Sunday, 31 January 2016

శంకరస్త్రోత్రాలు : కళ్యాణవృష్టిస్తవః


 

|| కళ్యాణవృష్టిస్తవః ||

కళ్యాణవృష్టిభిరివామృతపూరితాభి-
ర్లక్ష్మీస్వయంవరణమంగళదీపికాభిః |
సేవాభిరంబ తవ పాదసరోజమూలే
నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్ || 1 ||


కళ్యాణములను వర్షించునవీ, అమృతముతో నిండినవీ, లక్ష్మి స్వయముగా ప్రాప్తించునట్టి మంగళములను చూపించునవీ అగు నీ పాదపద్మముల సేవలచే భాగ్యవంతులైన జనుల యొక్క మనస్సునందు ఏమేమి కల్గింపబడలేదు.


ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే
త్వద్వందనేషు సలిలస్థగితే చ నేత్రే |
సాన్నిధ్యముద్యదరుణాయుతసోదరస్య
త్వద్విగ్రహస్య పరయా సుధయాప్లుతస్య ||2 ||


ఓ తల్లీ! నిన్ను నమస్కరించునపుడు కన్నులు ఆనందభాష్పములతో నిండుగాక. పదివేల సూర్యుల సమానమైనదీ, అమృతముతో నిండినదీ అగు నీ దివ్యస్వరూపము యొక్క సాన్నిధ్యము కలుగుగాక.ఇది మాత్రమే నా కోరిక.


ఈశత్వనామకలుషాః కతి వా న సంతి
బ్రహ్మదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః |
ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే యః
పాదయోస్తవ సకృత్ప్రణతిం కరోతి || 3 ||

ఈశ్వరుడు (ప్రభువు) అను పేరును కలుషితము చేయుచూ ప్రతి జన్మము నందునూ వినాశమును పొందు బ్రహ్మ మొదలగు దేవతలెందరు లేరు? నీ పాదములకు ఒక్కసారి ఎవడు నమస్కరించునో ఓ జననీ! వాడే స్ఠిరమైన సిద్ధిని పొందగలడు.


లబ్ధ్వా సకృత్త్రిపురసుందరి తావకీనం
కారుణ్యకందలితకాంతిభరం కటాక్షమ్ |
కందర్పకోటిసుభగాస్త్వయి భక్తిభాజః
సంమోహయంతి తరుణీర్భువనత్రయేఽపి || 4 ||


ఓ త్రిపురసుందరీ! కారుణ్యముతో నిండినదీ, కాంతివంతమైనదీ అగు నీ కటాక్షమును ఒక్కసారి పొంది నీ భక్తులు కోటి మన్మథ  సమానులై ముల్లోకములందలి యువతులను సమ్మోహపరచుచున్నారు.


హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదా
మాతస్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే |
త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ
దీవ్యంతి నందనవనే సహ లోకపాలైః || 5 ||

త్రికోణము నందు నివసించు ఓ తల్లీ! త్రిపురసుందరీ! మూడుకన్నులున్నదానా! నీ నామమగు హ్రీంకారమునే వేదములు వర్ణించుచున్నవి. నీ భక్తులు నిన్ను స్మరించుచూ యమభటుల పరాభవమును వదలి నందనవనము నందు లోకపాలులతో క్రీడించుచున్నారు.


హంతుః పురామధిగలం పరిపీయమానః
క్రూరః కథం న భవితా గరలస్య వేగః |
నాశ్వాసనాయ యది మాతరిదం తవార్ధం
దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య ||6 ||


ఓ తల్లీ! అమృతముతో తడిసి చల్లనైన నీ దేహము పరమేశ్వరుని అర్ధశరీరమై తాపమును చల్లార్చనిచో  త్రిపురాంతకుడగు శివుడు కంఠము నిండుగా త్రాగిన గరళము యొక్క తీవ్రత ఎంత క్రూరముగా ఉండేదో కదా!


సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే
దేవి త్వదంఘ్రిసరసీరుహయోః ప్రణామః |
కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం
ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి || 7 ||

ఓ దేవీ! నీ పాదపద్మములకు చేసిన నమస్కారము సర్వజ్ఞత్వమునూ, సభలలో వాక్పాటవమునూ కలిగించును.అంతేకాక మెరుస్తున్న కిరీటమునూ, ఉజ్జ్వలమైన తెల్లని గొడుగునూ, రెండుపక్కలా వింజామరలనూ, విశాలమైన భూమినీ (రాజ్యాధికారమును)  ఇచ్చును.


కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు
కారుణ్యవారిధిభిరంబ భవాత్కటాక్షైః |
ఆలోకయ త్రిపురసుందరి మామనాథం
త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్ || 8 ||

ఓ తల్లీ! త్రిపురసుందరీ! కోరికలు తీర్చు కల్పవృక్షములు, కరుణాసముద్రములు అగు నీ కటాక్షములతో అనాథయైన, నీ యందు భక్తికల, నీపై ఆశలు పెట్టుకున్న నన్ను చూడుము.

హంతేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే
భక్తిం వహంతి కిల పామరదైవతేషు |
త్వామేవ దేవి మనసా సమనుస్మరామి
త్వామేవ నౌమి శరణం జనని త్వమేవ || 9 ||

అన్యమానవులు ఇతరులైన చిన్న దేవతలపై మనస్సులనుంచి భక్తిని పెంపొందించుకొనుచున్నారు. ఓ దేవీ! నేను మనస్సుతో నిన్నే స్మరించుచున్నాను, నిన్నే నమస్కరించుచున్నాను. ఓ తల్లీ! నీవే శరణము. 

లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-
మాలోకయ త్రిపురసుందరి మాం కదాచిత్ |
నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం
జాతో జనిష్యతి జనో న చ జాయతే వా || 10 ||

ఓ త్రిపురసుందరీ! నీ కటాక్షవీక్షణములకు గమ్యస్థానములు ఎన్ని ఉన్ననూ నన్ను ఒక్కసారి చూడుము. నాతో సమానముగా దయచూపదగినవాడు పుట్టలేదు, పుట్టబోడు, పుట్టుటలేదు.

హ్రీంహ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే |
మాలాకిరీటమదవారణమాననీయా
తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః || 11 ||

ఓ త్రిపురసుందరీ! ’హ్రీం’ ’హ్రీం’ అని ప్రతిదినమూ జపించువారికి లభించనిది ఈ లోకములో ఏమి కలదు? పుష్పమాల, కిరీటము, మదపుటేనుగులతో విరాజిల్లు భూదేవి, శ్రీదేవి స్వయముగనే వారిని సేవించును.

సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు నాన్యమ్ || 12 ||

పద్మముల వంటి కన్నులు కల ఓ త్రిపురసుందరీ! నీకు చేయు వందనములు సంపదలను కలిగించును,  ఇంద్రియములన్నిటికీ సంతోషమును ఇచ్చును, సామ్రాజ్యములనిచ్చును, పాపములను తొలగించును. ఓ తల్లీ! నీ నమస్కారఫలితము ఎల్లప్పుడూ నన్ను పొందుగాక.

కల్పోపసంహృతిషు కల్పితతాండవస్య
దేవస్య ఖండపరశోః పరభైరవస్య |
పాశాంకుశైక్షవశరాసనపుష్పబాణా
సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా || 13 ||

ఓ త్రిపురసుందరీ! ప్రళయకాలమునందు తాండవము చేయుచూ గండ్రగొడ్డలిని చేపట్టిన పరమేశ్వరునకు సాక్షిగా పాశము - అంకుశము - చెరుకువిల్లు - పష్పబాణములను ధరించిన నీ స్వరూపమొక్కటే నిలబడుచున్నది.

లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం
తేజః పరం బహులకుంకుమపంకశోణమ్ |
భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం
మధ్యే త్రికోణనిలయం పరమామృతార్ద్రమ్ || 14 ||

అమ్మా! తేజోవంతమైనదీ, కుంకుమతో ఎర్రనైనదీ, ప్రకాశించు కిరీటమును ధరించినదీ, చంద్రకళను తలపై అలంకరించుకున్నదీ, త్రికోణము యొక్క మధ్యలోనున్నదీ, అమృతముతో తడిసినదీ అగు నీ అర్థశరీరము ఎల్లప్పుడూ నా మనస్సునందు లగ్నమగుగాక.

హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం
త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణంతి |
త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం
సౌఖ్యం తనోతి సరసీరుహసంభవాదేః || 15 ||

ఓ త్రిపురసుందరీ! ’ హ్రీం’కారమే నీ పేరు, నీ రూపము. అది దుర్లభమైనదని చెప్పుచుందురు. నీ తేజస్సుచే ఏర్పడిన ఆకాశము మొదలగు పంచభూతసమూదాయము బ్రహ్మ మొదలగు సమస్తజీవరాశికీ సుఖమును కలిగించుచున్నది.

హ్రీంకారత్రయసంపుటేన మహతా మంత్రేణ సందీపితం
స్తోత్రం యః ప్రతివాసరం తవ పురో మాతర్జపేన్మంత్రవిత్ |
తస్య క్షోణిభుజో భవంతి వశగా లక్ష్మీశ్చిరస్థాయినీ
వాణీ నిర్మలసూక్తిభారభరితా జాగర్తి దీర్ఘం వయః || 16 ||

ఓ తల్లీ! మూడు ’హ్రీం’కారములతో సంపుటితమైన మహామంత్రముతో వెలుగొందుచున్న ఈ స్తోత్రమును ప్రతిరోజూ నీ ముందు నిలబడి ఏ మంత్రవేత్త జపించునో అతనికి రాజులెల్లరూ వశులగుదురు. లక్ష్మి చిరస్థాయిగానుండును. నిర్మలమైన సూక్తులతో నిండిన సరస్వతి ప్రసన్నురాలగును. చిరాయువు కలుగును.

|| ఇతి శ్రీ శంకరభగవత్పాదాచార్య కృతః కళ్యాణవృష్టి స్తవః సంపూర్ణః ||

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.