శ్రీ శివాభ్యాం నమః
శివానందలహరీ - శ్లోకం - 1
కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |
శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్ || 1 ||
కళలస్వరూపులునూ (శ్రీవిద్యాస్వరూపులు, సకలవిద్యాస్వరూపులు), సిగలపై చన్ద్రకళలను ధరించినవారునూ (కాలాతీతులునూ), ఒకరినొకరు తపస్సుద్వారా పొందిన వారునూ, భక్తులకు ఫలములిచ్చువారునూ, త్రిభువనములకూ మంగళదాయకులునూ, హృదయమునందు ధ్యానములో మరలమరల గోచరించువారునూ, ఆత్మానందానుభవముతో స్ఫురించు రూపముకలవారునూ అయిన పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు.
శివానందలహరీ - శ్లోకం - 2
గళంతీ శంభో! త్వచ్చరితసరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ |
దిశంతీ సంసారభ్రమణపరితాపోపశమనం
వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ || 2 ||
మహాదేవ శంభో! నీ చరితామృతము నుండి మొదలై, నా బుద్ధి అను కాల్వలద్వారా ప్రవహిస్తూ, నా పాపములనూ, నా చావు-పుట్టుకల చక్రమునూ(సంసారభ్రమణం) తొలగించివేస్తూ, నా మనస్సనే మడుగును చేరి నిలిచిన శివానందలహరికి (పరమేశ్వరుని లీలలు వినుటచే కలిగిన ఆనంద ప్రవాహము) జయమగు గాక.
(శివలీలలను తెలిసుకొనుట ద్వారా పాపనాశనమూ, తాపనాశనమూ సాధించవచ్చునని శంకరాచార్యుల ఉపదేశం)
శివానందలహరీ - శ్లోకం - 3
త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ |
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే || 3 ||
మూడు వేదములద్వారా తెలిసికొన దగిన వాడును , మిక్కిలి మనోహరమయిన ఆకారము కలవాడును , త్రిపురములనూ(త్రిపురాసురులను) సంహరించినవాడును , సృష్టికి పూర్వమేఉన్నవాడును , మూడుకన్నులు కలవాడును , గొప్ప జటాజూటము కలవాడును, గొప్ప ఉదారస్వభావం కలవాడును, కదులుచున్నసర్పములను ఆభరణములుగా ధరించినటువంటివాడును, లేడిని ధరించినవాడునూ , దేవతలకే దేవుడయిన మహాదేవుడునూ , సకల జీవులకూ పతి అయినవాడును , జ్ఞానమునకు ఆధారమయినవాడును , అనుకరింపశక్యము కానివాడును , నాయందు దయ కలవాడును అయిన పార్వతీ సమేతుడయిన శివుని హృదయమునందు ధ్యానించుచున్నాను .
శివానందలహరీ - శ్లోకం - 4
సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా
నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్ |
హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనమ్ || 4 ||
ఏదో కొంచెము ఫలమిచ్చెడు దేవతలెందరో కలరు. కలలోనైనను ఆ దేవతలను భజించుటగానీ ,ఆ దేవతలు కలుగచేయు ఫలమునుగానీ ఆశించను . మంగళస్వరూపుడవగు ఓ శంకరా! ఎల్లప్పుడూ నీ సన్నిధిని చేరియున్న విష్ణువుకిగానీ , బ్రహ్మకుగానీ లభించని నీ పాదసేవయే నాకు అనుగ్రహింపమని మిమ్ము పదేపదే వేడుకొనుచున్నాను .
శివానందలహరీ - శ్లోకం - 5
స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః |
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయవిభో || 5 ||
స్మృతులయందుగానీ , శాస్త్రములయందుగానీ , వైద్యమునందుగానీ , శకునములు చెప్పుటయందుగానీ, కవిత్వము చెప్పి మెప్పించుటయందుగానీ , సంగీతము పాడి రంజింపజేయుటయందుగానీ , పురాణములు చెప్పుటయందుగానీ , మంత్రశాస్త్రమందుగానీ , స్తోత్రములు చేయుటయందుగానీ , నాట్యము చేయుటయందుగానీ , హాస్యములు చెప్పి నవ్వించుటయందుగానీ నేర్పులేనివాడను . ఇట్టి నాయందు రాజులకు ప్రేమ ఎట్లు కలుగును ? ఒకవేళ వారు ఆదరించిననూ వారిచ్చు ఫలములు నాకు వద్దు . వేదప్రసిద్ధుడవూ , సర్వజ్ఞుడవూ అయిన ఓ మహేశ్వరా ! నే నెవ్వడినో నాకేతెలియని పశువునైన నన్ను దయతో రక్షించుము .