పరమాచార్యుల అమృతవాణి : ఆచార్య పరంపర అంటే ఏమి?
(జగద్గురుబోధలనుండి)
ప్రపంచంలో ఉన్న అందరలోనూ చైతన్యం ఉన్నది. అదియే నిజవస్తువు. సత్యవస్తువు. ఆ చైతన్యమే మన మందరమూ, ప్రతివారి దేహమునందూ ఈ చైతన్యం ఉన్నది.
'యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ' - మనీషాపంచకం.
ఒక దివ్వె ఉంటే అది వస్తువులను చూడడానికి కుపయోగపడుతుంది. కాని చూడడానికి కన్నులు లేకుంటే దివ్వెతో ఏమిపని? అంతా చీకటే. కన్నులున్నప్పటికీ మనసు లేకపోతే ఆ కన్నులు చూడలేవు. మైకం వచ్చి కింద పడితే కన్నులు తెరచి కొనియే ఉన్నాచూపు మాత్రం ఉండదు. అలాగే మనసు మాత్రం ఉన్నా చాలదు. ఆ మనసులో ఆత్మజ్యోతి అణగి ఉండాలి. ఆత్మజ్యోతి ప్రసారం ఉన్నంతవరకే మనస్సు తలచినా కన్నులు చూచిన దివ్వె వెలుగున వస్తువులచే కనుగొన్నా. దివ్వె మెలునులో జడవస్తువులు కనబడతై. వీని కన్నిటికీ మూలం ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతియే చైతన్యం. చైతన్యం ఒక్కటంటే ఒక్కటే. మెరుపు వెలుగులో వ్యత్యాసం ఏమీ లేదు. ఒక బొత్తాము నొక్కితే చాలు. దివ్వెలన్నీ వెలుగుతవి కాని దివ్వెను బట్టి వెలుగు ఉంటుంది. అట్లే చైతన్యం ఒక్కటే అయినా ఉపాధినిబట్టి పరిపాకాన్నిబట్టి వెలుగులో తేడా ఉంటుంది. ఆత్మజ్యోతిని నిండుగా ప్రకాశింపచేయడానికి, దుఃఖం లేని జీవనం గడపడానికి తగిన సాధనాలను మనకు ఉపదేశించడానికి, మనకు ఆచార్య పరంపరకావాలి. ఒక ఆచార్యులు తమ తరువాతి కాలంలో తాము నిర్దేశించిన పనులు చేయడానికి మరొకరికి తమ అధికార మిచ్చిపోతారు. ఇట్లా వరుసగా ఒకరి తరువాత ఒకరుగా వచ్చినవారే ఆచార్య పరంపర. అట్టి పరంపర యెడల మనము కృతజ్ఞత కలిగియుండాలి. ఆత్మనిధిని సురక్షితముగా మన కిచ్చెడివారు వీరే. ఈ నిధి మన కెవరెవరి మూలముగా ఈ నాటికిని లభ్యమవుతూందో వారి నందరనూ ధ్యానిస్తే మనకు వారి అనుగ్రహమధికంగా కలుగుతుంది. అంచేత ఆత్మతత్త్వ మెరుగగోరేవారందరికీ గురు పరంపరాజ్ఞానం అత్యవసరం.
మన ఆచార్య పరంపరలో పరమగురువు నారాయణుడు. తరువాత బ్రహ్మ. వశిష్ఠులు, శక్తి, పరాశరులు, వ్యాసులు, శుకులు. శుకులవరకూ గురు పరంపర పుత్ర పరంపరగాఉన్నది. శుకుడు పుట్టుకతోనే జ్ఞాని. కనుక వారిపిదప అది శిష్యపరంపరగా ఏర్పడ్డది.