూనూ. కాబట్టి మనస్సు కూడా ఇలా సూచించబడింది. ఇక్కడ మనం అమ్మవారికి మనస్సూ, వాక్కూ, శరీరమూ సమర్పించడం చూస్తున్నాము. ఈ శ్లోకంలో వేసిన విత్తనం నూరవ శ్లోకంలో ఫలిస్తుంది. అమ్మవారికి సంపూర్ణ శరణాగతి చేయటమే ఆ ఫలం .

ఎవరైనా ఒకరు గత జన్మలలో పుణ్యం సంపాదించని కారణంచేత అమ్మవారికి నమస్కరించలేకపోయినా, అమ్మవారిని స్తుతించలేకపోయినా, దాని అర్థం వారు భక్తిమార్గంలో వెళ్ళలేరనే అర్థం. ఆచార్యులవారు ఇక్కడ భక్తిగురించి ఎలా చెప్పారో, అలాగే జ్ఞానము గురించి వివేకచూడామణిలో చెప్పారు. "ముక్తిర్నో శతకోటి జన్మసు కృతపుణ్యైర్వినాలభ్యతే". దీని అర్థం - శతకోటి జన్మలలో సంపాదించిన పుణ్యములేక జ్ఞానమార్గంలో ముక్తి రాదు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటి ఉన్నది. సౌందర్యలహరి భక్తిప్రధానమైన గ్రంథము. ఈ గ్రంథము తొలి లో "ఎవరైనా కేవలము భగవంతుని కరుణాకటాక్షము చేత (ముక్తికి) సరైన మార్గము , అది భక్తిమార్గమైనా జ్ఞానమార్గమైనా, అవలంబించగలరా ? " అనే విషయం ఆచార్యులు స్పష్టంగా చెప్పట్లేదు. ప్రస్తుతం ప్రపంచమంతా భగవంతుడిని జ్ఞానమార్గంలో కట్టివేసి ప్రక్కన పెట్టింది. కానీ జ్ఞానప్రధానగ్రంథమైన వివేకచూడామణి తొలిశ్లోకాలలో ఆచార్యులవారే ఏమని చెప్పారు ? మానవుడు  భగవంతుని కరుణాకటాక్షము చేతనే ముక్తికాంక్షిస్తాడనీ, గొప్ప గురువును పొందుతాడనీ చెప్పారు. "దైవానుగ్రహ హేతుకం" అనే పదాలు  ఈ సందర్భంలో వాడబడ్డాయి. మాణిక్యవాచకులు కూడా "భగవత్ప్రేరేపితమై భక్తిమార్గమవలంబిస్తారం"టూ ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.



(సశేషం)

తరువాయిభాగం : శివుడుగొప్పా ? అమ్మవారు గొప్పా ?

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.