Monday 29 February 2016

శంకరస్తోత్రాలు : దశశ్లోకీస్తుతిః (శివస్తుతి)



॥ श्री शंकराचार्य कृतः दशश्लोकीस्तुतिः ॥

॥ శ్రీ శంకరాచార్య కృతః దశశ్లోకీస్తుతిః ॥

సామ్బో నః కులదైవతం పశుపతే సామ్బ త్వదీయా వయం
సామ్బం స్తౌమి సురాసురోరగగణాః సామ్బేన సన్తారితాః ।
సామ్బాయాస్తు నమో మయా విరచితం సామ్బాత్పరం నో భజే
సామ్బస్యానుచరోఽస్మ్యహం మమ రతిః సామ్బే పరబ్రహ్మణి ॥ 1 ॥

సాంబుడే (జగదంబయగు పార్వతితో కూడిన శివుడు) మా కులదైవము . జీవులను పాలించు ఓ సాంబా! మేము నీవారిమే. సాంబునే స్తుతించుచున్నాను. దేవ - రాక్షస - సర్పగణములు సాంబుని చేతనే తరింపచేయబడినవి. నేను సాంబునకు నమస్కరించుచున్నాను.సాంబుని కంటే ఇతరుని పూజించను. నేను సాంబుని భక్తుడను. పరమాత్మయగు సాంబునియందే నాకు అనురాగము.


విష్ణ్వాద్యాశ్చ పురత్రయం సురగణా జేతుం న శక్తాః స్వయం
యం శమ్భుం భగవన్వయం తు పశవోఽస్మాకం త్వమేవేశ్వరః ।
స్వస్వస్థాననియోజితాః సుమనసః స్వస్థా బభూవుస్తత-
స్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 2॥

విష్ణుమూర్తి మొదలగు దేవతలు స్వయంగా త్రిపురాసురుని సంహరించుటకు సమర్థులు కాలేకపోయిరి. వారు  " ఓ భగవంతుడా! మేము దాసులము . నీవే మాకు ప్రభువు". అని ఈశ్వరుని వేడుకొనిరి. అంతట శివుడు వారిని వారి వారి స్థానములలో నియమింపగా దేవతలు ప్రశాంత మనస్కు లైతిరి. అటువంటి పరమాత్మయగు సాంబుని యందు నా హృదయము సుఖముగా రమించుగాక.


క్షోణీ యస్య రథో రథాఙ్గయుగలం చన్ద్రార్కబిమ్బద్వయం
కోదణ్డః కనకాచలో హరిరభూద్బాణో విధిః సారథిః ।
తూణీరో జలధిర్హయాః శ్రుతిచయో మౌర్వీ భుజఙ్గాధిప-
స్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 3॥

( త్రిపురాసురుని సంహరించునపుడు ) ఏ శివునకు భూమి రథముగానూ , సూర్యచంద్రులు రెండు రథచక్రములుగానూ , మేరు పర్వతము ధనుస్సుగానూ , విష్ణుమూర్తి బాణముగానూ , బ్రహ్మదేవుడు సారథిగానూ , సముద్రము అమ్ములపొదిగానూ , వేదములు అశ్వములుగానూ , సర్పరాజైన వాసుకి వింటి త్రాడుగానూ  అయ్యెనో అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


యేనాపాదితమఙ్గజాఙ్గభసితం దివ్యాఙ్గరాగైః సమం
యేన స్వీకృతమబ్జసమ్భవశిరః సౌవర్ణపాత్రైః సమమ్ ।
యేనాఙ్గీకృతమచ్యుతస్య నయనం పూజారవిన్దైః సమం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 4॥

ఏ శివుడు , మన్మథుని శరీరము దహించగా మిగిలిన బూడిదను దివ్యమైన అంగరాగము ( శరీరముపై పూసుకొను సుగంధద్రవ్యము) తో సమానముగా పూసుకొనుచున్నాడో , బ్రహ్మకపాలమును బంగారు పాత్రలతో సమానంగా స్వీకరించుచున్నాడో, విష్ణుమూర్తి నేత్రమును పూజా పద్మముతో సమానంగా అంగీకరించుచున్నాడో అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


గోవిన్దాదధికం న దైవతమితి ప్రోచ్చార్య హస్తావుభా-
వుద్ధృత్యాథ శివస్య సంనిధిగతో వ్యాసో మునీనాం వరః ।
యస్య స్తమ్భితపాణిరానతికృతా నన్దీశ్వరేణాభవ-
త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 5 ॥

" గోవిందుని కంటే గొప్పదేవుడు లేడు " అని బిగ్గరగా పలికి, చేతులెత్తి నమస్కరించి వ్యాసమహర్షి పిమ్మట శివుని వద్దకు వెళ్ళెను. అపుడు శివుని ఆజ్ఞను  పాలించు నందీశ్వరుడు వ్యాసుని చేతులను స్తంభింపచేసెను. అటువంటి పరమాత్మయగు సాంబునియందు నాహృదయము సుఖముగా రమించుగాక.


ఆకాశశ్చికురాయతే దశదిశాభోగో దుకూలాయతే
శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానన్దః స్వరూపాయతే ।
వేదాన్తో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 6॥

ఏ శివునకు ఆకాశము జటాజూటముగానూ , పదిదిక్కులు తెల్లని వస్త్రముగానూ , చంద్రుడు తలపై పుష్పముగానూ , మిక్కిలి స్థిరమైన ఆనందము స్వరూపముగానూ , వేదాంతము నివాసస్థానముగానూ , మంచి వినయము స్వభావముగానూ అగుచున్నదో అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


విష్ణుర్యస్య సహస్రనామనియమాదమ్భోరుహాణ్యర్చయ-
న్నేకోనోపచితేషు నేత్రకమలం నైజం పదాబ్జద్వయే ।
సమ్పూజ్యాసురసంహతిం విదలయంస్త్రైలోక్యపాలోఽభవ-
త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 7 ॥

విష్ణుమూర్తి పద్మములతో శివునకు సహస్రనామార్చన చేయుచూ, ఆపూజలో ఒక పద్మము తక్కువకాగా తామరవంటి తన నేత్రమునే శివుని పాదపద్మములపై సమర్పించి, చక్కగా పూజించి, రాక్షస సంహారము చేయుచూ మూడు లోకములకూ పాలకుడయ్యెను. అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


శౌరిం సత్యగిరం వరాహవపుషం పాదామ్బుజాదర్శనే
చక్రే యో దయయా సమస్తజగతాం నాథం శిరోదర్శనే ।
మిథ్యావాచమపూజ్యమేవ సతతం హంసస్వరూపం విధిం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 8 ॥

వరాహరూపము ధరించి , శివుని పాదపద్మములను దర్శించలేక , సత్యము పలికిన విష్ణుమూర్తిని పరమేశ్వరుడు దయతో సమస్త జగత్తులకు పాలకునిగా చేసెను. హంసరూపము ధరించి శివుని తలను చూడలేక , అబద్ధమాడిన బ్రహ్మదేవుని ఎప్పుడూ పూజించుటకు తగనివానిగా చేసెను. అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


యస్యాసన్ధరణీజలాగ్నిపవనవ్యోమార్కచన్ద్రాదయో
విఖ్యాతాస్తనవోఽష్టధా పరిణతా నాన్యత్తతో వర్తతే ।
ఓఙ్కారార్థవివేచనీ శ్రుతిరియం చాచష్ట తుర్యం శివం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 9 ॥

భూమి - నీరు - అగ్ని - వాయువు - ఆకాశము - సూర్యుడు - చంద్రుడు - మానవుడు అనునవి శివుని యొక్క ఎనిమిది స్వరూపములు. వీటికంటే వేరైనది ఏదీ లేదు. ఓంకారముయొక్క అర్థమును వివరించు వేదము నాలుగవవానిగా శివుడినే తెలుపుచున్నది. ( ’ ఓం’ అనుదానిలో అ - ఉ - మ అను మూడు వర్ణములు మరియు నాదము ఉన్నవి. వాటిలో ’అ’ కారము బ్రహ్మ , ’ ఉ’ కారము విష్ణువు, ’ మ ’ కారము రుద్రుడు. కాగా నాలుగవదైన నాదము శివుని స్వరూపము.) అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


విష్ణుబ్రహ్మసురాధిపప్రభృతయః సర్వేఽపి దేవా యదా
సమ్భూతాజ్జలధేర్విషాత్పరిభవం ప్రాప్తాస్తదా సత్వరమ్ ।
తానార్తాఞ్శరణాగతానితి సురాన్యోఽరక్షదర్ధక్షణా-
త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 10 ॥

విష్ణుమూర్తి - బ్రహ్మ - దేవేంద్రుడు మొదలైన దేవతలందరూ క్షీరసాగరము నుండి పుట్టిన హాలాహలమును చూచి భయపడినప్పుడు, దుఃఖితులై శరణుజొచ్చిన ఆదేవతలను అర్థక్షణములో రక్షించిన పరమాత్మయగు సాంబుని యందు నా హృదయము సుఖముగా రమించుగాక.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం దశశ్లోకీస్తుతిః  సమ్పూర్ణః ॥

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.