Monday 1 February 2016

శంకరస్తోత్రాలు : మీనాక్షీ పఞ్చరత్న స్తోత్రమ్

॥ श्री शंकराचार्य कृतं मीनाक्षी पञ्चरत्न स्तोत्रं  ॥



|| శ్రీ శంకరాచార్య కృతం మీనాక్షీ పఞ్చరత్న స్తోత్రం  ||

ఉద్యద్భాను సహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం
బిమ్బోష్ఠీం స్మితదన్తపఙ్క్తిరుచిరాం పీతామ్బరాలఙ్కృతామ్ ।
విష్ణుబ్రహ్మసురేన్ద్రసేవితపదాం తత్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 1॥

ఉదయించుచున్న వేలకోట్ల సూర్యులతో సమానమైనదీ, కంకణములతో, హారములతో ప్రకాశించుచున్నదీ, దొండపండ్లవంటి పెదవులు కలదీ, చిరునవ్వులొలుకు దంతముల కాంతి కలదీ, పీతాంబరములను ధరించినదీ, విష్ణు - బ్రహ్మ - దేవేంద్రులచే సేవించబడునదీ, తత్త్వస్వరూపిణి అయినదీ, శుభమును కలిగించునదీ, దయాసముద్రమైనదీ అగు మీనాక్షీదేవిని నేను  ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను.


ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేన్దువక్త్ర ప్రభాం
శిఞ్జన్నూపురకిఙ్కిణిమణిధరాం పద్మప్రభాభాసురామ్ ।
సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 2॥

ముత్యాలహారములు అలంకరించిన కిరీటముతో శోభించుచున్నదీ, నిండుచంద్రుని వంటి ముఖకాంతి కలదీ, ఘల్లుమంటున్న అందెలు ధరించినదీ, పద్మముల వంటి సౌందర్యము కలదీ, కోరికలన్నిటినీ తీర్చునదీ, హిమవంతుని కుమార్తెయైనదీ, సరస్వతీ - లక్ష్మీదేవిలచే సేవించబడుచున్నదీ, దయాసముద్రమైనదీ అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను.

శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీఙ్కారమన్త్రోజ్జ్వలాం
శ్రీచక్రాఙ్కిత బిన్దుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్ ।
శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 3॥

శ్రీవిద్యాస్వరూపిణీ, శివుని ఎడమభాగమునందు నివసించునదీ, హ్రీంకార మంత్రముతో ఉజ్జ్వలమైనదీ, శ్రీచక్రములోని బిందువు మధ్య నివసించునదీ, ఐశ్వర్యవంతమైన సభకు అధిదేవతయైనదీ, కుమారస్వామీ - వినాయకులకు కన్నతల్లియైనదీ, జగన్మోహినియైనదీ, దయాసముద్రమైనదీ అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను.


శ్రీమత్సున్దరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్ ।
వీణావేణుమృదఙ్గవాద్యరసికాం నానావిధాడామ్బికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 4॥

సుందరేశ్వరుని భార్యయైనదీ, భయమును తొలగింపచేయునదీ,    జ్ఞానమును ఇచ్చునదీ, నిర్మలమైనదీ, నల్లని కాంతి కలదీ, బ్రహ్మదేవునిచే ఆరాధించబడునదీ, నారాయణుని సోదరియైనదీ, వీణ - వేణు - మృదంగవాద్యములను ఆస్వాదించునదీ, నానావిధములైన ఆడంబరములు కలదీ, దయాసముద్రమైనదీ అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను.


నానాయోగిమునీన్ద్రహృన్నివసతీం నానార్థసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాఙ్ఘ్రియుగలాం నారాయణేనార్చితామ్ ।
నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 5॥

అనేక యోగుల - మునీశ్వరుల హృదయములందు నివసించునదీ, అనేక కార్యములను సిద్ధింపచేయునదీ, బహువిధపుష్పములతో అలంకరింపబడిన రెండు పాదములు కలదీ, నారాయణునిచే పూజింపబడునదీ, నాదబ్రహ్మస్వరూపిణియైనదీ, శ్రేష్థమైనదానికంటే శ్రేష్థమైనదీ, అనేక పదార్థముల తత్వమైనదీ, దయాసముద్రమైనదీ అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను.

|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం మీనాక్షీ పఞ్చరత్న స్తోత్రం సమ్పూర్ణమ్ ||

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.