Tuesday 25 April 2017

శంకరచరితామృతము : 3 : శంకరుల జననము

పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 3

శంకరుల జననము


ఆదిశంకరులు వైశాఖ శుద్ధ పంచమినాడు అవతరించారు. ఆనాడు నక్షత్రం ఆర్ద్ర లేక పునర్వసు అవుతుంది. అది ఒక మహోత్కృష్ట పుణ్యదివసంగా పరిగణించడం నాకు అలవాటు. శివరాత్రి, గోకులాష్టమి, శ్రీరామనవమి మొదలగున్నవి ఎన్నో పుణ్యదివసాలు ఉన్నాయి. అయినా ఈఅన్నిటికంటే ఆచార్యుల జన్మదివసానికి ఒక విశిష్టత ఉంది.

కలియుగం ఆరంభమై రెండు వేల సంవత్సరాలు గడచిన మీదట జనులకు వేదపురాణాదులపై అనాదిగా ఉంటూ ఉన్న విశ్వాసానికి లోపం ఏర్పడింది. జనం అంతా బౌద్ధమతానుకూలాలైన ఉపదేశాల ప్రభావనికి లోనయ్యారు. అందరి మనస్సులమీద బౌద్దులు ఉపదేశాలు పీట పెట్టుకు కూర్చున్నాయి. పరంపరగా వచ్చే వైదికానుష్ఠానం లోపించింది. ఆ సమయంలో ఆచార్యుల పవిత్ర జన్మదివసం ఏర్పడింది. ఆచార్యుల జన్మదివసం కారణంగానే శివరాత్రి, శ్రీరామనవమి మొదలైన పుణ్య దివసాలు విస్మృతాలు కాకుండా మనకు దక్కేయి. అందుచే అన్ని పుణ్యదివసములకంటె ఆచార్యుల జన్మదివసమునందు మనం ఎక్కువ శ్రద్ధ చూపవలసి ఉన్నది. ఈ భవ్యదివసం మళయాళదేశంలో కాలడి గ్రామంలో ఆర్యాంబా శివగురువుల మంగళగృహంలో ఏర్పడిన సంగతి అందరకూ తెలిసినదే.

మళయాళ దేశంలో 'వృషాచలం' అనే మహాశివక్షేత్రం ఒకటి ఉంది. వృషం అంటే నందికేశ్వరుడు. ఆ క్షేత్రంలో వృత్తాకారంగా ఒక కొండ ఉంది. దానిమీద శివాలయం నిర్మింపబడి ఉంది. ఆ క్షేత్రంలో భజన చేసి జనులు స్వామి అనుగ్రహం పొందుతూ ఉంటారు. భజన అంటే ఇక్కడ సేవ అని అర్ధం. ఆ స్వామి సన్నిధానంలో నెల లేక రెండు నెలలు ఉండి అచటి పుణ్యతీర్ధాలలో స్నానం చేసి స్వామిని సేవిస్తూ, స్వామి ప్రసాదం తింటూ, అచటనే నిద్రిస్తూ స్వామిని ఆరాధించడం ద్వారా పొందే వరప్రసాదాన్ని భజన అంటారు. నేడు కూడా ఆ విధంగా అక్కడ భజన చేస్తూ ఉంటారు. ఆ ఊరిపేరు శివపేరూరు. అరవభాషలో తిరుశబ్దానికి శ్రీ అని అర్ధం. ఆ కారణంగా ఆ ఊరిని 'తిరుశివపేరూరు' అని పిలిచేవారు. కాలక్రమేణ అది 'తిరుచ్చూరు'గా మారింది. ఆ క్షేత్రంలో వృషాచలస్వామికి ఆవునేతితో అభిషేకం చేస్తారు. స్వామికి అభిషేకం చేసిన ఘృతం ఎంతో నిలువ ఉంటుంది. ఆయుర్వేదంలో పురాతన ఘృతం చాలా వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. మళయాళంలో ఆయుర్వేదము, ఆయుర్వేద విద్యాభ్యాసము ఎక్కువ. ఈ నాడుకూడా పురాతన ఘృతం కావలసిన వైద్యులు ఈ ఆలయంనుండి ఘృతం తీసికొని వెడుతూ ఉంటారు. వేయియేండ్లకు వెనుకటి ఘృతం కూడా నేడు అక్కడ లభిస్తుంది.

మళయాళదేశంలో బ్రాహ్మణులను నంబూద్రీలు అంటారు. వారిలో వేదాధ్యయనం యెక్కువ. ఆచార్యులు ఈ బ్రాహ్మణశాఖయందే జన్మించేరు. వేదమతోద్ధారణకై అవతరించిన పరమశివుడు వేదాధ్యయన తత్పరులైన బ్రాహ్మణులయందే కదా జన్మించాలి.

శంకరవిజయంలో - దేవతలంతా పరమేశ్వరుని యొద్దకు పోయి పుడమి మీద కర్మానుష్ఠానానికి లోపం ఏర్పడిన దని, దానిని పునరుద్దరించాలని ప్రార్ధించగా, ఈశ్వరుడు తక్కిన అవతారములయందువలెనే ఫలానాదేవతలు ఫలానా మనుష్యులుగా అవతరించాలని ఆజ్ఞాపించినట్లు వ్రాయబడి ఉంది. అవతారాలు అన్నిటిలోనూ సాధారణంగా దేవతలు తమకు ఏర్పడిన రాక్షస బాధ తొలగించవలసినదిగా ప్రార్ధించినట్లు కానవస్తుంది. కాని ఈ అవతారంలో 'కర్మానుష్ఠానం తగ్గిపోయింది, దానిని పునరుద్దరించండి' అని ప్రార్ధించినట్లు చెప్పబడింది.

కర్మానుష్ఠానమే మనం దేవతలకు ఇచ్చే కప్పం. కోర్కెలు ఉన్నంతవరకు మనం దేవతలను అనుగమించాలి. లేకపోతే కష్టాలు కలుగుతాయి.

'దుర్భిక్షం దేవలోకేషు మనూనాముదకంగృహం'- అని వరుణ ప్రశ్నలో ఉంది. దేవతలకే కరవుకాటకాలు కాని, మనుష్యులకు ఏ లోపములేదు; అన్నీ వీరికి సమృద్ధిగా ఉన్నాయని అందులో చెప్పబడింది. ఏమంటే దేవతలకు ఆహారం ఇక్కడ నుండియే వెళ్ళాలి. మనము చేసే కర్మానుష్ఠానమే వారికి ఆహారం. దానిచేతనే వారు ఆనందిస్తారు. అందుచే భూమి మీద కర్మానుష్ఠానానికి లోపం ఏర్పడితే దేవతలంతా పరమేశ్వరుని దగ్గరకు పోయి ఆ దుస్థితిని తొలగించ వలసినదిగా ప్రార్ధిస్తారు.

పరమేశ్వరుడే అవతరించాలి అంటే ఆ సమయం సాధారణసమయంగా ఉండకూడదు. అది ఒక ఘనతరపుణ్య సమయంగా ఉండాలి. అవతరించే పరమేశ్వరుని సందర్శించదగిన పుణ్యాత్ములు ఆ సమయంలో ఉదయించాలి. అలా ఉదయించిన వారికి ఈశ్వర దర్శనభాగ్యం కలిగించేదిగా ఆ కాలం ఉండాలి. ఈ అందరకు సేవచేయడానికై పుణ్యాన్ని పండించుకొన్న భాగ్యవంతులుకూడా జన్మించడానికి వీలుగా ఆ కాలం ఉండాలి. ఇలా పరమేశ్వరావతార కాలం పరమపుణ్యముతో ఘనీభవించినదై ఉంటుందే కాని సాధారణంగా ఉండదు.

వృషాచలంలో శివగురువు ఆర్యాంబ పుత్ర ప్రాప్తిని కోరి స్వామికి భజన చేస్తూ వచ్చేరు. శివగురువు యొక్క తండ్రి పేరు విద్యాధిరాజు. ఒకనాడు స్వామి శివగురువునకు స్వప్నంలో దర్శనం యిచ్చేరు. అలా దర్శనం యిచ్చిస్వామి మీకు దీర్ఘయుష్కులు, మూర్ఖులు అయన నూరుగురు పుత్రులు కావాలా, లేక అల్పాయుష్కుడై, సర్వజ్ఞుడైన ఒక్క కుమారుడు కావాలా! అని ప్రశ్నించేరు. శివగురువుకు ఏమి కోరాలో తెలియలేదు. ''స్వామి! నేను ఈ విషయమై నా భార్యను అడిగి నిర్ణయించి మీకు విన్నవిస్తాను'' అన్నాడు శివగురువు. అంతే! కల చెదరింది. మెలుకువ వచ్చింది. ఆయన తన భార్య ఆర్యాంబతో తనకు కలిగిన స్వప్నం విషయం చెప్పగా ఆమే తనకు కూడా ఇట్టి స్వప్నమే వచ్చింది అని అన్నది. అపుడు భార్యాభర్తలు ఇద్దరూ స్వామికి నమస్కరించి - ''ప్రభూ! మమ్మెందుకు ఇలా పరీక్షిస్తావు. ఏది మాకు మేలని నీవు భావిస్తావో అదే చెయ్యి; ఆ వరమే ప్రసాదించు'' అని ప్రార్థించేరు. అపుడు పరమేశ్వరుడు తానే స్వయంగా వారి యింట అవతరిస్తానని, కొన్ని సంవత్సరాలు మాత్రం ఉంటానని వారికి తెలిపేడు.

ఆర్యాంబా శివగురువులు గ్రామానికి చేరుకొన్నారు. భజన పూర్తి కాగానే సమారాధన చేయడం ఒక ఆచారం. శివగురువు సమారాధన చేసేడు. బ్రాహ్మణులు తృప్తిగా భుజించేరు. అలా బ్రాహ్మణులు భుజించగా మిగిలిన ప్రసాదాన్ని ఆర్యాంబ స్వీకరించింది. అపుడు ఐశ్వర్యమైన (ఈశ్వరసంబంధమైన) తేజం ఆమే గర్భంలో ప్రవేశించింది. ఆమె గర్భవతియై తొమ్మిదినెలలు నిండగానే ఆచార్యులవారిని ప్రసవించింది. జాతకర్మ చేయబడింది. పుట్టిన పదునారవరోజున శిశువుకు నామకరణం చేయాలి అనుకొన్నారు. మళయాళదేశంలో జన్మ నక్షత్రమును జన్మతిథిని పేరుగా పెట్టుకొనే సంప్రదాయం ఒకటి ఉంది. తిరువాన్కూరు మహారాజులలో 'మూలతిరునాళ్‌, విశాఖ తిరునాళ్‌' అనే పేర్లు కలవారు ఉన్నారని చాలామంది ఎరుగుదురుకదా! ఆవిధంగానే శిశురూపంలో ఉన్న శివునకు నామకరణం చేయదలచేరు.

ఆచార్యులకు వారి జన్మదివసాన్ని అనుసరించి పేరు పెట్టవలె ననుకొన్నారు. ఆలోచించి 'శంకర' అని పేరు పెట్టేరు. వేదంలోని 'శంకర' పదం చూచి వారు ఈ పేరు పెట్టలేదు. భగవత్పాదుల అవతారదివసాన్ని బట్టియే ఈ పేరు పెట్టేరు. వారు వైశాఖ శుద్ద పంచమినాడు అవతరించేరు. అనగా ఐదవ తిథి, ఒకటవ పక్షం, రెండవమాసం అయినాయి. ఈ అంకెలను 'శంకర' అనే అక్షరాలు సూచిస్తాయి. 'యాద్యష్టౌ' అనే సూత్రాన్ని అనుసరించి 'శ' అంటే ఐదు. 'కాది నవ' అనే సూత్రాన్ని అనుసరించి 'క' అంటే ఒకటి తిరిగి 'యాద్యష్టౌ' అనే సూతప్రకారం 'ర' అంటే రెండు అవుతుంది. వీనిని తిరుగవేస్తే 'రెండవమాసం మొదటి పక్షం ఐదవ తిథి' అనే అర్ధం వస్తుంది. ఇలా తిథి పక్షమాసాలను సూచించే సంఖ్యాసంకేతంగా 'శంకర' నామధేయం వీరికి ఏర్పడింది. ఆచార్యులకు తల్లిదండ్రులు పెట్టినపేరు ఇదే.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/3.html
 

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.