Wednesday 13 July 2016

పరమాచార్యుల అమృతవాణి : ధర్మాచరణకు రామానామామృతమే మందు


పరమాచార్యుల అమృతవాణి : ధర్మాచరణకు రామానామామృతమే మందు

కోస్వస్మిన్‌ సాంప్రతం లోకే? గుణవాన్‌? కశ్చవీర్యవాన్‌?
ధర్మజ్ఞశ్చ? కృతజ్ఞశ్చ? సత్యవాక్యో? దృఢవ్రతః?
చారిత్రేణ చకో యుక్తః? సర్వభూతేషు కోహితః?
................. కశ్చైక ప్రియదర్శనః?
ఆత్మవాన్‌ కో? జితక్రోధో?
ద్యుతిమాన్‌? కోఽన సూయకః?


ఇవన్నీ ప్రశ్నలు, ఈ ప్రశ్నల కన్నిటికీ ఉత్తరం ఒక్కటే! అది -

''ఇక్ష్వాకు వంశప్రభువో రామోనామ జనైశ్ర్శుతః''

వాల్మీకి మహర్షి  పైవిధంగా ప్రశ్నించాడు. నారదుడు నీవడిగిన కళ్యాణగుణపూర్ణుడు ఇక్ష్వాకువంశంలో జన్మించిన శ్రీరాముడు అని బదులు చెప్పాడు.

'కః ధర్మజ్ఞః ధర్మజ్ఞు డెవరు?' అని ప్రశ్నించిన వాల్మీకి మహర్షి యే తరువాత తన రామాయణ గ్రంథములో ’రామో విగ్రహవాన్ ధర్మః’ రాముడు ధర్మజ్ఞుడేకాదు ధర్మస్వరూపమే అని ఉల్లేఖించాడు.

ధర్మాచరణకు వాల్మీకి మతంలో రెండు ప్రధాన గుణములు. ఒకటి ధృతి, రెండవది నియమము- అవసరము, శ్రీరామచంద్రుడు తనతండ్రి ఇచ్ఛ మేరకు అరణ్యవాసమునకై బయలుదేరుతూ తల్లి ఆశీస్సులకై కౌసల్య వద్దకు వెళ్లి నమస్కరించాడు ఆమె ఇట్లు దీవించింది-

యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ |
సవై రాఘవ శార్దూల! ధర్మస్త్వా మభిరక్షతు ||


ఇందు తల్లి 'ధర్మంచర' ధర్మమార్గములో సంచరించు అని ఉపదేశించలేదు. ధర్మమే రాముని శీలము. స్వాభావికముగా రాముడు ధర్మరక్షకుడు. ఈ విషయం ఆమెకు తెలిసినదే. అందుచేత ఆమె పరోక్షముగా ధృతి నియమముల ఆవశ్యకతనుగూర్చి తెలుపుతూ 'రాఘవా! నీవు ధైర్యముతో నియమముతో ఏ ధర్మమును ఆచరిస్తూ ఉన్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక!' అని అన్నది. 'ధృతి' అనగా ధైర్యము. నియమము అనగా కట్టుబాటు. ధర్మపథంలో నియమము, ధృతి అత్యవసరములు.

ప్రతి భారతీయునకు రాముని శీలమే లక్ష్యం. ప్రతి భారతీయునకు రామనామమే మహామంత్రం. మనలను పీడించే రుజావైవిధ్యానికి. రామానామామృతమే మందు.

మనకు కావలసినది రామరక్ష. రాముడు ధర్మస్వరూపి. 'రామో విగ్రహవాన్‌ ధర్మః' ధర్మాచరణకు అవసరమైన ధృతి నియమములను రామనామామృతమే మనకు ఇయ్యగలదు.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.