శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 11
మహాన్తం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే
నిధాయాన్యన్నైవాశ్రితమిహ మయా దైవతముమే |
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణం || 11 ||
అమ్మా ఉమాదేవీ! నీ పాదపద్మములపై గొప్ప విశ్వాసము కలవాడినై నేను ఈ లోకంలో అన్య దేవతలను ఆశ్రయించలేదు. అయినా నీవు నాపై కరుణ చూపకపోతే, ఓ వినాయకుని కన్నతల్లీ ! నాకెవరు దిక్కు ?
త్యాగరాజులవారు కూడా ’వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినా వేల్పులెవరమ్మా!’ అని కామాక్షీ అమ్మవారిని ప్రార్థించారు. శంకరులు ఈ శ్లోకంలో ’వినాయకుని తల్లీ నాకింకెవరు దిక్కు?’ అని అడుగుతున్నారు. ఎందుకు వినాయకుని అమ్మకు గుర్తుచేస్తున్నారు ?
వినాయకుని ’హేరంబుడు’ అంటారు. అంటే ఎప్పుడూ శివునివద్దనే ఉండేవాడని. అందుచేత వినాయకుడంటే అమ్మవారికి మక్కువ అని పెద్దల మాట.
నాకు వినాయకుని ’లంబోదర’ అని సంబోధించడంలో ఒక సంకేతం కనిపిస్తోంది. వినాయకచవితి కథలో వినాయకుని ఉదరం భగ్నమైనప్పుడు అమ్మవారు పట్టుబట్టి మరలా జీవం పోయించింది. అంత కరుణనూ నాపై కూడా చూపమని శంకరులు, త్యాగరాజులు అడుగుతున్నారని నా అభిప్రాయం.
శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 12
అయస్స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాథః శుచి భవతి గంగౌఘమిళితమ్ |
తథా తత్తత్పాపైరతిమలిననన్తర్మమ యది
త్వయి ప్రేమ్ణాసక్తం కథమివ న జాయేత విమలమ్ || 12 ||
పరశువేది స్పర్శతో ఇనుము బంగారమవుతున్నది. వీధికాలువల నీరు గంగాప్రవాహముతో కలిసి శుచి అవుతున్నది. అలాగే
ఆయా పాపములతో అతి మలినమైన నా మనస్సు నీపై భక్తితో కలసినచో ఎట్లు నిర్మలము కాదు ?
శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 13
త్వదన్యస్మాదిచ్చావిషయఫలలాభే న నియమ
స్త్వమజ్ఞానామిచ్చాధికమపి సమర్థా వితరణే |
ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన
స్త్వదాసక్తం నక్తం దివముచితమీశాని కురు తత్ || 13 ||
నీ కంటే ఇతరులైన దేవతల వలన కోరినఫలము లభిస్తుందని నియమము (ఆంగ్లములో చెప్పాలంటే , గ్యారంటీ) లేదు. మరి నీవో, అజ్ఞులకుకూడా కోరినదానికన్నా అధికముగా ఇచ్చుటలో సమర్థురాలవని బ్రహ్మదేవుడు మొదలగువారు చెప్పారు. నా మనస్సు రాత్రింబవళ్ళు నీయందే లగ్నమై ఉన్నది. ఓ ఈశ్వరుని పత్నీ! ఏది తగినదో అది చేయుము.
శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 14
స్ఫురన్నానారత్నస్ఫటికమయభిత్తిప్రతిఫల
త్త్వదాకారం చంచచ్చశధరకళాసౌధశిఖరమ్ |
ముకుందబ్రహ్మేంద్రప్రభృతిపరివారం విజయతే
తవాగారం రమ్యం త్రిభువనమహారాజగృహిణి || 14 ||
ముల్లోకములకూ మహారాజయిన పరమేశ్వరుని గృహిణి అగు ఓ పరమేశ్వరీ! రమణీయమైన నీ సౌధములో కాంతులీను నానా రత్నములు పొదగబడినవీ, స్ఫటికమయమైనవీ అయిన గోడలయందు నీ ఆకారము ప్రతిబింబించుచున్నది. దాని శిఖరము పై చంద్రకళ ప్రకాశించుచున్నది. ఆ భవనములో విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు దేవతలు సపరివారముగా ఉన్నారు. ఆ భవనము ఎంతో గొప్పగా ఉన్నది.
శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 15
నివాసః కైలాసే విధిశతమఖాద్యాః స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధనికరః |
మహేశః ప్రాణేశః తదవనిధరాధీశతనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా || 15 ||
అమ్మా! నీ సౌభాగ్యమేమని చెప్పను ? నీ నివాసము కైలాసము. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారు నిన్ను స్తుతిచేయువారు (వంది మాగధులు). ఈ ముల్లోకాలూ నీ కుటుంబము. సిద్ధులన్నీ నీకు అంజలిఘటించుచున్నాయి. మహేశ్వరుడు నీ ప్రాణేశుడు. ఓ పర్వతరాజపుత్రీ పార్వతీ! నీ సౌభాగ్యానికి సమానమైనది వేరొకటి లేదు .
No comments:
Post a Comment