Saturday 2 January 2016

సంధ్యావందనం : జగద్గురువులతో సంభాషణ



యాత్రలుచేయుచున్న ఒక విద్యాధికారి జగద్గురువులను ఒకసారి కలిసి ఇలా అడిగాడు :

నా వృత్తిరీత్యా చిన్నపిల్లలతో కలిసి ఉండాలి. వీరిలో ఎక్కువమంది బ్రాహ్మణులు. ఈ విద్యార్థులలో సంధ్యోపాసనచేసేవారు కూడా దానిని ఒక తంతులా చేస్తారు అని గమనించాను. జగద్గురువులు ఈ విషయమై నాకు అలాంటివారికి చెప్పడానికి ఏమైనా విలువైన అంశాలు చెప్పగోర్తాను.
నీవు కేవలం ఉద్యోగపరిధికి లోబడకుండా నీ అవకాశాన్ని విద్యార్థుల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నావని తెలిసి సంతోషంగా ఉంది. విద్యావేత్తలూ, అధికారులూ, ఉపాధ్యాయులూ విద్యార్థులజీవితంలోని చాలా ముఖ్యదశలో వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని గ్రహిస్తే మంచిది. నా ఉద్దేశ్యములో విద్యార్థులు నిర్దేశించబడిన పాఠ్యపుస్తకాలు చదివి ఆధ్యాత్మిక పురోగతిని వదలివేస్తే దానికి వీరే బాధ్యులు.
నేను ఈ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుంటాను. విద్యార్థులకు సలహాఇచ్చే అవకాశాన్ని వదలుకోను. అందుకనే జగద్గురువులను కొన్ని ఆచరణమీయమైన సలహాలు అడిగాను.
ఈ సలహాలు నువ్వు చెప్పదల్చుకున్న విద్యార్థులకు ఉపయోగపడకపోయినా, నీకు ఉపయోగపడతాయి.
అవును, ఖచ్చితంగా.
కాబట్టి, ఇప్పుడు విద్యార్థులను మర్చిపోయి, నీకు ఉపయోగపడే విషయాలు అడుగు.
నాకు తోచే మొట్టమొదటి ప్రశ్న - "సంధ్యోపాసనద్వారా ఉపాసించబడే దేవత ఎవరు ? "
దానిని మనం పరిశీలించేముందు నీకు సంధ్యోపాసన అంటే సాధారణంగా ఏమి అర్థమయ్యిందో చెప్పు.
సంధ్యోపాసన అంటే ఉదయించే, అస్తమించే, మధ్యాహ్న సూర్యుని ఉపాసించటం.
నిజమే. కూలంకషంగా సూర్యోపాసన అని చెప్తున్నావా ?
అవును
నువ్వు సంధ్య అంటే సూర్యోపాసన అంటున్నావు. నువ్వే సంధ్యోపాసనద్వారా ఉపాసించబడే దేవత ఎవరు అని అడుగుతున్నావు. అనవసరమైన ప్రశ్న అనిపించట్లేదా ?
అలా అంటే అనవసరమైన ప్రశ్న అనిపిస్తుంది. కానీ నా అసలు ప్రశ్న "ఈ ఉపాసించబడే సూర్యుడు ఏది ? " అని
నువ్వు సాధారణంగా సూర్యుడంటే అర్థం ఏమని అనుకుంటున్నావు ?
ఆకాశంలో వెలిగే నక్షత్రం అని.
అయితే ఆ ఆకాశంలో వెలిగే నక్షత్రమే ఉపాసించబడుతోంది.
కానీ ఆ నక్షత్రం, సైన్సు ప్రకారం జీవరహితమైనది, ఎప్పుడూ తగలబడుతూ ఉండేది, మనలాంటి తెలివైన జీవులచే ఉపాసించబడేంత విలువ లేనిది. మన ప్రార్థనలను వినలేదు, బదులు చెప్పలేదు. మన పూర్వీకులు ఒక మండే నక్షత్రానికి మన ప్రార్థనలు చెయ్యాలని చెప్పేంత మూర్ఖులు కారు.
అవును. మన పూర్వీకులు అంత మూర్ఖులు కారు.
అయితే వాళ్ళు సూర్యునిలో ఏం చూసి మనలను సూర్యుని ఉపాసించమన్నారు ?
నువ్వు ఇప్పుడే జడపదార్థాలకు ప్రార్థనచేయడాన్ని తర్కం ద్వారా సమర్థించలేమని చెప్పావు.
అవును.
అయితే ప్రార్థించదగిన పదార్థము యొక్క లక్షణాలు ఏమై ఉండవచ్చు ?
ప్రాథమికంగా అది జడమై ఉండరాదు. తెలివితేటలు కలిగి ఉండాలి.
రెండో లక్షణం ?
అది మన ప్రార్థనలను వినగలిగినదై, వాటికి బదులుచెప్పగలిగిన శక్తికలిగి ఉండాలి.
నిజమే. మన పూర్వీకులు మూర్ఖులు కారని అయినా సూర్యుని ప్రార్థించారంటే, వారి ఉద్దేశ్యంలో సూర్యుడంటే ఒక ఎప్పుడూ తగలబడుతూ ఉండే జడ పదార్థం కాదన్నమాట.
అవును. వారు దాని తెలివితేటలను, మన ప్ర్రార్థన వినగలిగిన శక్తి, మనకు సహాయంచేయగలిగిన శక్తులను సిద్ధాంతీకరించి ఉంటారు.
నువ్వు "మన" అన్నప్పుడు, ఇప్పుడు జీవిస్తూ చేతులెత్తి సూర్యుని ప్రార్థించేవారే కాక, అసంఖ్యాకమైన గత, భవిష్యత్తు తరాలను కూడా కలిపే అంటున్నావు కదా ?
అవును.
కాబట్టి మనం సూర్యుడు అని ఏ పదార్థాన్ని ప్రార్థిస్తున్నామో దాని తెలివితేటలూ శక్తిసామర్థ్యాలూ కాలానికీ దూరానికీ అతీతం అయ్యుండాలి కదా ?
అవును అలాగే అయ్యుండాలి.


నీ ’సంధ్యోపాసనద్వారా ఉపాసించబడే దేవత ఎవరు ?’ అన్న ప్రశ్నకు జవాబు దొరికిందా ? అది ఒక మేధస్సు కలిగి సర్వసాక్షి అయి, జనులు పార్థనలు విని బదులుచెప్పగల  సర్వశక్తిమంతమైన పదార్థము.

జగద్గురువులు ఆ నక్షత్రములో నివాసముండే ఒక దేవుడు అంటున్నారా ?
అవును. అక్కడ నివాసమే కాదు, ఆ నక్షత్రమే తన శరీరమైన వాడు.
జగద్గురువులు మనం మన భౌతికశరీరాలలో జీవిస్తున్నట్లు ఆ దేవుడు ఆ నక్షత్రములో జీవిస్తున్నాడంటారా ?
అవును.
అతడు మనలాంటివాడే అయితే ఏవిధంగా అతడికి అంత మేధస్సు, జనులు పార్థనలు విని బదులుచెప్పగల శక్తి వచ్చాయి ?
అతడి గతజన్మలో చేసిన ఉపాసన, కర్మల ఫలితంగా ఆ స్థానం లభించింది.
జగద్గురువులు అతడు ఒకప్పుడు మనలాంటి వాడేనని, అతని ప్రవర్తన ద్వారా స్థానం సంపాదించాడనీ అంటున్నారా ?
అవును
అయితే అతడు నాకంటే భిన్నమైన జీవుడు కాదు. అలాంటప్పుడు ఎంత గొప్పవాడైనప్పటికీ ఒక జీవునికి వేరొక జీవుడు ఎందుకు సాష్టాంగాలు చెయ్యాలి ?
నీ పుత్రుడైనా, విద్యార్థి అయినా నిన్ను ఎందుకు గౌరవించాలి ? అలాగే నీ ఉన్నతాధికారులను నువ్వెందుకు గౌరవించాలి ? మీరందరూ జీవులే కదా ?
నిజమే. మేము ఉన్నతాధికారులను గౌరవించడానికి కారణం , వారు కావాలనుకుంటే మాకు సహాయమూ చేయగలరు, ఆపదనూ కొనితేగలరు.
అది తక్కువస్థాయి ఆలోచన. సరే, అలా ఆలోచించినా, సూర్యుడు తను తలచుకుంటే మనకు సహాయమూ చేయగలడు, ఆపదనూ కొనితేగలడు కాబట్టి మనము సూర్యుని ఉపాసించాలి.
అవును
నీ ఉన్నతాధికారుల వలేనే,  అతడూ జీవుడైనప్పటికీ, ప్రార్థిస్తే సహాయం చేస్తాడు, నిర్లక్ష్యం చేసినా, తృణీకరించినా ఆపద కలగజేయగలడు. కాబట్టి, నీ మంచికోరి, నీవు అతడిని ఉపాసించి సంతోషపెట్టవలెను.
కానీ నేను నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లయితే నేను నా ఉన్నతాధికారులను సంతోషపెట్టనక్కరలేదు, భయపడనక్కరలేదు.
అవును
నేను అలా ఉంటే నా ఉన్నతాధికారులను ప్రసన్నంచేసుకోనక్కరలేదు.
అవును, అక్కరలేదు.
అలాగే, నేను శాస్త్రానుసారంగా నడచుకొంటే, వేరే ఏ ఇతర జీవునీ , అతడు ఎంత మహిమగలిగినప్పటికీ, ప్రసన్నంచేసుకోనక్కరలేదు.
అవును.
అయితే, నేను సూర్యుని ఉపాసించడం మానివేయవచ్చు కదా ?
మానివేయవచ్చు. అలాంటి ఉపాసనను శాస్త్రము విధించితే తప్ప.
అలా ఎలాగ ?
ఒక నిజాయితీ,  క్రమశిక్షణగల ఉద్యోగి తన బాధ్యతలను నిర్వహించేటప్పుడు తన పై అధికారి ఇష్టాయిష్టాలను దృష్టిలో ఉంచుకోనక్కరలేదు. కానీ బాధ్యతలను సరిగాచేయాలి అనుకోవడంలోనే  తనకూ, తన పై అధికారికీ కూడా ఉన్నతాధికారి యొక్క ఇష్టాయిష్టాలను/ఆదేశాలను దృష్టిలో ఉంచినట్లే.  ఆ ఉన్నతాధికారితో వ్యక్తిగత సంబంధం లేకపోయినా - అతడిని రాజు అను, ప్రభుత్వమను - ఆ శక్తిని దృష్టిలో ఉంచుకోవలసినదే.  ఆ శక్తి, ఉద్యోగి సేవలను గుర్తించి బహుమానం ఇవ్వటమో, లేదా సరిగా పనిచేయలేదని దండించడమో చేయగలదు. తననూ తన పై అధికారినీ కూడా పాలించగలదు. కాబట్టి, ఆ శక్తి, ఉద్యోగిని తన పై అధికారితో ఒక నిర్దిష్టపద్ధతిలో ప్రవర్తించమని ఆదేశిస్తే, ఉద్యోగి ఆ అదేశాన్ని తిరస్కరించలేడు. అలా తిరస్కరిస్తే వారిద్దరి - పై అధికారీ, ఉన్నత శక్తీ, ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.
అవును.
అలాగే నిన్నూ , సూర్యుడినీ కూడా పరిపాలించే ఒక శక్తి, నిన్ను సూర్యుని ఒక పద్ధతిలో ఉపాసించమంటే , ఆ ఆదేశాన్ని అలక్ష్యం చేయరాదు. చేస్తే సూర్యునియొక్క, ఆ శక్తియొక్క ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తుంది.
అవును. కానీ అలాంటప్పుడు నేను సూర్యుడికి సాష్టాంగపడినప్పటికీ, నేను నిజానికి ఆ ఉన్నత శక్తిని ఉపాసిస్తున్నట్లు. అవునా ?
అంటే ?
అలాంటి సూర్యునికంటే ఉన్నత శక్తిని నేను తెలిసికొనగలిగితే , మనం సూర్యునికోసం చేసే పూజలన్నీ ఆ ఉన్నతశక్తికే చెందుతాయా ?
అవును.
కానీ జగద్గురువులు మనం సూర్యునే ఉపాసిస్తున్నాం అన్నారు ?
అవును. ఆ ఉన్నతశక్తిని తెలిసికొనలేనివారికి అది నిజమే. తెలుసుకొన్నవారికి అతడే నిజమైన ఉపాస్య దైవం. అతడిని హిరణ్యగర్భుడు అంటారు. సూరునికే కాక అందరు జీవులకీ ఆయన ప్రాణశక్తి. ఈ నక్షత్రాలకేకాక మొత్తం విశ్వమంతా అతడి శరీరం. అన్ని పదార్థాలకూ అతడే ఆత్మ.
అయితే, మనం మన శరీరాలను ’నేను’ అనుకుంటున్నట్లు, ఈ విశ్వాన్ని ఆయన ’నేను’ అనుకుంటాడా ?
అవును
అలాంటప్పుడు ఆయనకూ నాకూ భేదం ’నేను’ అనే భావన ఉందా లేదా అని కాక , ఆ భావం ఎంత విస్తారంగా ఉంది అనే కదా. నాకు ఆ భావం స్వల్పం. ఆయనకి విస్తారం.
అవును.
అయితే ’నేను’ అనుకుంటున్నాడు కాబట్టి ఆయనకూడా జీవుడేనా ?
అవును. ఆయన ’మొదట పుట్టినవాడు’.
అయితే నాలాగే ఈ ఉన్నతశక్తి కూడా జీవుడయితే, నేను సూర్యుని గూర్చి (మరో జీవుని ఎందుకు ఉపాసించాలి) అడిగిన ప్రశ్న ఇక్కడా వర్తిస్తుంది కదా.
నువ్వు ఎవరిని ఉపాసించాలనుకుంటున్నావు ?
ఒక జీవుడు కానటువంటి సర్వశ్రేష్ఠ శక్తిని.
అయితే సంధ్య ద్వారా అలాంటి సర్వశ్రేష్ఠ శక్తిని ఉపాసిస్తున్నాము. అతనిని మనం ఈశ్వరుడు, అంతర్యామి అంటాము.
కానీ నేను ’ఈశ్వరత్వము’ అంటే సాపేక్షమని, ఈ జగత్తుకు ఈశ్వరుడని (పాలకుడని) విన్నాను.
అవును.
అయితే ఈ జగత్తుకు సంబంధములేకుండా అతని ఈశ్వరత్వము లేదు. అతడికి వేరే ఏ విషయముతోనూ సంబంధము లేకుండా ఒక స్థితి/ఉనికి ఉండాలి.
అవును. నీవు నిజమే చెప్తున్నావు. ఆ సంబంధము లేని స్థితిని బ్రహ్మము అంటాము.
అలా అయితే, నిజమైన ఉపాస్య దైవము సాపేక్షమైన ఈశ్వరుడు కాక ఈ బ్రహ్మము అన్నమాట.
అవును. సంధ్యోపాసన ద్వారా నిజానికి ఈ నిర్గుణ బ్రహ్మమునే ఆరాధిస్తున్నాము.
నేను జగద్గురువులను సరిగా అర్థంచేసుకోలేకపోతున్నాను. మొదట మీరు ఈ నక్షత్రమే సంధ్యకు ఉపాస్యదైవం అన్నారు. నేను, అది కేవల జడపదార్థమన్నప్పుడు సూర్యుడు ఉపాస్యదైవం అన్నారు. నేను, సూర్యుడూ నాలాంటి జీవుడే అన్నప్పుడు, విశ్వాత్మ అయిన హిరణ్యగర్భుడు ఉపాస్యదైవం అన్నారు. ఆయన యొక్క " నేను అన్న భావం " ఎంత విస్తారమైనప్పటికీ అతడూ కూడా జీవుడే అని నేనన్నప్పుడు , తమరు, ఈ విశ్వానికి నాధుడైన ఈశ్వరుడు ఉపాస్యదైవం అన్నారు. చివరగా ఈశ్వరుడూ సాపేక్షమే అన్నప్పుడు మీరు ఉపాస్యదైవం బ్రహ్మము అన్నారు.
అవును అలాగే అన్నాను.
కానీ ఈ మాటలన్నీ ఎలా సమర్థించుకోవాలి ?
ఇందులో కష్టం ఏముంది ?
ఉపాస్యదైవం ఒక్క పదార్థమేకదా. ఒకేసారి అది నక్షత్రమూ, సూర్యుడూ, హిరణ్యగర్భుడూ, ఈశ్వరుడూ, బ్రహ్మమూ ఎలా అవుతుంది ?
నేను అది కాని ఇది కాని అని చెప్పలేదు.
జగద్గురువులు ఉపాస్య పదార్థం - నక్షత్రమూ, సూర్యుడూ, హిరణ్యగర్భుడూ, ఈశ్వరుడూ, బ్రహ్మమూ కలిపిన పదార్థమంటున్నారా ?
నేను అలాకూడా చెప్పలేదు.
మరి నన్ను మీ మాటలను ఎలా అర్థం చేసుకోమంటారు ?
నేను ఉపాస్య దైవము సూర్యుడని ఎప్పుడు చెప్పాను ?
నేను ఒక మండే జడపదార్థము ఉపాసనార్హము కాలేదన్నప్పుడు.
దానికి ముందు ఆ జడపదార్థమే ఉపాస్య దైవము అనికూడా అన్నాను.
అవును
నేను ఆ జడపదార్థము లేకపోతే సూర్యుడు అని చెప్పలేదు. ఆత్మ / ప్రాణశక్తి అవగాహనలేనివారికి ఆ నక్షత్రమే ఉపాస్యము. జడపదార్థము ఉపాస్యముగా అంగీకరించనివానికి సూర్యుడు ఉపాస్య దైవము అని అన్నాను.  ఉపాసన ఒక్కటే, దాని స్వభావము ఉపాసించేవానిని బట్టి మారుతుంది. దేవతల ఉపాసనను ప్రశ్నించే భక్తులకు ఉపాస్యము ఇంకా మెరుగుపడుతుంది. ఆ ఉపాస్యమును హిరణ్యగర్భుడంటాము. ఈ ప్రతిపాదనకూడా సంతృప్తి పెట్టలేని వారికోసం మనం వారు నిజానికి ఈ జగత్తుకు అధిపతి అయిన ఈశ్వరుని ఉపాసిస్తున్నారని చెప్తాము. భక్తులు ఈ ఆధిపత్యం కూడా నిజ స్వభావానికి కొరత అని అనుకున్నప్పుడు నిజమైన ఉపాస్యము అనంత బ్రహ్మము అని చెప్తాము. ఇందులో కష్టం ఏముంది ?
ఉపాసించేవారి మానసిక పరిణతి, మేధస్సును పరిగణనలోకి తీసుకోకుండా ఉపాస్య పదార్థము ఇదీ అని ఖచ్చితంగా చెప్పలేమని జగద్గురువుల అభిప్రాయమా ?
ఉపాసించేవారిని వదలివేస్తే ఉపాస్యము ఎలా ఉంటుంది ? ఉపాస్య పదార్థ స్వభావము ఉపాసించేవారి స్వభావముపై ఆధారపడి ఉంటుంది.
ఎలా ?
నన్నే ఉదాహరణగా తీసుకో. మీరందరూ నాకు నమస్కరిస్తారు. మీచేత నమస్కరించబడే వస్తువు, రమారమి నేనే అయినా, మీ అందరికీ వేరువేరుగా ఉంటుంది. సామాన్యులు నాకు నమస్కరిస్తారు, నా చుట్టూ తళతళలాడే వస్తువులు చూడాలనుకుంటారు. వారి గౌరవమూ దృష్టీ ఆ సామగ్రిపైనే కానీ నేనుకాదు. ఆ వ్యక్తులు అలాంటి సామగ్రికలవారెవరికైనా నమస్కరిస్తారు. కాబట్టి వారి నమస్కారం నాకు కాక, ఆ సామగ్రికి చెందుతుంది. మరికొందరు నా స్థానానికిగాని నేనున్న (సన్యాస)ఆశ్రమానికిగాని నమస్కరిస్తారు. వారు ఇలాంటి స్థానములో ఉన్న/రాబోయే వారికి, ఇలాంటి ఆశ్రమములో ఉన్నవారెవరికైనా నమస్కరిస్తారు. వారి గౌరవము నాకుగాక ఈ స్థానానికిగాని ఆశ్రమానికిగాని చెందుతుంది. ఇంకొందరు స్థానమూ ఆశ్రమమూ పట్టించుకోక నా ఈ భౌతిక కాయానికి నమస్కరిస్తారు. మరికొందరు నా శరీరాన్నీ పట్టించుకోరు. నా శుద్ధమనస్సు, వ్యక్తిత్వం వల్లనో లేకపోతే నా మేధస్సు, విద్య వల్లనో, లేక నా ఆధ్యాత్మిక ఉన్నతి వల్లనో వారు నాకు నమస్కరిస్తారు. నిజానికి చాలా తక్కువమంది నాలోనూ, మీ అందరిలోనూ అంతర్లీనంగా ఉన్న దివ్యతేజస్సు కు నమస్కరిస్తారు.
నిజమే, జగద్గురువులవద్దకు వచ్చే భక్తులందరి మానసిక పరిణతీ ఒకేలా ఉంటుందని చెప్పలేము.
అవును. కానీ సాధారణంగా వీరందరూ - వారి గౌరవం ఈ సామగ్రికైనా, స్థానానికైనా, ఆశ్రమానికైనా, శరీరానికైనా, మనస్సుకైనా, మేధస్సుకైనా, ఆ తేజస్సుకైనా - నాకు సాష్టాంగం చేస్తారు.  వీరిలో కొందరు తెలిసినవాళ్ళని వదిలేస్తే, ఎవరు ఎవరికి సాష్టాంగం చేస్తున్నరో చెప్పగలవా ?
అవును, ఈ ప్రశ్నకు జవాబు చాలా కష్టమే.
అలాగే ఉపాసనలకు కూడా. బాహ్యంగా చూస్తే ఈ సామగ్రికి నమస్కారం చేసేవాడికీ, నాలోని తేజస్సుకు నమస్కారం చేసేవాడికీ పెద్ద తేడా చెప్పలేము. అలాగే  బాహ్యంగా గుడ్డి నమ్మకంతో ప్రకాశించే సూర్యుని ఉపాసించే భక్తునికీ ఆ సూర్యుని అనంత పరబ్రహ్మానికీ చిహ్నంగా ఉపాసించేవారికీ తేడా చెప్పలేము. సంధ్యోపాసన యొక్క నిజమైన ఉపాస్యదైవము ఎవరు అనే ప్రశ్నకు జవాబు ఇలాగే చెప్పగలం.
నేను ఇప్పుడు సామాన్యమైన సూర్యోపాసనలో ఆధ్యాత్మిక పురోగతికి విభిన్నదశలున్నాయని తెలుసుకున్నాను.
అంతేకాదు. ఇంకాలోతుగా ఆలోచిస్తే కర్మ, భక్తి, జ్ఞానమార్గాలు మూడూ నిత్యపూజలో పొందుపరుచబడ్డాయని తెలుసుకుంటావు, అది వేరే సంగతి. సంధ్యోపాసన సామాన్యమైనది అనిపించచ్చు కానీ ఆధ్యాత్మిక పురోగతి సహాయానికి సరిపోతుంది. ఇప్పుడే మెదలుపెట్టిన వారికి ఎంత ఉపయోగమో, ఉన్నతస్థాయివారికీ అంతే ఉపయోగం. కాబట్టి దాన్ని తక్కువచేయటం , అశ్రధ్ధచేయటం కన్నా మూర్ఖత్వం లేదు.
(శుభం)

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.