రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : వృధా కార్యకలాపాలు వదలిపెట్టడం
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి)
నాశ్రేయసి రతో విద్వా న్న విరుద్ధకథారుచిః |
ఉత్తరోత్తర యుక్తౌ చ వక్తా వాచస్పతి ర్యథా ||
(అయోధ్యాకాండ తొలి సర్గ)
శ్రీరాముడు మంచి జ్ఞానము కలవాడు అగుట చేత ప్రయోజనకారులు కాని వ్యర్థ కర్మలయందు ప్రవర్తించెడివాడు కాదు. క్షత్రియులు వినోదముకై సాగించెడి జూదము మొదలైనవి కూడ శ్రీరామునకు రుచించెడివి కావు. శ్రీరాముడు విరుద్ధ కథలయందు రుచి కలవాడు కాదు. తనకు శ్రేయస్సు కలిగించనివి, ధర్మమునకు విరుద్ధములైనవి అగు ప్రసంగములు చేయుటయందు అతనికి రుచి ఉండెడిది కాదు. సరసముగ తన తోడివారితో హాస్య ప్రసంగములు చేయలేకపోవుట అతని అసామర్థ్యమువలన కాదు. ధర్మవిరుద్ధములని, శ్రేయస్కరములు కావని వానియందు ప్రవర్తించెడివాడు కాదు. లోకములో గాని, వైదికులతోగాని ధర్మబద్ధ్మగు ప్రసంగము చేయునప్పుడు వారు చేసెడి వాదములకు ప్రతివాదముచేయుటలో బృహస్పతి వంటి నేర్పుకలవాడు.