పరమాచార్యుల అమృతవాణి : సైకిలు పెడలు
(పరమాచార్యులవారు చెప్పుతుండగా 1947లో వ్రాయబడిన వ్యాసం)
#వేదధర్మశాస్త్ర పరిపాలన సభ @శంకరవాణిఎవరైనా సైకిలు నడుపుతుంటే అతను కాళ్ళతో పెడలు తొక్కుతాడు. తొక్కడంలో అనుభవం ఉన్నవాడు మొదట త్వరగా పెడలును త్రొక్కి తరువాత కొంతసేపు తొక్కడం మానేసి హ్యాండిలు మాత్రం పట్టుకుని ఉంటాడు. వాడు పెడలు త్రొక్కకపోయినా సరే, అంతకుముందు త్రొక్కినప్పుడు పుంజుకున్న వేగం కారణంగా, సైకిలు ముందుకు వెడుతుంది.
ప్రభుత్వం అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. బ్రాహ్మణులు సాధారణంగా ఈ పరీక్షలలో బాగా విజయం సాధిస్తూ ఉంటారు. ప్రభుత్వం కొంతకాలం కేవలం ప్రతిభ ఆధారంగా కళాశాలలో ప్రవేశం ఉంచినప్పుడు, బ్రాహ్మణుల పిల్లలు ప్రవేశం సాధిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిభకు కావలసిన మార్కులకంటే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. అలా విశేషంగా మార్కులు సంపాదించే విద్యార్థుల సంఖ్య కళాశాలలో ఉన్న ప్రతిభ ఆధారంగా ఇచ్చే సీట్ల కన్నా కొన్నివందలరెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఇలా జరుతుండటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ప్రస్తుతం ఏ విశేష కారణమూ కనిపించటంలేదు. ఆచారాలూ, అనుష్టానాల విషయంలో బ్రాహ్మణుల పిల్లలకూ ఇతరుల పిల్లలకూ ఏమీ తేడా ఉండట్లేదు. పైగా కొన్ని విషయాలలో బ్రాహ్మణుల పిల్లలకంటే ఇతరులే బాగా ఉంటున్నారు. మరి బ్రాహణుల పిల్లలు ఎక్కువ ప్రతిభ కనపచటానికి మూలకారణం ఏదయ్యుంటుంది ? మనం దాన్ని కనుగొనాలి.
భగవంతుడు పక్షపాతి కాడు. బ్రాహ్మణులు ఆచారాలూ, అనుష్టానాల విషయంలో ఇతరులకన్నా వేరు కాకపోయినా, కొన్ని విషయాలలో ఇతరులకన్నా దిగదుడుపే అయినా, భగవంతుడు ఎక్కువ మేధస్సుని బ్రాహ్మణులకు ఎందుకు ఇచ్చాడు ?
పూర్వీకులు సైకిలు త్రొక్కడం చేత.
మనకు మూడుతరాల క్రితం జీవించిన మన పూర్వీకులు, జీవన సాఫల్యానికి కావలసిన బ్రహ్మ తేజస్సును పొందటానికి అవసరమైనదానికంటే ఎక్కువగా ధార్మిక జీవనము అనే సైకిలు త్రొక్కారు. ఈరోజు మనం ఏ కర్మానుష్టానమూ లేకుండా కేవలం హ్యాండిలు పట్టుకుని వారి (మన పూర్వీకుల) మూలంగా పరీక్షలలో విజయం సాధించేస్తున్నాము.వాళ్ళు బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు నిద్రలేచేవారు. మనం సాధారణంగా సూర్యోదయం తరువాతే నిద్ర లేస్తాం. వారి కాలంలో సకాల సంధ్యావందనం చెయ్యని వాడిని వెతకవలసి వచ్చేది. మన కాలంలో సకాల సంధ్యావందనం చేసే వాడిని వెతకవలసి వస్తోంది.
వారి కాలంలో ఉదయ సాయంకాలాలలో జనులు సంధ్యావందనములకై గుమికూడేవారు. మన కాలంలో ప్రొద్దున్న ఒక క్లబ్బులోనూ సాయంత్రం వేరే క్లబ్బులోనూ గుమికూడతాము. ఆత్మను పోషించవలసిన సమయంలో అనాత్మను పోషిస్తాము. ఆత్మశక్తిని కోల్పోయి, ఆత్మను బలహీనం చేస్తాము.
ఈ భూమిలోని ఇతర మతస్తులు కేవలం సాయంత్రం భగవంతుణ్ణి స్మరించడం, కొన్ని సమయాలలో కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సంపాదించిన శక్తి సామర్ధ్యాలతో, అకారణంగా మన వద్దనుండి మొత్తం రాజ్యం లాగివేసుకున్నారు.
బుక్కరాయల గురువైన విద్యారణ్యస్వామి, శివాజీ గురువైన సమర్థ రామదాసు గొప్ప నైతిక ప్రవర్తన కలవారు, కర్మానుష్టానపరులు, భగవదనుభవం అయినవారు. వారు మన ధర్మాన్ని పాడుచేసిన విదేశీయుల కరాళనృత్యాన్ని నాశనంచేసి, మన ధార్మికమైన రాజ్యాన్ని పునః స్థాపించారు.
నాగరికతా ? జంతుప్రవర్తనా ?
మనకు మూడుతరాల క్రితం జీవించిన గొప్పవారిలో మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోనివారు లేరు. మట్టి, నీటిపాత్ర వారి దగ్గర ఎప్పుడూ ఉండేవి. మనం నాగరీకులమయ్యాము. మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోవడం వదలివేశాము. మనం జంతువులమయ్యాము. ఇది మన నాగరీకత.ప్రథమ ఆచారమైన శౌచం వదలివేసిన వాడు చేసే ఏ కర్మ అయినా, బూడిదలో (అగ్నికి బదులు) హోమంచేయటంతో సమానం.
మూడుతరాల క్రితం వారు త్రొక్కిన ఫలం ఎంతవరకూ ఉంటుంది ? త్రొక్కకుండా ఉన్న సైకిలు ఎంత దూరం పరిగెడుతుంది ? వేగం తగ్గిపోవడం అప్పుడే మొదలయ్యింది. మా చిన్నప్పుడు బ్రాహ్మణుల పిల్లల్లో చూసిన బ్రహ్మతేజస్సు ఈ తరం వాళ్ళల్లో కనిపించుటలేదు. అలాగే చదివే సామర్థ్యమూనూ.
కాబట్టి, తరువాతి తరాల వారు భగవదనుగ్రహమూ, బ్రహ్మ తేజస్సూ, మేధాశక్తీ కోల్పోకుండా ఉండాలంటే, మన జీవితంలోనూ ఇవి క్రమేణా తగ్గిపోకుండా ఉండాలంటే, మనం "ధర్మశాస్త్ర సైకిలు" లోని "కర్మానుష్టాన చక్రమును", "ప్రవర్తన పెడలు" త్రొక్కడం ద్వారా త్రిప్పుతూ ఉండాలి.