పరమాచార్యుల అమృతవాణి: మానవకర్తవ్యము
ప్రతిమానవుడుకూడా మనమెందుకుద్భవించితిమి? మన శరీరోద్దేశ్యము పూర్తి అయినదా? అని ప్రతిదిన మాలోచింపవలెను. ఒకడు అట్లూరునుండి నెల్లూరికి వచ్చినాడనుకొనుడు. అతడెందుకొచ్చినాడో ఆ విషయమును మఱచినాడు. ఊరక తిరుగుచున్నాడు. ఏమి ప్రయోజనము? మనస్థితికూడా ఆలాగే వున్నది. మనకెందుకు ఈ శరీరమొచ్చినదో? మనమేమి చేయవలయునో మనము మరచిపోయినాము. అది వేదాంతుల పనిగాని మనపని కాదందురేమో అట్లుగాదు. అది సర్వమానవ సాధారణ ధర్మము. అట్టి విచారణ చేయకపోయినచో నరకము తప్పదు. దీనినే యాజ్ఞ్యవల్కుడు
మహతీ వినష్ఠిః
అనగా అట్టి విచారణ లేకపోవుట మానవజన్మకొక గొప్పనష్టము అని చెప్పినాడు. మరుజన్మలో మనమే నల్లిగనో, పిల్లిగనో, పందిగనో జన్మింతుము. అప్పుడీలాటివిషయములనాలోచింప నవకాశమేలేదు. కాబట్లి మనము నేటినుండియే ఆ విచారణకు బూనవలెను. దీనినే త్యాగరాజుగారు
జన్మమెందుకు భక్తి లేని నర
అని గానమొనర్చినాడు. దీనిని గూర్చి అనేకమంది మహాపురుషులు, అనేకమంది భక్తులు ఆలోచించి ఒకనిర్ణయముచేసినారు. వారి మార్గములు భిన్న భిన్నములుగ నుండవచ్చునుగాని, గమ్యస్థాన మొక్కటియే. అది యేదనగా,
చిత్తే మహేశం నిభృతం నిధాతుం
సినిమాలలో సీనులు మారుచున్నట్లు క్షణక్షణానికి మారిపోవు చిత్తమును బంధించి యజమానుడైన పరమేశ్వరునకర్పింపవలెను. మనకెవరైనను అత్యంత ప్రీతిపాత్రమగు పదార్థమిచ్చిన దానిని మనము మనబిడ్డలు చూచుచుండగా మననోటిలో వేసుకొనుట న్యాయముకాదు. బిడ్డలకు పంచిపెట్టవలెను. అనగా మనకిష్టమైన వస్తువును ప్రేమపాత్రుల కర్పించవలెను. అట్లే మన కత్యంతము ఇష్టమైనదిచిత్తము. ప్రేమపాత్రమైనవాడు పరమేశ్వరుడు. కాబట్టి మనచిత్తమును పరమేశ్వరాధీనముచేయుట న్యాయము, ధర్మముకూడాను. ఈ చిత్తమను శబ్దమునకే సంస్కృతమున హృదయమను మరొకపేరు ఉన్నది.
హృదిఅయం: అయం-అనగా పరమాత్మ అని అర్థము. అతడెక్కడో లేడు. మన హృది అనగా చిత్తముననేకలడు అని భావము.
అయం అనునదిఇదం శబ్దముయొక్క రూపము- ఇదం శబ్దమునకిక్కడనుండు వ్యాకరణాచార్యులుగారు సమీపమని అర్థము చేప్పుచున్నారు. తర్కాచార్యులుగారు ప్రత్యక్షగతమని అర్ధము చెప్పుచున్నారు. మొదటిమతమున ఈశ్వరుడు ఎక్కడోగాక మనకత్యంత సమీపమునేయున్నాడనిభావము. రెండవమతమున ఆ సమీపమున నుండు ఈశ్వరుడుకూడా ప్రత్యక్షక్షగతుడు అని భావము.
మొత్తము పై మనకీచర్చవలన ఈశ్వరుడికి హృదయము స్థానము అని తేలినది. కాబట్టిమనము మనచిత్తమును పరమేశ్వరునకే అర్పించవలెను. మరొకనిఅచ్చటికి చేర్చరాదు. మరొక పదార్థమున కవకాశమీయరాదు. అదే మానవకర్తవ్యము, అదియే మనందరి యొక్క ధర్మము.