Friday 1 September 2017

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన

శ్రీ మహాగణాధిపతయే నమః



పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన

శంకరులు అమ్మవారి రూపము వర్ణించుచున్నారు.

క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా ।
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7॥


తన సన్నని నడుముకు సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ, శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ, చేతులలో విల్లమ్ములు, పాశాంకుశములు ధరించునదీ, పరమశివుని పరహంతా స్వరూపము అయినట్టిదీ అగు అంబిక మాముందు కనపడుగాక.

ఈ భూమిలో అమ్మవారిని దక్షిణాన కన్యాకుమారినుండి, ఉత్తరాన కాశ్మీరంలో క్షీరభవానీ వరకూ వివిధరూపాలలో ఆరాధిస్తారు. కానీ శ్రీవిద్యాతంత్రంలో చెప్పబడిన లలితా త్రిపురసుందరి లక్షణములు, ఆయుధములు ఒక్క కాంచీపుర కామాక్షికి మాత్రమే ఉన్నాయి. భూమి అంతటినీ ఒక దేవత అనుకుంటే, ఆ భూదేవియొక్క నాభిస్థానము కాంచీపురము.

క్వణత్-కాంచీదామా - సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ.  అమ్మవారు నడుస్తూంటే కాలి అందెలేకాక వడ్డాణపు చిరుమువ్వలూ సవ్వడిచేస్తాయి. పరిక్షీణామధ్యే - అమ్మవారి నడుము చాలా సన్ననిది. పరిణతశరత్చన్ద్రవదనా - శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ.  శరత్కాలవాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది. అమ్మవారి ముఖము, శరత్తులోని పున్నమిచంద్రుని వంటి కాంతి విరజిమ్ముతూ ఉంటుందని శంకరులు సూచిస్తున్నారు. అమ్మవారి వదనం అనుగ్రహం అనే వెన్నెల కురిపిస్తుంది.

ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - అమ్మవ్రారు తన చేతులలో విల్లు, అంబులు, పాశం, అంకుశములు ధరిస్తుంది. ఇవి శ్రీవిద్యాధిదేవత యొక్క ముఖ్య లక్షణాలు. ఈ దేవతను లలితా మహా త్రిపురసుందరి అని, కామేశ్వరి అను పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రూపంలో అమ్మవారికి పై రెండు చేతులలో పాశము, అంకుశము, క్రింది రెండు చేతులలో విల్లు, అమ్ములు ఉంటాయి. విల్లమ్ములు మన్మథుని వలెనే చెరకువిల్లు, పుష్పబాణములు.

రాగము, ద్వేషము - వీటిగురించి లోతుగా ఆలోచిస్తే ప్రాపంచిక జీవనం అంతా కామక్రోధములనబడే ఈ రాగ ద్వేషములతో నిండి ఉందని తెలుసుకుంటాము. ఈ రెండూ అమ్మవారి మాయాలీలలో భాగాలు. ఆవిడ అనుగ్రహలీలలో అవి మాయమయిపోతాయి. ఈ విషయం జ్ఞప్తిలో ఉంచుకుంటే మనం వీటిని అదుపులో ఉంచగలం. రాగస్వరూపపాశాఢ్యా - కోరిక అను పాశము కలది. క్రోధాకారాంకుశోజ్జ్వలా - కోపము అను అంకుశముతో మెరియునది. ఈ రెండు పేర్లూ లలితా సహస్రంలో ఉన్నాయి.  అమ్మవారి పాశం కామము/కోరికకు సంకేతం. పాశములాగా కామము మనను కట్టేస్తుంది. అలాగే అంకుశం క్రోధమునకు సంకేతం. కోపము మనను చీల్చి రెచ్చగొడుతుంది. పాశాంకుశములు ఒక ఏనుగుని అదుపులో ఉంచినట్టు, కామక్రోధములను అదుపులో ఉంచుతాయి, అంటే ఈ కామక్రోధముల జన్మస్థానమైన మనస్సును అదుపులో ఉంచుతుంది.

మరోలా చెప్పాలంటే  అమ్మవారు మనపై వాత్సల్యంచూపి, ఆమె చేతిలో ఉన్న పాశంలో మనలను కట్టివేసి, మనను కట్టివేస్తున్న ఇతర పాశాలకు దూరంచేస్తుంది. మనకు బంధములు లేని బంధము ఇస్తుంది. అలాగే ఆమె తన కోపమును మన క్రోధముపై చూపి, తన అంకుశముతో మన క్రోధమును చీల్చి, అణచివేసి ప్రశాంతతనిస్తుంది.

మనం కోరికను అమ్మవారితో అనుబంధంగానూ, కోపమును మన కోపముపై కోపముగానూ మార్చుకుంటే అమ్మవారి పాశాంకుశాలు మనను బంధవిముక్తులను చేస్తాయి.

లలితా సహస్రంలో పాశాంకుశాల తరువాతి రెండు నామములు  అమ్మవారి చేతుల్లోని విల్లమ్ములపై ఉన్నాయి. మనోరూపేక్షుకోదండా - మనస్సురూపమైన చెరకువిల్లు ధరించునది, పంచతన్మాత్రసాయకా - అయిదు తన్మాత్రలకు సంకేతమైన బాణములు కలిగినదీ.

మన్మథుడిచేతిలో విల్లమ్ములు ఏంచేస్తాయో తెలిసినదే. అమ్మవారి చేతుల్లో అవి ఏంచేస్తాయి ? విల్లు మన మనస్సులను మోక్షమునందు కోరిక కలిగినవాటిలా చేస్తుంది. అయిదు బాణములూ కూడా అంతే. అవి మన ఇంద్రియాల శక్తులను అమ్మవారివైపు తిప్పి శుచిగా చేస్తాయి.  ఇవి మనలో అమ్మవారిని స్తుతించే పాటలను వినాలనీ, ఆమె పాదపద్మములను తాకాలనీ, ఆమె స్వరూపాన్ని చూడాలనీ, అమ్మవారి పాదప్రక్షాళన చేసిన జలం అనే అమృతపు రుచి చూడాలని, అమ్మవారి నిర్మాల్యపుష్పములను సేకరించి వాటి దివ్యసుగంధపరిమళములను ఆఘ్రూణించవలెననీ, ఇలాంటి కోరికలు కలిగేలా చేస్తాయి.

క్లుప్తంగా చెప్పాలంటే అమ్మవారి పుష్పబాణములు మన ఇంద్రియలౌల్యాలను నిర్మూలిస్తాయి. ఆమె చెరకువిల్లు మన మనస్సును లయంచేస్తుంది. అది జరిగినప్పుడు మనకు జ్ఞానము, మోక్షము లభిస్తాయి. మనకి ఇంకేంకావాలి ?

ఇలా పవిత్రమయిన అయిదు ఇంద్రియాలూ, మనస్సూ కలిపి ఆరు కరణములు. తుమ్మెద తన ఆరు చరణములతో పద్మముపై వ్రాలినట్లు మనము ఈ ఆరు కరణములనూ అమ్మవారి పాదపద్మములపై లయంచేయాలి.

అమ్మవారు జ్ఞాన సామ్రాజ్యపు మహారాజ్ఞి. తాను మోక్షప్రదాయిని అని సూచించడానికి ఆమె కామక్రోధాలు నాశనంచేసి జ్ఞానం కలిగించు ఆయుధాలైన పాశాంకుశాలు రెండు చేతులతో ధరించింది. తాను మనస్సును, ఇంద్రియాలను తొలగించివేస్తుందని సూచించుటకు ఆమె విల్లమ్ములు ధరించింది.

శంకరులు ఈ శ్లోకంలో మొదట అమ్మవారి రూపం - నాల్గుచేతులు, వడ్డాణము ధరించిన సన్నని నడుము, శరత్కాలపౌర్ణమినాటి జాబిల్లినిపోలిన మోము - వర్ణించారు. ఈ భౌతికరూపవర్ణన తరువాత శంకరులు అమ్మ తత్త్వపు సారాంశాన్ని చెప్పుతున్నారు - పురమథితురాహోపురుషికా -  త్రిపురాసురసంహారి యెక్క అహంకార స్వరూపము అనే అర్థం వస్తుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే, శివుని యొక్క ’నేను’ అనే భావస్వరూపమే అమ్మవారు అని అర్థమవుతుంది. పరబ్రహ్మము యొక్క చిచ్ఛక్తి యే అమ్మవారు. జ్ఞానాంబ.

ఈ శ్లోకములో శంకరులు ఎంతో అందంగా వర్ణించిన అమ్మవారిని మన అంతర్నేత్రముతో చూడడము మన పని.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.