Friday, 26 February 2016

శంకరస్తోత్రాలు : శివనామావళ్యష్టకమ్





॥ श्री शंकराचार्य कृतं शिवनामावळ्यष्टकम् ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం శివనామావళ్యష్టకమ్ ॥

హే చన్ద్రచూడ మదనాన్తక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శమ్భో ।
భూతేశ భీతభయసూదన మామనాథం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 1 ॥

ఓ చంద్రుడు తలపై నున్న ఈశ్వరుడా! మన్మథుని సంహరించినవాడా! చేతిలో శూలము ధరించినవాడా! శాశ్వతుడా! కైలాసముపై నుండువాడా! పార్వతీ పతీ! మహేశుడా! శంభో! భూతనాథుడా! భయపడువారి భయములను పోగొట్టువాడా! అనాథుడనైన నన్ను సంసార దుఃఖారణ్యము నుండి నన్ను రక్షించుము.


హే పార్వతీహృదయవల్లభ చన్ద్రమౌలే
భూతాధిప ప్రమథనాథ గిరీశచాప ।
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 2 ॥

ఓ పార్వతీ హృదయ వల్లభుడా!  చంద్రమౌళీ! భూతనాథుడా! ప్రమథగణములకు నాయకుడా!  మేరుపర్వతమును విల్లుగా చేసుకున్నవాడా!  ఓ వామదేవుడా!  భవుడా! రుద్రుడా! పినాకపాణీ! జగదీశుడా!  సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము.


హే నీలకణ్ఠ వృషభధ్వజ పఞ్చవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ ।
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 3 ॥

ఓ నల్లని కంఠము కలవాడా! జెండాపై ఎద్దు గుర్తు కలవాడా! అయిదు ముఖములున్న వాడా!  లోకేశ్వరుడా! సర్పములను కంకణములుగా ధరించినవాడా! ప్రమథగణములకు నాయకుడా!  ఈశ్వరుడా!  బరువైన జటలు కలవాడా! పశుపతీ! గిరిజాపతీ!    జగదీశుడా! సంసార దుఃఖారణ్యము నుండి నన్ను రక్షించుము.


హే విశ్వనాథ శివ శఙ్కర  దేవదేవ
గఙ్గాధర ప్రమథనాయక నన్దికేశ ।
బాణేశ్వరాన్ధకరిపో హర లోకనాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 4 ॥

ఓ విశ్వనాథుడా! శివుడా! శంకరుడా! దేవతలకే దేవుడైనవాడా! గంగను ధరించినవాడా! ప్రమథగణములకు నాయకుడా!  నందీశ్వరుని ఏలెడువాడా!  బాణాసురుని కాపాడినవాడా!  అంధకుడను రాక్షసుని సంహరించినవాడా!  హరుడా!  లోకనాథుడా! జగదీశుడా!  సంసార దుఃఖారణ్యము నుండి నన్ను రక్షించుము.


వారాణసీపురపతే మణికర్ణికేశ
వీరేశ దక్షమఖకాల విభో గణేశ ।
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 5 ॥

వారాణసీ పట్టణమును ఏలువాడా!  మణికర్ణికా ఘట్టమును పాలించువాడా! వీరేశుడా! దక్షుని యజ్ఞమును నాశనం చేసినవాడా!  అంతటా వ్యాపించినవాడా! ప్రమథగణములకు నాయకుడా! అన్నీ తెలిసినవాడా!  అందరి హృదయములందు నివసించువాడా!  ప్రభూ! జగదీశుడా!  సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము.


శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాలో
హే వ్యోమకేశ శితికణ్ఠ గణాధినాథ ।
భస్మాఙ్గరాగ నృకపాలకలాపమాల
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 6 ॥

శ్రీమంతుడగు మహేశ్వరా!  కృపకలవాడా!  దయామయా! ఆకాశమే జుట్టుగా కలవాడా! నల్లని కంఠము కలవాడా! ప్రమథగణములకు నాయకుడా!  భస్మను పూసుకొన్నవాడా!  మానవుల కపాలములను మాలగా ధరించినవాడా!  ఓ జగదీశుడా! సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము.


కైలాసశైలవినివాస వృషాకపే హే
మృత్యుఞ్జయ త్రీనయన త్రిజగన్నివాస ।
నారాయణప్రియ మదాపహ శక్తినాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 7 ॥

కైలాస పర్వతము నందు నివసించువాడా! ధర్మస్వరూపుడైన జగద్రక్షకుడా! మృత్యువును జయించినవాడా!  మూడు కన్నులు కలవాడా!  మూడు లోకములందు నివసించువాడా! నారాయణునకు ఇష్టుడైనవాడా! గర్వమును పోగొట్టువాడా! శక్తి  స్వరూపిణి అగు పార్వతికి నాథుడా!  ఓ జగదీశుడా! సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము.


విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ ।
హే విశ్వనాథ కరుణామయ దీనబన్ధో
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 8॥

విశ్వము నేలెడివాడా! సమస్త ప్రపంచములకు పుట్టుక మొదలగు దుఃఖములను నశింపచేయువాడా! విశ్వస్వరూపుడా! విశ్వమునకు అంతరాత్మయైనవాడా!  మూడు లోకములందు  అధిక గుణములున్న ఒక్కడైన ఈశ్వరుడా! ఓ విశ్వనాథుడా!  కరుణామయుడా!  దీనులకు బంధువైనవాడా! జగదీశుడా!  సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము.


గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ
పఞ్చాననాయ శరణాగతకల్పకాయ ।
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ 9 ॥

పార్వతీ విలాసములకు నివాసమైనవాడు, మహేశ్వరుడు,  అయిదు ముఖములున్నవాడు, శరణు పొందినవారి కోరికలు తీర్చు కల్పవృక్షము ,  సర్వరూపుడు, సమస్త ప్రపంచములను పాలించువాడు, దారిద్ర్య దుఃఖమును తగులబెట్టువాడు  అగు ఆ పరమేశ్వరునకు నమస్కారము.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శివనామావళ్యష్టకం సమ్పూర్ణమ్ ॥

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.