Monday, 11 July 2016

పరమాచార్యుల అమృతవాణి : ఇదియే మానవసేవ. ఇదియే భగవత్సేవ



పరమాచార్యుల అమృతవాణి : ఇదియే మానవసేవ. ఇదియే భగవత్సేవ
(పరమాచార్యుల ఉపన్యాసములనుండి, కొన్ని మార్పులతో)

మనమూరక ఇదిపనికిరాదు. అదిపనికిరాదు. అని చెప్పుదుము కాని చేయవలసినదేమో చెప్పము. ఇప్పుడు ముదిగొండ వెంకట్రామశాస్త్రిగారు గురుకులాశ్రమ నిర్మాణమునకై కష్టించి 20 వేల రూపాయలను సంపాదించినామన్నారు. ఇప్పుడు మనకావిధముగ పనిచేయువారు కావలెను. మనలో అటువంటి త్యాగములేదు. మనముకూడా స్వార్థమువదలి త్యాగమున దృష్టినిలిపినచో మన సనాతన పత్రికలకు, మనధర్మమునకు, మన ప్రచారమునకు, అన్నిటికిని మంచి ఉచ్ఛస్థితి వచ్చితీరుతుంది. కాబట్టి మనముకూడా అట్టిత్యాగము చేయవలెను. నాడే మన సనాతనధర్మము జనసామాన్యమున వ్యాపించి విజయవంతము కాగలదు.

ప్రస్తుతము మీకు కర్తవ్యములగు రెండు మూడు విషయములను మాత్రము చెప్పెదను.

(1) గ్రామములోని పంచములు మనము వారికేలాటి సహాయము చెయ్యమేమో అను భయముతో వారికి కావలసిన సామాన్యమగు నీటివసతి మున్నగు సదుపాయములకుగూడ గవర్నమెంటువారినే కోరుచున్నారు. కాని మనము సాధ్యమైనంతవరకు వారికి సహాయము చేయవలెను. అది మనవిధి. అత్యంత అవసరముకూడాను.

(2) ఇతరమతమువారు తమ యిచ్చవచ్చినటుల ప్రచారమొనర్చి చాలమంది మనవారిని తమలో కలుపుకొనుచున్నారు. కాబట్టి మనమీ విషయమునందు ప్రమత్తులముగాక ఆ ప్రచారకులు వెళ్ళిన గ్రామములకు ఆస్థలములకు మనముకూడా వెళ్లి మనసంఘములనుకూడ నటస్థాపించి, అచ్చటి ప్రజలకు మన మతధర్మముల బోధించి మనమతమును మనము కాపాడుకొనవలయును. ఇది సనాతనుల కవశ్యకర్తవ్యమైయున్నది. ఇందుకు వలయు ధనము లేదని ఊరకుండక ధనము యాచించి అయినను చేయుట ముఖ్యము.

(3) మనము దినమున కొక వ్యక్తినయినను సంధ్యావందన మాచరించవలసినదనియు, భగవన్నామమము స్మరించుమనియు, ప్రార్థించవలయును. వారిచే ననుష్ఠింపజేయవలయును. ప్రతివారు ప్రతిదినముకూడా పరోపకారము చేయుచుండవలెను. ఇతరులను చేయుడు అని ప్రార్థించవలెను. వినకపోయిన మనము వారి పాదములనయిన పట్టుకొని వారినంగీకరింపజేయవలెను.

వై జెప్పిన కార్యములను మనగ్రామములలో మన పరిసరములలో మనమేమరక ప్రతినిత్య మనుష్ఠించవలయును. ఇది మన ధర్మము. ఇదియే సనాతన ధర్మపరుల కవశ్యాచరణీయము ముఖ్యముగా మనమందరమొకటిగచేరి మనమతమునువీడి మతాంతరముల కలియువారిని నిరోధించవలెను. మన మతగౌరవమును కాపాడవలెను. ఇదియే మానవసేవ. ఇదియే భగవత్సేవ. ఇదియే మన సమస్త వేదములయొక్కయు, శాస్త్రముల యొక్కయు తాత్పర్యమైయున్నది. ఈ తీర్మానములనే నేను మొదట ప్రతివాని హృదయమున చేసుకొనవలయునని చెప్పినది. దీనినే గీతలలో

యత్రయోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్థరః.

అని చెప్పబడినది.

మనకిప్పుడు రానున్న, జాతి, మత, భ్రంశకములగు చట్టములు రద్దుకావలయునన్న, నేజెప్పిన ఈ పనులను ప్రతివారాచరణకు తేవలయును.

ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీః.

పనిచేయువానికి విజయము రాకతప్పదు, కాబట్టి మీరందఱు నేటినుండియే అట్టి కార్యాచరణమునకు గడుంగుడు. విజయము రాకతప్పదు.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.