Saturday, 23 July 2016

పంచకృత్య పరాయణా : పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-7

 

పంచకృత్య పరాయణా
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-7

త్రిమూర్తులకు ఆచార్యులు ఇచ్చిన పేర్లు  - "హరి-హర-విరించి".  వీరు మువ్వురూ అమ్మను ఆరాధిస్తున్నారని ఆచార్యులు అంటున్నారు. అలా అనడానికి ముందు "శివుడు నీతో కలసి ఉన్నప్పుడే స్పందిచగలడు - జగద్వ్యాపారం నిర్వహించగలడు" అంటున్నారు. అయితే త్రిమూర్తులలో ఒకరైన "హరుడు", మొదటి పాదంలో చెప్పిన "శివుడు" వేరు-వేరా ?

కాస్సేపు అందరూ ఒక్కటే అనే మాటని ప్రక్కన పెట్టండి. ఆ అద్వైత సిద్ధాంతానికి ఇక్కడ చోటు లేదు. కాబట్టే కదా ఈ స్తోత్రం రచన జరిగింది ? ప్రతీ ఒక్కరూ బాహ్యంగా వేరు, అంతరంగా ఒక్కటే అన్న స్థితిలో హరుడు, శివుడు వేరు వేరు.

"హర" అంటే "లయం చేసేవాడు", "నాశనం చేసేవాడు". "అపహరణ", "సంహరణ" అనే పదాల్లో ఈ శబ్దం వస్తుంది. "అపహర", "సంహర" అనే రూపంలోకి మారుతుంది. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికారుడు, రుద్రుడు లయకారుడు. హరుడంటే రుద్రుడు, లయకారుడు.

ఒకే పరమాత్మ మూడు పనులు చేయటానికి ముగ్గురు దేవతలుగా విభజింపబడుతుంది. ఈ మూడు క్రియలు చేయటానికి కావలసిన శక్తి, పరమాత్మ యొక్క మూలశక్తి నుండి వస్తుంది. ఆ మూలశక్తియే అమ్మవారు. ఆవిడ, పరమాత్మ అని పిలువబడే పరబ్రహ్మము యొక్క శక్తి. "నీ (అమ్మవారి) నుండి త్రిమూర్తులు మాత్రమే కాక ఈగలూ, చీమలతో సహా అన్ని జీవములూ శక్తిని పొందుతున్నాయి. అన్ని జడ పదార్థములలోనూ అంతర్లీనంగా ఉన్న శక్తి నీవే (అమ్మవారే)".

పరబ్రహ్మముయొక్క శక్తి పరబ్రహ్మమే అయి ఉండాలి. ఏ వస్తువైనా దాని శక్తి వలనే గుర్తింపు పొందుతోంది. శక్తిహీనమైతే ఉపయోగం లేకుండా అయిపోతోంది. ఒక మోటారుకారుకి 10 హార్సుపవరు ఇంజను ఉందంటే అర్థమేంటి ? ఒక కారుయొక్క హార్సుపవరే దాన్ని కారుగా చేస్తుంది. ఆ శక్తి క్షీణించిపోతే, అది పేరుకే కారు.  ఒక మోటారుకారు చెయ్యవలసిన పని అది చెయ్యగలదా ? బానెట్టులో చెయ్యిపెట్టి ఇంజనులో తడిమితే నీకు ఏమీ కాదు. నీకు షాకు కొట్టదు. ఒక వ్యక్తి తన శక్తి వల్లనే వ్యక్తి అవుతున్నాడు. అందుకని మనం పరబ్రహ్మ-శక్తి అని అంటున్నది ఆ పరబ్రహ్మమే. కానీ ఎవరైనా సరే ఏమీ చెయ్యకుండా , తన శక్తి చూపకుండా, ఉండవచ్చు. "శివం" అంటే మనం "ఎటువంటి బాహ్య కదలికాలేని నిశ్చల పరబ్రహ్మము" - అని అర్థం చేసుకోవాలి.

అటువంటి స్థితిలోనున్న శివం నుండి మనం జీవులుగా, మనసు బహిర్ముఖత్వంచెంది, ఇంద్రియాలు బాహ్యవస్తువులపై ఆసక్తితో ఆవిర్భవించాము. మన నిజ స్థితిని ఎప్పుడు తెలుసుకుంటాము ? ఎప్పుడు మాయనుండి విముక్తి చెంది, ప్రాపంచిక బంధాలనుండి విడివడతాము ? "ఎప్పుడయితే మనం శివంలో లీనమైపోతామో అప్పుడు" అనేది ఈ ప్రశ్నల సమాధానం. ఈ విముక్తి ద్వారా మనం పొందే మోక్షం, ప్రశాంతత కాబట్టి, మనం లీనమైపోయిన శివం కూడా ప్రశాంతముగా తన శక్తిని వ్యక్తంచేయకుండా ఉండి ఉండాలి. అందుకనే మనం క్రియారహితంగా జడంగా ఉన్న పదార్థమని పరబ్రహ్మము గురించి అంటాము. ఓ మూల ఉలుకూపలుకూ లేకుండా కూర్చున్న పిచ్చివాడిని చూసి మనం "వీడు బ్రహ్మపదార్థం లా ఉన్నాడని" అంటాము కదా ?

ఈ విధంగా మనం చూసినట్లయితే, ఒకరు లేక మరొకరు లేనప్పటికీ, శివుడు పరబ్రహ్మమనీ, అమ్మవారు పరబ్రహ్మ-శక్తి అనీ విడి విడిగా భావించవచ్చు.

ఇప్పుడు మనం, సృష్టి, స్థితి, లయలనే మూడు కార్యములకు మరో రెండు కలపాలి.  శివం యొక్క ప్రశాంతమైన స్థితి నుండి, మనం స్వస్వరూపం తెలియకుండా అయ్యాము కదా. ఇది బ్రహ్మ-శక్తి ద్వారానే జరిగింది. ఆమె మన స్వస్థితిని మరుగునపెట్టి మనలో అజ్ఞానం కల్పించి మాయా ప్రపంచంలో త్రోసివేసింది. చాలమంది గొప్పవారు ఈ మాయ నుండి తప్పించుకున్నారు, విడుదల అయ్యారు. వారు శివము తెలుసుకోగలిగిన స్వస్థితిని, నిరంతర ప్రశాంతత అయిన మోక్షమును, చేరుకున్నారు. దీనిద్వారా పరాశక్తి - బ్రహ్మశక్తి -  తన కరుణతో మనకు ముక్తినిచ్చే పని చేస్తున్నదని మనకు తెలుస్తోంది.  కాబట్టి సృష్టి, స్థితి, లయలకు మరో రెండు క్రియలు కలిశాయి. మొదటిది - మన స్వస్వరూప జ్ఞానమును మాయాశక్తితో మననుండి కప్పిపుచ్చడం. రెండవది - మాయనుండి విముక్తినివ్వడం - అంటే పరబ్రహ్మముతో మనను ఏకం చెయ్యడం.

ఈ పైన చెప్పిన రెండు పనులనూ "తిరోధానము", "అనుగ్రహము" అని అంటాము. మొదటిదాన్ని తిరోభవము అని కూడా అంటాము. "తిరస్" అనే ధాతువుకు "మరుగుపరచు", "తెరవేయు", "దాచిపెట్టు" అని అర్థాలు. వస్తువులు మాయమైపోయే తిరస్కరిణీ విద్య గురించి మీరు వినే ఉంటారు. తెర వేస్తే వస్తువు మరుగున పడిపోతుంది కదా.  మాయ అనే తెరవేసి మన స్వస్వరూపాన్ని మరుగుపరచి, మనను ఈ ప్రపంచంలో ఉంచడం పరాశక్తి పని. దీనిని తిరోధానము అని అంటారు. తెరతీసి విముక్తినివ్వడాన్ని అనుగ్రహము అంటారు. పరాశక్తి సృష్టి, స్థితి, లయలకు బ్రహ్మ, విష్ణు, రుద్రులను ఎలా నియమించిందో, అలాగే, ఈశ్వరుడిని (మహేశ్వరుడని కూడా అంటారు) తిరోధానమునకు నియమించింది. మెదటి మూడు కార్యములూ మాయ పరిధి లోకి వస్తాయి. ఈ మాయా జగత్తు వ్యవహారమంతా ఈశ్వరుని చేతుల్లో ఉంది. మాయను తొలగించి మోక్ష అనుగ్రహాన్ని ప్రసాదించడం సదాశివుని పని.

ఈ అయిదు పనులనూ పంచకృత్యములు అని అంటారు. ఇవి శైవ సాంప్రదాయములైన "శైవ సిద్ధాంతము" వంటి వాటిలోనూ ఉన్నాయి.  శైవములో పంచకృత్యములనూ పరమశివుడు చేస్తాడు. నటరాజు నృత్యమును " పంచకృత్య-పరమానంద-తాండవం" అని అంటారు. శాక్త సంప్రదాయంలో పంచకృత్యాలూ అమ్మవారి పని. లలితా సహస్రనామములలో అమ్మవారిని "పంచకృత్యపరాయణా" అని పిలుస్తారు.

అమ్మవారు ముఖ్యఅధికారిణిగా మిగిలిన అధికారులను నియమిస్తుంది. (సౌందర్యలహరి) శాక్త సంప్రదాయ స్తోత్రం కాబట్టి అలా అన్నారు అనుకోకూడదు. నిష్పక్షపాతంగా చూస్తే పంచకృత్యములకూ అమ్మవారు ముఖ్యఅధికారిణి అవడం సముచితమని తెలుస్తుంది.  ఎందుకని ? ఒక "కృత్యము" లేదా "కార్యం" అంటే చెయ్యవలసిన పని - శక్తిని ఉపయోగించవలసినదే. శక్తి అంటే అమ్మవారే కదా. శైవ సంప్రదాయంలో కూడా "శక్తి తో కూడిన శివుడు" అనే ఉన్నది. అంటే శివుని భార్యను శక్తి అంటారనీ, శివుడు శక్తితో కలసి ఉన్నాడనీనూ. సౌందర్యలహరిలో చెప్పబడ్డ విషయాలకూ, అద్వైత సిద్ధాంతమునకూ అత్యంత సామీప్యం ఉన్న కాశ్మీరు శైవంలో అత్యున్నత స్థాయి పరమాత్మను "శివ-శక్తి" అని అంటారు. కాబట్టి ఈ పంచకృత్యములనూ అమ్మవారికి అంటే పరాశక్తికి అప్పజెప్పడం సముచితమైనదే.  అలాగే పంచకృత్యములంటే నిశ్చలసమాధిస్థితి అనుభవం గురించి మాట్లాడటం కాదు.

అమ్మవారు పంచకృత్యములనూ అయిదుగురు వేర్వేరు దేవతలద్వారా చేస్తున్నదంటే ఆమె వారికంటే గొప్పదనే. ఈ అయిదుగురూ సర్వశక్తిమంతమైన పరబ్రహ్మమునుండి వచ్చినవారే కదా ? అన్నిటికన్న అతీతమైన శక్తి అని అర్థం.

ఈ శక్తి యొక్క మూలమే మన స్తోత్ర విషయం. సుందరి. ఆమెయే అన్ని క్రియలకూ ఆధారమైన శక్తి.  ఆమెయే ఈ అయిదుగురు దేవతల ఇల్లాలు.  నిజానికి మోక్షప్రదాత అయిన సదాశివునికన్నా ఆమెయే గొప్పది. ఆయన (సదాశివుడు) జ్ఞానస్వరూపమై ఉన్నప్పుడు - నిష్క్రియాపరత్వం వహించి ఉంటాడు. ఆ స్థితిలో ఆయన కంటే గొప్పవారూ లేరు, తక్కువ వారూ లేరు. కానీ ఆయన జ్ఞానప్రదానమనే కార్యం నిర్వహిస్తున్నప్పుడు, ఆయనను ఆ పని చేసేలా చేయగలిగిన శక్తి, ఆయన కన్నా గొప్పదై ఉండాలి.


(సశేషం)

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.