Tuesday 23 February 2016

శంకరస్తోత్రాలు : శ్రీకృష్ణాష్టకమ్

 

॥ श्री शंकराचार्य कृतं श्रीकृष्णाष्टकम् ॥

|| శ్రీ శంకరాచార్య కృతం శ్రీకృష్ణాష్టకమ్ ||

శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో
ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహన్తాబ్జనయనః ।
గదీ శఙ్ఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 1 ॥

లక్ష్మీదేవితో కూడియున్నవాడు, సర్వవ్యాపకుడు, స్థావర జంగమాత్మకమైన ప్రపంచమునకెల్ల  జనకుడు, వేదములచేతనే తెలియందగినవాడు, సమస్త బుద్ధి ప్రకృతులకును సాక్షీభూతుడు, శుద్ధుడు, పాపములను హరించువాడు, రాక్షసులను సంహరించువాడు, తామరపూవులవంటి కన్నులు కలవాడు, శంఖచక్రగదాద్యాయుధములతో నుండువాడు, నిర్మలమైన వనమాలకలవాడు, స్థిరమైన ప్రకాశము కలవాడు, శరణుజొచ్చినవారిని రక్షించు స్వభావము కలవాడు, సర్వలోకేశ్వరుడు అయిన కృష్ణభగవానుడు నాకు ప్రత్యక్షమగుగాక.


యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదమ్
స్థితౌ నిఃశేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా ।
లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 2 ॥

ఆకాశము, నీరు మొదలగు ఈసమస్త జగమూ కృష్ణుని వలననే పుట్టినది. మధురాక్షసాంతకుడైన ఆ శ్రీహరియే సృష్ట్యనంతరకాలమున ఈ సకల జగమును తన ఆనందకళతో రక్షించును. ప్రళయకాలమున తామసకళతో తనయందే సర్వజగమును లీనము కావించుకొనుచున్నాడు. శరణాగత రక్షకుడైనట్టి ఆ జగత్ ప్రభువు నా కన్నులకు గోచరమగుగాక.


అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై
ర్ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలమ్ ।
యమీడ్యం పశ్యన్తి ప్రవరమతయో మాయినమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 3 ॥

ప్రజ్ఞావంతులు మొదట ప్రాణాయామమొనరించి యమము నియమము మొదలగు సాధనములతో చిత్తమును నిరోధించి, అట్లు నిర్మలమైన ఆ చిత్తమును పూర్తిగా హృదయమునకు దెచ్చుకొని ఏ మహనీయుని చూచుచున్నారో అట్టి జగత్ప్రభువు శరణత్రాణ తత్పరుడు కృష్ణుడు నా కన్నుల కనపడుగాక.


పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా
యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలమ్ ।
నియన్తారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 4 ॥

" ఈ భూమియందవతరించి యిందుండి యీ  పృథివిని రక్షించుచున్నాడు. కాని ఆ పృథివికి తన్ను సంరక్షించుచున్న యా పరమేశ్వరుని గూర్చి తెలియదు.  తెలిసికొను శక్తి లేదు. అతడే సర్వలోకప్రభువు. పరమ పుణ్యమూర్తి. సర్వశాసనుడు. మునులు, దేవతలు అందరూ ఆతనినే ధ్యానింతురు. ఆయనే మోక్షమిచ్చువాడు. "  అని వేదము ఆదికాలమున నుతించిన యా లోకేశ్వరుడు శరణత్రాత కృష్ణుడు నా నేత్రమార్గమున గోచరించుగాక.


మహేన్ద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో
న కస్య స్వాతన్త్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిముతే ।
బలారాతేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 5 ॥

ఇంద్రాది దేవసంఘము ఎవరిని జయించిననూ ఆ పరమేశ్వరుని బలముతోనే. ఆ పరమేశ్వరుని అనుగ్రహము లేనిదే లోకమున నెవ్వడునూ ఏ విషయముననూ స్వతంత్రుడుగా వ్యవహరించలేడు. దేనినీ తన శక్తితో సాధింపలేడు. అందుచేతనే ఎప్పుడైనా రాక్షసాది విజయము సాధించితినని ఇంద్రుడు గర్వించినచో వెంటనే యాతని గర్వమడగగొట్టుచున్నాడు. అట్టి శరణన్నవారినేలు లోకేశ్వరుడు నాకుకన్పడుగాక.


వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖామ్
వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా ।
వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 6 ॥

ఆ పరమేశ్వరుని ధ్యానింపనివానికి పంది, కుక్క, మొదలగు పశు జన్మలు కలుగును. ఆ దేవదేవుని గూర్చి తెలిసికొనలేనిచో జనన మరణ భయములు తప్పవు. ఆ శ్రీహరిని స్మరింపకున్న వందలకొలది క్రిమికీటక జన్మములను పొందుచునుండవలసినదే. కనుక సర్వలోకరక్షకుడైన యా కృష్ణభగవానుడు నా కన్నులకు గోచరమగుగాక.


నరాతఙ్కోట్టఙ్కః శరణశరణో భ్రాన్తిహరణో
ఘనశ్యామో వామో వ్రజశిశువయస్యోఽర్జునసఖః ।
స్వయమ్భూర్భూతానాం జనక ఉచితాచారసుఖదః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 7 ॥

శ్రీకృష్ణుడు తన భక్తుల యిడుములకు ఉలియైనవాడు. (నాశకుడు) రక్షకులకును రక్షకుడు. మోహమును పోగొట్టువాడు. మేఘమువలె నీలమైన విగ్రహము కలవాడు. సుందరుడు. గోపబాలురకు ప్రియమిత్రుడు. అర్జునునికి స్నేహితుడు తానే సర్వభూతములయుత్పత్తికిని కారణమైనవాడు. కాని తన యుత్పత్తికి మాత్ర మెవ్వరును కారణముకాదు. ఆయన స్వయంభువు. యోగ్యమైన నడవడిగలవారికి మేలు సేయువాడు. అట్టి యా శరణాగత రక్షకుడైన జగత్ప్రభువు నాకు కనపడుగాక.


యదా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణీ
తదా లోకస్వామీ ప్రకటితవపుః సేతుధృదజః ।
సతాం ధాతా స్వచ్ఛో నిగమగణగీతో వ్రజపతిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 8 ॥

లోకక్షోభకు కారణమైన ధర్మనాశము గలిగినపుడెల్ల జన్మమే లేనివాడయ్యును, ఆ స్వామి శరీరధారియై జన్మించి ధర్మసేతువును ధృడమొనరించుచు సజ్జన సంరక్షణము సేయుచుండును. అందుచేతనే వేదములచేత నుతింపబడు ఆ పుణ్యమూర్తి గొల్లపల్లెయందు గోపబాలురతో సమానుడై మెలగెను. అట్టి యా సాధురక్షకుడు లోకేశ్వరుడు కృష్ణుడు నా కన్నులకు తోచునుగాక.


ఇతి హరిరఖిలాత్మారాధితః శఙ్కరేణ
శ్రుతివిశదగుణోఽసౌ మాతృత్మోక్షార్థమాద్యః ।
యతివరనికటే శ్రీయుక్త ఆవిర్బభూవ
స్వగుణవృత ఉదారః శణ్ఖచక్రాఞ్జహస్తః ॥ 9 ॥

శ్రీశంకరాచార్యులవారిచేత ఈవిధముగా ధ్యానింపబడినవాడై సర్వాత్మస్వరూపుడును, వేదములయందు స్పష్టములైయున్న గుణములు కలవాడును, ఆద్యుడును అయిన శ్రీహరి శ్రీశంకరులయెదుట మాతృమోక్షార్థమై లక్ష్మీసమేతుడై స్వీయములైన మహోత్తమ గుణములతో కూడినవాడై, మహోదారుడై, శంఖచక్ర పద్మాదులుగల హస్తములు కలవాడై ప్రత్యక్షమయ్యెను.


|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీకృష్ణాష్టకమ్ సమ్పూర్ణమ్ ||

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.