Wednesday, 24 February 2016

శంకరస్తోత్రాలు : పాణ్డురఙ్గాష్టకమ్



॥ श्री शंकराचार्य कृतं पाण्डुरङ्गाष्टकम् ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం పాణ్డురఙ్గాష్టకమ్ ॥

మహాయోగపీఠే తటే భీమరథ్యా
వరం పుణ్డరీకాయ దాతుం మునీన్ద్రైః ।
సమాగత్య నిష్ఠన్తమానన్దకన్దం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 1॥

భీమరథీ నది ఒడ్డునందలి మహాయోగపీఠమునందు పుండరీకుడను భక్తునకు వరమిచ్చుటకై మునీంద్రులతో కలసి వచ్చి నిలుచున్నవాడు, ఆనందమునకు మూలమైనవాడు, పరబ్రహ్మలక్షణములున్నవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


తటిద్వాససం నీలమేఘావభాసం
రమామన్దిరం సున్దరం చిత్ప్రకాశమ్ ।
వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 2॥

మెరుపువలే ప్రకాశించు వస్త్రములు ధరించినవాడు, నల్లని మబ్బువలే విరాజిల్లుచున్నవాడు, లక్ష్మికి నివాసమైనవాడు, సుందరుడు, జ్ఞానజ్యోతియైనవాడు, శ్రేష్ఠుడు, పీఠంపై సమానంగా పాదములుంచినవాడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం
నితమ్బః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ ।
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 3॥

’ నా భక్తులకు సంసారసముద్రపు లోతు ఇంతే’  అని చూపుచున్నట్లుగా రెండు చేతులతో మొలను పట్టుకొన్నవాడు, బ్రహ్మదేవుడు నివసించుటకై బొడ్డులో పద్మమును ధరించినవాడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


స్ఫురత్కౌస్తుభాలఙ్కృతం కణ్ఠదేశే
శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్ ।
శివం శాన్తమీడ్యం వరం లోకపాలం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 4॥

కంఠముపై ప్రకాశించు కౌస్తుభమణిచే అలంకరింపబడినవాడు, లక్ష్మిచే సేవింపబడు భుజకీర్తులు కలవాడు, శ్రీనివాసుడు, మంగళకరుడు, శాంతస్వరూపుడు, స్తుతింపదగినవాడు, ఉత్తముడు, లోకపాలకుడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


శరచ్చన్ద్రబిమ్బాననం చారుహాసం
లసత్కుణ్డలాక్రాన్తగణ్డస్థలాన్తమ్ ।
జపారాగబిమ్బాధరం కఽజనేత్రం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్॥ 5॥

శరదృతువునందలి చంద్రబింబము వంటి ముఖము కలవాడు, అందమైన నవ్వు కలవాడు, ప్రకాశించు కుండలములాక్రమించిన చెంపలు కలవాడు, మంకెనపువ్వు వలే ఎఱ్ఱనైన క్రిందిపెదవి కలవాడు, పద్మనేత్రుడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


కిరీటోజ్వలత్సర్వదిక్ప్రాన్తభాగం
సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః ।
త్రిభఙ్గాకృతిం బర్హమాల్యావతంసం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్॥ 6॥

కిరీటకాంతులచే సర్వదిక్కులనూ ప్రకాశింపచేయుచున్నవాడు, దేవతలచే అమూల్యములైన దివ్యరత్నములతో పూజింపబడినవాడు, మూడు వంపులుకల శరీరంకలవాడు, నెమలి పింఛముల మాలను తలపై అలంకరించుకున్నవాడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


విభుం వేణునాదం చరన్తం దురన్తం
స్వయం లీలయా గోపవేషం దధానమ్ ।
గవాం బృన్దకానన్దదం చారుహాసం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 7॥

అంతటా వ్యాపించినవాడు, వేణునాదం చేయువాడు, సంచరించుచున్నవాడు, నాశనం లేనివాడు, స్వయంగా గోపాల వేషమును ధరించినవాడు, పశువుల మందలకు ఆనందమునిచ్చువాడు, అందమైన నవ్వు కలవాడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


అజం రుక్మిణీప్రాణసఞ్జీవనం తం
పరం ధామ కైవల్యమేకం తురీయమ్ ।
ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 8॥

పుట్టుకలేనివాడు, రుక్మిణీ ప్రాణప్రియుడు, పరంధాముడు, కైవల్యమూర్తి, అద్వితీయుడు, సత్త్వరజస్తమోగుణములంటనివాడు, ప్రసన్నుడు, భక్తుల బాధలను నశింపచేయువాడు, దేవదేవుడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


స్తవం పాణ్డురఙ్గస్య వై పుణ్యదం యే
పఠన్త్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్ ।
భవామ్భోనిధిం తే వితీర్త్వాన్తకాలే
హరేరాలయం శాశ్వతం ప్రాప్నువన్తి ॥9

భక్తితో , నిశ్చలమనస్సుతో ఎవరైతే పుణ్యకరమైన ఈ పాండురంగస్తోత్రమును పఠించెదరో వారు సంసార సముద్రమును దాటి అంతకాలమునందు శాశ్వతమైన విష్ణులోకమును చేరెదరు.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం పాణ్డురఙ్గాష్టకం సమ్పూర్ణమ్ ॥

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.