॥ श्री शंकराचार्य कृतं अच्युताष्टकम् ॥
॥ శ్రీ శంకరాచార్య కృతం అచ్యుతాష్టకమ్ ॥
అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ ।
శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచన్ద్రం భజే ॥ 1 ॥
ప్రళయముననూ నాశములేనివాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పైవాడు, యోగిహృదయానందకరుడు, ప్రళయాంతమున కూడ నశించక సముద్రముపై శయనించు జ్ఞానస్వరూపుడు, సచ్చిదానందరూపుడు, శమము దమము మొదలైన సాధనములచే కల్గెడి ఉదారబుద్ధిచేత తెలియదగినవాడు, సర్వాంతర్యామియై భక్తచిత్తములను పాపములను హరించువాడు, లక్ష్మీధరుడు, సర్వవిద్యాపతి, గోపికావల్లభుడు, రామావతారమెత్తి జానకీభర్తయై రంజిలినవాడు అట్టి స్వామిని సేవింతును.
అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితమ్ ।
ఇన్దిరామన్దిరం చేతసా సున్దరం దేవకీనన్దనం నన్దనం సన్దధే ॥ 2 ॥
జననమరణాది వికృతి లేనివాడు, అందమైన ముంగురులు కలవాడు, సత్యభామాపతి, మధువను యోగవిద్యచే తెలియదగినవాడు, శ్రీధరుడు, రాధికకు ఆరాధ్యుడు, శ్రీలక్ష్మీదేవికి నివాసమైనవాడు, మాటలకందని మనస్సుందరుడు, సర్వానందకరమైన మనస్సువాడు, అట్టి దేవకీదేవి హృదయమునకు ఆనందము కల్గించునట్టి యా స్వామిని ధ్యానింతును.
విష్ణవే జిష్ణవే శఙ్ఖినే చక్రిణే రుక్మినీరాగిణే జానకీజానయే ।
వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః ॥ 3 ॥
సర్వవ్యాపకుడవు, జయశీలుడవు, అహంకారమనెడి శంఖమును చేతబట్టి యూదువాడవు, సర్వప్రాణుల మనస్తత్వచక్రమును త్రిప్పువాడవు, కృష్ణావతారమున రుక్మిణిని, రామావతారమున సీతాదేవిని అలరించినవాడవు, గోపికా హృదయవర్తివై వారిచే పూజలందుకొన్నవాడవు, కంససంహారకుడవు, మురళీ నాదము చేయుచు ఆత్మానంద స్వరూపుడవై విలసిల్లుచుండు నట్టి ఓ స్వామీ! నీకు నమస్కారము.
కృష్ణ గోవిన్ద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే ।
అచ్యుతానన్త హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక ॥ 4 ॥
ఓ కృష్ణా! నీవు హల(నాగలి) రూపముతో భూమిని దున్ని సస్యవంతము చేయుచున్నావు. లేదా భక్త హృదయ భూములను దున్ని సంసార దుష్టబీజములను సమూలముగా నాశము చేయుచున్నావు. అందుకే కృష్ణుడవనిపించుకున్నావు. అవతారములెత్తి గో భూరక్షణ చేసినాడవు. కావున గోవిందుడవైతివి. యోగి హృదయములను రంజించువాడవై రాముడవైతివి. సర్వజ్ఞాననివాసమై నారాయణుడవైతివి. సర్వమునందు వసించుదేవుడవు. నీవన్నిటను కూడ జయము గొనువాడవు. ఓటమిలేదు. నాశములేనివాడవు. నీకు తుదిలేదు. మౌనవ్రతాదులచేత సాధ్యుడవు. ఎప్పుడును ఊర్థ్వ రూపుడవే. సంసార ధర్మములకు కట్టుబడి క్రిందికి జారనివాడవు. ద్వారకయందున్నను - మరెక్కడున్నను భక్తులను రక్షించువాడవు. కనుకనే ద్రౌపదిని రక్షించితివి.
రాక్షసక్షోభితః సీతయా శోభితో దణ్డకారణ్యభూపుణ్యతాకారణః ।
లక్ష్మణేనాన్వితో వానరైః సేవితోఽగస్త్యసమ్పూజితో రాఘవః పాతు మామ్ ॥ 5 ॥
స్వామీ! భూభారము తగ్గింప నెంచి రాముడుగా అవతరించితివి. సీతాలక్ష్మణ సమన్వితుండవై నీ పాదములచే దండకారణ్య భూమిని పవిత్రము చేయుచు దుష్టరాక్షస సంహారము చేయుచు అగస్త్యాది ఋషీశ్వరులచే పూజింపబడుచు, సీతాపహరణ మొనర్చిన రావణాది రాక్షసులనెల్ల వానరసేనా సమేతుడవై తుదముట్టించి సీతాసమేతుడవై లోకమును పాలించితివి గదా! అట్టి ఓ రాఘవా నన్ను కాపాడుము.
ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం కేశిహా కంసహృద్వంశికావాదకః ।
పూతనాకోపకః సూరజాఖేలనో బాలగోపాలకః పాతు మామ్ సర్వదా ॥ 6 ॥
ఓ దేవా! కృష్ణావతారమునెత్తితివి. బాల గోపాలుడవుగా ఉన్నప్పుడే పూతనా రాక్షసిని చంపితివి. కాళీయుని చంపి యమునానదిని నిరుపద్రవముగా చేసితివి. ధేనుకాసురుని, కేశిరాక్షసుని - ఇట్లెందరినో దుష్టులను చంపితివి. చివరకు మేనమామయైననూ పరమదుష్టుడైన కంసుని చంపితివి. ఇట్లు లోకకల్యాణ కార్యములు చేయుచు మురళీనాదముతో సకలప్రాణికోటి హృదయములను పులకింపచేయునట్టి ఓ కృష్ణా నన్ను పాలింపుము.
విద్యుదుద్ధయోతవానప్రస్ఫురద్వాససం ప్రావృడమ్భోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ ।
వన్యయా మాలయా శోభితోరఃస్థలం లోహితాఙ్ఘ్రిద్వయం వారిజాక్షం భజే ॥ 7 ॥
ఓ ప్రభూ! ఏమి అందమయ్యా! నల్లని మబ్బువలె మెరిసిపోవు శరీరము - అట్టి శరీరమున మెరుపుతీగ విధమున తళతళలాడు బంగారు పట్టుపుట్టము. వక్షఃస్థలమున తులసిమాల, తామరరేకులవలె అందములై విశాలములైన కన్నులు, ఎఱ్ఱగా చిగురుటాకులవలె జగన్మోహనములైన పాదములు ఇట్టి సుందరమూర్తిని సర్వదా సేవింతును.
కుఞ్చితైః కున్తలైర్భ్రాజమానాననం రత్నమౌలిం లసత్ కుణ్డలం గణ్డయోః ।
హారకేయూరకం కఙ్కణప్రోజ్జ్వలం కిఙ్కిణీమఞ్జులం శ్యామలం తం భజే ॥ 8 ॥
నీ రూపము ఎంత చూచిననూ తనివి తీరదయ్యా, వంపులు తిరిగిన ముంగురులతో చూడముచ్చటయైన ముఖము, శిరమున కుచ్చుముడి, చెక్కిళ్ళపై కాంతులుచిమ్ము కర్ణ కుండలములు , మెడలో హారములు, భుజములందు కేయూరములు, ముంజేతులయందు కంకణములు, మొలకు చిరుగంటల మొలత్రాడు. ఈ దివ్య సుందరరూపుని నిన్ను ఎల్లప్పుడును సేవింతును.
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ ।
వృత్తతః సున్దరం కర్తృ విశ్వమ్భరం తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్ ॥ 9 ॥
స్రగ్విణీవృత్తములతో నుత్తమ వర్తనములతో సుందరమైనదియు, తెలిసికొనదగిన విశ్వంభరుని తత్త్వము గలదియు, కోరికలు తీర్చునదియునైన ఈ అచ్యుతాష్టకమును ఏ పురుషుడు భక్తితో ప్రతిదినమును కోరి పఠించునో వానికి ఆ హరి వెంటనే వశమును పొందిన వాడగుచుండును.
॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం అచ్యుతాష్టకం సమ్పూర్ణమ్ ॥
No comments:
Post a Comment