Thursday, 28 January 2016

ఆనందలహరీ : 6-10


 

శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 6

హిమాద్రేః సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభిర్భ్రమరకలితా చాలకభరైః |
కృతస్థాణుస్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతికా || 6 ||


(ఇక్కడ అమ్మవారిని కల్పలతతో పోలుస్తున్నారు.ఈ లత మామూలు లత కాదు కల్పలత అంటే అడిగినవన్నీ ఇస్తుంది.)
ఈ కల్పలత హిమవత్పర్వతమునందు పుట్టింది, అందమైన చేతులు అనే చిగురుటాకులు కలది, ముత్యములనే పుష్పములున్నది,  ముంగురులనే తుమ్మెదలు వాలినది, శివుడనే మ్రోడుని పెనవేసుకొన్నది(స్థాణువు-శివుడు,మ్రోడు), స్తనములనే ఫలములతో వంగినది, శాస్త్రవాక్కులనే మకరందం కలిగినది, సర్వరోగములనూ పోగొట్టునది(భవరోగ నివారిణి), కదులుచున్నది అగు పార్వతీదేవి అనే జ్ఞానానందలతిక విలసిల్లుచున్నది.
 
శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 7

సపర్ణా మాకీర్ణాం కతిపయగుణై స్సాదరమిహ
శ్రయం త్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి |
అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్పరివృతః
పురాణోఽపి స్థాణుః ఫలతికిల కైవల్యపదవీమ్ || 7 ||


(పరమేశ్వరుని వివాహమాడుటకు ఆకులనుకూడా తినకుండా తపస్సు చేసినందున పార్వతీదేవికి అపర్ణ అని పేరు. అపర్ణ అనగా ఆకులు లేనిది అని. పార్వతీదేవి ఈ శ్లోకములో ఆకులులేని తీగగా చెప్పబడుతున్నది)

ఆకులు కలిగిన తీగెలను (ఇతర దేవతలను), కొన్నిగుణములు మాత్రమేగలవైననూ, ఇతరులు ఆశ్రయించుచున్నారు. నాకు మాత్రం ఈ విధంగా అనిపిస్తోంది. ప్రపంచంలో అందరూ ఆకులులేని తీగెనే (అపర్ణ) ఆశ్రయించాలి. ఆ తీగె చుట్టుకున్న మాత్రాన పాత మ్రోడు (శివుడు - స్థాణుః) కూడా మోక్షఫలములిచ్చుచున్నది.

 శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 8

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయజనని
త్వమర్థానాం మూలం ధనద సమనీయాంఘ్రికమలే |
త్వమాదిః కామానాం జనని కృత కందర్ప విజయే
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మమహిషి || 8 ||


సమస్త వేదములను కన్నతల్లీ! నీవే ధర్మములు విధించుచున్నావు. కుబేరుడు నీ పాదకమలములకు మ్రొక్కెడువాడే. సమస్త సంపదలకూ నీవే మూలము. తల్లీ, నీవు మన్మధుని జయించినదానవు, కోరికలకూ నీవే మూలము. పరబ్రహ్మ పట్టపురాణివి నీవు, సత్పురుషుల ముక్తికి కారణమూ నీవే.
(చతుర్విధ పురుషార్థాలయిన ధర్మ, అర్థ, కామ, మోక్షములనొసగునది జగన్మాత )

 శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 9

ప్రభూతా భక్తిస్తే యదపి న మమాలోలమనస
స్త్వయాతు శ్రీమత్యా సదయమవలోక్యోఽహమధునా |
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే
భృశం శంకే కైర్వా విధిభిరనునీతా మమ మతిః || 9 ||


అమ్మా! చపలచిత్తుడనైన నాకు నీపై భక్తి కుదురుటలేదు. నీవు శ్రీమతివి (పెద్ద మనసున్నదానివి, మనం పెద్దమనసు చేసుకుని అంటాం కదా) నాపై దయచూపాలి. చాతకపక్షి నోటిలో మేఘుడు మధురమైన నీటిని వర్షించినట్లే నీవూ నాపై దయావర్షం కురిపించాలి. నా మనస్సు ఎందుకు నీపై నిలుచుటలేదని మధనపడుచున్నాను. (నీవే దారి చూపాలని వినతి).

చాతకపక్షి ఇష్టాఇష్టాలతో నిమిత్తంలేక మేఘుడు తన ధర్మం ప్రకారం మధురజలాలు ఆ పక్షిపై ఎలావర్షిస్తున్నాడో, నా భక్తిశ్రద్ధలతో నిమిత్తంలేకనే నువ్వు (నీ దయాధర్మం ప్రకారం) నీ దయ నాపై కురిపించు తల్లీ అని భావన.

శంకరులు సౌందర్యలహరిలో ’దృశా ద్రాఘీయస్యా’ శ్లోకంలో ఇదేభావం కనపరిచారు. ’వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః’ చంద్రుడు భవనాలపై అరణ్యాలపై ఒకేలా వెన్నెల కురిపించినట్లు, ఈ దీనుడిపై దయచూపమని అక్కడ వినతి.

’కావు కావమని నే మొరబెట్టితే కరుగదేమి మది’ అని త్యాగరాజులవారు
’దేవీ బ్రోవ సమయమిదే, అతివేగమే వచ్చి’ అని శ్యామశాస్త్రుల్ల వారు దెబ్బలాడారు. అందరూ దెబ్బలాటలు శంకరులవద్దే నేర్చుకున్నట్లుంది.

 శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 10

కృపాపాంగాలోకం వితర తరసా సాధుచరితే
న తే యుక్తోపేక్షా మయి శరణదీక్షాముపగతే |
న చేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతికా
విశేషః సామాన్యైః కథమితరవల్లీ పరికరైః || 10 ||


గొప్పచరిత్రగల తల్లీ! నిన్ను శరణు అన్న నాపై నీకు ఉపేక్ష తగదు. నీ దయాదృష్టిని నాపై వేగముగా ప్రసరింపచేయి.  కోరుకున్నది వెంటనే ఇవ్వకపోతే సామాన్యలతలకన్నా కల్పలతకు విశేషమేమున్నది ?

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.