Wednesday, 3 February 2016

శంకరస్తోత్రాలు : శివపఞ్చాక్షరస్తోత్రమ్

॥ श्री शंकराचार्य कृतं शिवपञ्चाक्षरस्तोत्रम् ॥

|| శ్రీ శంకరాచార్య కృతం శివపఞ్చాక్షరస్తోత్రమ్||

నాగేన్ద్రహారాయ త్రిలోచనాయ
భస్మాఙ్గరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయ
తస్మై నకారాయ నమః శివాయ ॥ 1 ॥

నాగేంద్రుని హారముగా ధరించినవాడు, మూడుకన్నులు కలవాడు, భస్మమును ఒంటినిండా పూసుకున్నవాడు, మహేశ్వరుడు, నిత్యమైనవాడు, పరిశుద్ధుడు, దిగంబరుడు, "నమశ్శివాయ" అను మంత్రము నందలి ’న’అను అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము.

మన్దాకినీ సలిలచన్దనచర్చితాయ
నన్దీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
మన్దారపుష్ప బహుపుష్ప సుపూజితాయ
తస్మై మకారాయ నమః శివాయ ॥ 2 ॥

ఆకాశగంగా జలమనే చందనము పూయబడినవాడు, నందీశ్వరుడు మొదలైన ప్రమథగణములకు నాయకుడు, మందారము మొదలైన అనేక పుష్పములచే పూజింపబడినవాడు, "నమశ్శివాయ"మంత్రమునందలి ’మ’అను అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము.

శివాయ గౌరీవదనాబ్జవృన్ద
సూర్యాయ దక్షాధ్వరనాశకాయ ।
శ్రీనీలకణ్ఠాయ వృషధ్వజాయ
తస్మై శికారాయ నమః శివాయ ॥ 3 ॥

మంగళకరుడు, పార్వతీ ముఖమనే పద్మసముదాయమును వికసింపచేయు సూర్యుడు, దక్షుని యాగము నాశనము చేసినవాడు, నల్లని కంఠము కలవాడు, జెండాపై ఎద్దు చిహ్నమున్నవాడు, "నమశ్శివాయ" అను మంత్రమునందలి ’శి’ అను అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము.


వసిష్ఠ కుమ్భోద్భవ గౌతమార్య
మునీన్ద్ర దేవార్చితశేఖరాయ ।
చన్ద్రార్క వైశ్వానరలోచనాయ
తస్మై వకారాయ నమః శివాయ ॥ 4 ॥

వసిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు, మొదలైన మునీంద్రుల చేత , దేవతలచేత పూజింపబడు జటాజూటము కలవాడు, చంద్రుడు - సూర్యుడు - అగ్ని మూడు కన్నులుగా కలవాడు, "నమశ్శివాయ"అను మంత్రమునందలి ’వ’అను అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము.

యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగమ్బరాయ
తస్మై యకారాయ నమః శివాయ ॥ 5 ॥

యక్షస్వరూపుడు, జటలను ధరించినవాడు, ’పినాకము’ అను ధనుస్సును చేతిలో పట్టుకున్నవాడు, సనాతనుడు, ఆకాశము నందుండు దేవుడు, దిగంబరుడు, "నమశ్శివాయ" అను మంత్రము నందలి ’య’ అను అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము.

|| శ్రీ శంకరాచార్యకృతం శివపంచాక్షర స్తోత్రమ్ సంపూర్ణమ్||

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.