Monday, 29 February 2016

శంకరస్తోత్రాలు : దేవ్యపరాధక్షమాపణస్తోత్రమ్



॥ श्री शंकराचार्य कृतं देव्यपराधक्षमापणस्तोत्रम् ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం దేవ్యపరాధక్షమాపణస్తోత్రమ్ ॥

న మన్త్రం నో యన్త్రం తదపి చ న జానే స్తుతిమహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథాః ।
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్ ॥ 1॥

అమ్మా! నాకు నీ మంత్రమూ తెలియదు. యంత్రమూ తెలియదు. అయ్యో! నిన్ను స్తుతించడం కూడా తెలియదు. నిన్ను ఆవాహన చేయుట తెలియదు. నిన్ను ధ్యానం చేయటం తెలియదు. నీ గాధలు చెప్పడమూ తెలియదు. నీ ముద్రలు తెలియదు, నీకోసం విలపించటమూ తెలియదు. కానీ అమ్మా! నీ అనుసరణ క్లేశములు పోగొట్టుతుందని మాత్రం తెలుసు.

విధేరజ్ఞానేన ద్రవిణవిరహేణాలసతయా
విధేయాశక్యత్వాత్తవ చరణయోర్యా చ్యుతిరభూత్ ।
తదేతత్ క్షన్తవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 2॥

అమ్మా! విధి విధానాలు తెలియకపోవటం చేత, ధనం లేకపోవటం చేత, నా బద్ధకం చేత, నీ పాద పద్మములు సేవించుటలో లోపము జరిగింది.  అమ్మా! సర్వమంగళా, జగద్రక్షకీ, నీకు ఈ తప్పులన్నీ మన్నించదగినవే.  చెడ్డ బిడ్డ ఉండవచ్చేమో గానీ చెడ్ద తల్లి ఉండదు కదా.

పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సన్తి సరలాః
పరం తేషాం మధ్యే విరలతరలోఽహం తవ సుతః ।
మదీయోఽయం త్యాగః సముచితమిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 3॥

అమ్మా! భూమిలో నీ పుత్రులు సాధుజనులైనవారు చాలామంది ఉన్నారు. కానీ వారందరి మధ్యలో నిలకడలేని వాడను నేనొకడను ఉన్నాను. అమ్మా! సర్వమంగళా! కాబట్టి నన్ను నీవు వదలివేయటం తగదు. చెడ్డ బిడ్డ ఉండవచ్చేమో గానీ చెడ్ద తల్లి ఉండదు కదా.


జగన్మాతర్మాతస్తవ చరణసేవా న రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా ।
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 4 ॥

అమ్మా! జగన్మాతా! నేను నీ పాద పద్మములనెన్నడూ సేవించలేదు. నీకు బోలెడంత ధనమూ నివ్వలేదు. కానీ అమ్మా! నీవు మాత్రం నాపై నిరుపమానమైన మాతృవాత్సల్యం చూపించావు. చెడ్డ బిడ్డ ఉండవచ్చేమో గానీ చెడ్ద తల్లి ఉండదు కదా.

పరిత్యక్తా దేవా వివిధవిధసేవాకులతయా
మయా పఞ్చా శీతేరధికమపనీతే తు వయసి ।
ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి భవితా
నిరాలమ్బో లమ్బోదరజనని కం యామి శరణమ్ ॥ 5 ॥

దేవతల పూజా విధి విధానాలు ఏవీ చేయని నాకు 85 సంవత్సరాలు గడచిపోయాయి. ఇప్పుడు కూడా నాకు నీ కృప కలుగకపోతే, ఓ వినాయకుని కన్నతల్లీ, నాకు దిక్కెవరు ?

శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాతఙ్కో రఙ్కో విహరతి చిరం కోటికనకైః ।
తవాపర్ణే కర్ణే విశతి మను వర్ణే ఫలమిదం
జనః కో జానీతే జనని జననీయం జపవిధౌ ॥ 6 ॥

అమ్మా! ఛండాలుడు (కుక్క మాంసభక్షకుడు), తేనెలూరు తియ్యని మాటలతో మాటకారి అవుతాడు. దరిద్రుడు కోటి కనక రాశితో చిరకాలం అడ్దులేకుండా విహరిస్తాడు. అమ్మా! అపర్ణా! నీకై చేసే ప్రార్థన ఎవరి చెవిలోనైనా పడిన ఫలం ఇది. ఇక నీకై జపం చేసిన ఫలం జనులకు తెలియుట సాధ్యమా ?

చితాభస్మాలేపో గరలమశనం దిక్పటధరో
జటాధారీ కణ్ఠే భుజగపతిహారీ పశుపతిః ।
కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం
భవాని త్వత్పాణిగ్రహణపరిపాటీఫలమిదమ్ ॥ 7 ॥

అమ్మా! శంకరుడెలాంటి వాడు ? ఒడలంతా చితాభస్మం అలదుకునేవాడు, విషము ఆహారమైనవాడు, దిగంబరుడు, జడలుకట్టిన జుట్టు ఉన్నవాడు, కంఠంలో పాములని ధరించేవాడు, పశుపతి, కపాలం భిక్షాపాత్రగా కలవాడు, భూతాలకి అధిపతి. మరి ఇలాంటి వాడు ఈ జగత్తంతటికీ ఈశ్వరుడు అని ప్రార్థించబడుతున్నాడంటే, భవానీ! అది నీ పాణిగ్రహణ ఫలమేనమ్మా!

న మోక్షస్యాకాంక్షా భవవిభవవాఞ్ఛాపి చ న మే
న విజ్ఞానాపేక్షా శశిముఖి సుఖేచ్ఛాపి న పునః ।
అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై
మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః ॥ 8 ॥

అమ్మా!  చంద్ర వదనా ! నాకు మోక్షం పొందాలనే కోరిక లేదు. అనంత ఐశ్వర్యం కావాలనీ లేదు. ప్రాపంచిక విజ్ఞానమూ వద్దు.  సుఖాలు మళ్లీ అనుభవించాలనీ లేదు. కాబట్టి అమ్మా! నిన్ను కోరుకుంటున్నాను. నా జీవితాన్ని "మృడానీ రుద్రాణీ శివ శివ భవానీ" అని నీ నామజపం చేసుకునేలా అనుగ్రహించు.  

నారాధితాసి విధినా వివిధోపచారైః
కిం రుక్షచిన్తనపరైర్న కృతం వచోభిః ।
శ్యామే త్వమేవ యది కిఞ్చన మయ్యనాథే
ధత్సే కృపాముచితమమ్బ పరం తవైవ ॥ 9 ॥

అమ్మా! నిన్ను శాస్త్రోక్తంగా వివిధ ఉపచారాలతో పూజింపలేదు. (నేను) చేయని చెడు తలపు, మాట్లాడని చెడు మాట లేదు. కానీ ఓ నల్లని తల్లీ!  నీవు ఈ అనాధ యందు కృప చూపు  అమ్మా! నీకసాధ్యమైనది ఏదీ లేదు.

ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేశి ।
నైతచ్ఛఠత్వం మమ భావయేథాః క్షుధాతృషార్తా జననీం స్మరన్తి ॥ 10 ॥

 అమ్మా! కరుణా సముద్రా! దుర్గా! ఆపదలయందు నిన్ను స్మరిస్తున్నాను. నన్ను తప్పుగా భావించకమ్మా! ఆకలిదప్పులుగొన్న పిల్లలు తల్లిని స్మరిస్తారు కదా!

జగదమ్బ విచిత్ర మత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయి ।
అపరాధపరమ్పరాపరం న హి మాతా సముపేక్షతే సుతమ్ ॥ 11 ॥

జగన్మాతా! నా ఈ అపరాధపరంపర ఉన్నప్పటికీ నీకు నాపై పరిపూర్ణమైన కరుణ ఉంటే, అందులో విచిత్రం ఏమున్నది ? తల్లి బిడ్డను వదలి వేయదు.

మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి ।
ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు ॥ 12 ॥ 

అమ్మా! నాతో సమానమైన పతితుడు వేరొకడు లేడు.  పాపములు ధ్వంసంచేయటంలో నీకు సరిజోడు లేరు. మహాదేవీ! ఇది దృష్టిలో ఉంచుకుని, (నను బ్రోచుటకు) ఏది యోగ్యమో అది చేయి.


॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం దేవ్యపరాధక్షమాపణస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

ఈ స్తోత్రం ఆదిశంకరకృతమూ అనే విషయంలో కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నాయి

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.