Sunday 23 April 2017

శంకరచరితామృతము : 2 : అవతారకారణము



శంకరచరితామృతము : 2 : అవతారకారణము
పరమాచార్యుల అమృతవాణి

@ శంకరవాణి


యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం||


'ధర్మం క్షీణించి అధర్మం విజృంభించిన సమయంలో నేను పుడమిపై అవతరిస్తాను' అన్నారు శ్రీకృష్ణభగవానులు. అనగా వెనుక వివస్వానునకు దెల్పిన యోగం యిప్పుడు లోకంలో నశించింది. దానిని పునరుద్ధరించడానికే నా యీ అవతారం. నేను నారాయణుడను, నీవు నరుడవు. వెనుకటి అనేకములైన పుట్టుకలు నేనెరుగుదునే కాని నీ వెరుగవు అని అంటారు ఆయన. ఇలా శ్రీకృష్ణులు ఎన్నోసార్లు అవతరించేరు. ప్రతి అవతారములోనూ జ్ఞానోపదేశంచేశారు. ఎప్పుడు జ్ఞానోపదేశం చేసినా ఈశ్వరునితో అభేదంగా ఉండి విశ్వరూపం ప్రదర్శిస్తూ (భిన్న భిన్న విధాలుగా) వచ్చేరు.

జ్ఞానం ఈశ్వరానుగ్రహం లేనిదే లభింపదు.

ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్‌ శ్రియ మిచ్ఛేద్ధుతాశనాత్‌|
ఈశ్వరాత్‌ జ్ఞాన మన్విచ్ఛేత్‌ జ్ఞానదాతా మహేశ్వర:||


జ్ఞానదాత, జ్ఞానస్వరూపి మహేశ్వరుడే. ఈశ్వరుని కొక్కనికే సర్వజ్ఞుడని పేరు. అమరకోశం కూడా అట్లే చెప్పింది. 'ఈశానః సర్వవిద్యానాం' అని వేదము. లోకాలను పాలించుటకు పరమాత్మయే ఈశ్వరుడై ఉన్నాడు.

నశించిపోయిన జీవబ్రహ్మాభేదయోగాన్ని పునరుద్ధరించడానికై శ్రీకృష్ణులు అవతరించారు. ఆ అవతరణం ద్వాపరాంతంలో జరిగింది. పిమ్మట కలి పుట్టినది. ఆ యోగము తిరుగనష్టమై పోయినది. ఏవో డెబ్బదిరెండు దుర్మతాలు లోకంలో అల్లుకొన్నాయి. ఏ దుర్మతమైనా దానికి ఆరంభంలో జీవం ఎక్కువ. కాని అవి చిరకాలం నిలువలేవు. తొందరలోనే అంతరిస్తూ ఉంటాయి. కరుణానిధియైన పరమేశ్వరునితో ఏమీభేదంలేకుండా ఏకంకావడమే వేదాలు చెప్పే పరమార్థం. అదే అద్వైతం. ఆ అద్వైతముపై విశ్వాసం కృతయుగంలో పరిపూర్ణంగా ఉండేది. ద్వాపరంలో ఆ విశ్వాసం కొంత సన్నగిల్లినది. కాని కలిలో అధర్మం బాగా విజృంభిచి, ధర్మం చాలా క్షీణించింది. అందుచే అద్వైతవిశ్వాసం ఎక్కువగా లోపించింది.

శ్రీకృష్ణావతారంలో కొంతసేపుమాత్రమే అర్జునునకు జ్ఞానోపదేశం చెయ్యడం జరిగింది. మిగిలిన కాలం అంతా అయన రాజ్యవిషయాలను చక్కదిద్దడంలో గడిపేరు. రాజ్యాలలో ధర్మం సుప్రతిష్టితం కావడానికి వలసిన ముక్తులన్నీ ఆయన ఆచరించారు. పంచపాండవులు ప్రార్థిస్తే కౌరవసభకు దూతగా వెళ్ళేరు. ఇలా ఎన్నో పనులు నిర్వర్తిస్తూ జ్ఞానోపదేశానికి కొద్దిసమయం మాత్రమే వినియోగించేరు. అది ద్వాపరయుగం. ఆనాడు కలిలోవలె ధర్మం అనగా అద్వైతవిశ్వాసం బాగా క్షీణించనూలేదు, దుర్మతాలు ఎక్కువ విజృంభించనూ లేదు. కాగా ఆనాటికా పని చాలి ఉన్నా కలిలో ఆ మాత్రంచేస్తే చాలదు. ఇక్కడ పూర్తి జ్ఞానోపదేశంలోనే అవతారకాలం అంతానడవాలి. జ్ఞానోపదేశం తప్ప వేరోకపనిలేని అవతారం కలికి అవసరమైనది.

కలి ప్రారంభంలో కట్టతెగిన ప్రవాహంవలె అధర్మం లోకాన్ని ముంచి ఎత్తింది. ఈ అధర్మ ప్రవాహాన్ని నిలుపడానికి సంకల్పించి పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణవంశంలో అవతరించేడు. సర్వవిద్యలకు అధిపతి అయిన సదాశివుడు జ్ఞానోపదేశానికై అవతరించారు. అదియే శంకరావతారము ఆయన ఈ అవతారము జ్ఞానప్రధానమైనది- విష్ణువు యొక్క అవతారాలన్నీ క్షాత్రప్రధానాలు.

'అతికళ్యాణరూపత్వా న్నిత్యకల్యాణ సంశ్రయాత్‌'

శివము, కల్యాణము, మంగళము, శుభము అన్నీ శివుడే, ఆ శివుడే పరమ మంగళస్వరూపులైన మన ఆచార్యులు.

ఆదిలో ఉండే అద్వైతాన్ని ఉపదేశించడానికై ఈశ్వరాంశ మన ఆచార్యులుగా అవతరించింది. కలిలో అధర్మం ఎలాగూ ఉంటుంది. కాని ఆ అధర్మం పెరుగకుండా నిరోధించాలి .

మన ఆచార్యులు ప్రధానంగా అద్వైతాన్ని బోధిస్తూ దానికి దిగువ భిన్నమత సంప్రదాయాలకు నిలువనీడ నిచ్చారు. ఇలా ఎందుకు చేసేరు? అంటేపరమమైన మోక్షానికి అంతా అధికారులుకారు. కొందఱు మోక్షానికి అధికారులైతే మరికొందరు వారితో సమానమైన పక్వతలేని వారై సాధనపథంలో వారి కంటే దిగువ నిలువవలసినవారుగా ఉంటారు. ఆ మతం వారి వారి పక్వత ననుసరించి ఆయా మతాలు ఉపయోగిస్తాయి. కాని అన్నిటికి గమ్యం అద్వైతం కావాలి. అది మరుగున పడిపోకూడదు. అందుకే వారు ఎన్నిమతాలున్నా అన్నిటికి శిఖరంగా అద్వైతాన్ని బోధించారు.

నీరు అన్నిచోటులందు ఉంటుంది. కాని అన్నిచోటులందు నిర్మలంగా ఉండదు. బావినీరున్నది. అది నిర్మలంగానే ఉంటుంది. దానిలో మలినాలు కలియడానికి అవకాశం లేదు. అలాగే అద్వైతమూ- మిగిలిన మతాలు ఉన్నాయి. మిగిలినవి చిక్కుమార్గాలైతే అద్వైతం రాజమార్గం. వానిద్వారా మోక్షసిద్ది ఎప్పటికో! కాని అద్వైతం శ్రీఘ్ర సిద్ధి నిస్తుంది. 'సూతసంహిత, వైద్యనాధదీక్షితయము' అనే గ్రంథాలలో - ఈ విషయమే చెప్పబడ్డది.

శ్రీశంకరభగవత్పాదులు అవైదికమతాలను కూకటి వ్రేళ్లతో పెల్లగించడానికై అవతరించారు, ఉపాసనా, కర్మజ్ఞానమార్గాలను దాటిన అద్వైతాన్ని స్థాపించడానికి అవతరించారు. ఆయన దిగ్విజయం చేసేరు. వాస్తవానికి దిగ్విజయం చేసినది ఆచార్యలొక్కరే. వారు ఈలోకంలో ఉన్నది కేవలం ముప్పదిరెండు సంవత్సరాలు. బాల్యం పదిసంవత్సరాలు. బాల్య పదిసంవత్సరాలు అనుకొంటే మిగిలినది ఇరువదిరెండు సంవత్సరాలు, ఈ కాలంలో వారు ఆసేతుశీతాచలం మూడుసార్లు పర్యటించేరు, దిగ్విజయం చేసేరు. దీనికి నిదర్శనాలేమిటి? అని ఎవరైనా శంకించవచ్చు. బదరీనారాయణానికి ఆచార్యులు వెళ్లినట్లు నిదర్శనాలున్నాయి. అలాగే దక్షిణాన 'కాలడి'లో వారు జన్మించినట్లు నిదర్శనాలున్నాయి. వారు దేశంలో పలుచోటుల సంచరించినట్లు ఎన్నో సాక్ష్యాలున్నాయి. అన్వేషించేవారికి అవి దుర్లభాలు కావు. ఇలా అల్పకాలంలో విస్తారమైన దేశంలో పర్యటించి ఎన్నో మహాకార్యాలు నిర్వర్తించినవారు సామాన్యులు కారు వారు ఎవరో అవతారపురుషులు అని నిశ్చయంగా తెలుస్తూనే ఉంది.

రామకృష్ణాదులు తాము అవతారాలైనప్పటికి ఇహలోకంలో తమ స్థానాలకు విహితములైన ధర్మాలను అనుసరిస్తూ వానికి అనుగుణంగానే నడచుకొంటూ వచ్చేరు. అట్లే శంకర భగవత్పాదులు కూడ తాము సాక్షాత్‌ పరమేశ్వరులే అయినప్పటికి పూజాద్యనుష్ఠానాలు యథావిధిగా ఆచరిస్తూ భక్తులవలె నడచుకొన్నారు. అందుచే అవతారం మొదలు సిద్ధిపర్యంతమై వీరిచరిత్ర పూర్తిగా శివరహస్యంలో భక్తుల చరిత్రకల నవాంశలో పదునారవ అధ్యాయంలో వర్ణింపబడింది.

కేరళే శశలగ్రామే విప్రపత్న్యాం మదంశజః|
భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో దిజోత్తమః||

- శివరహస్యము.

అని అందు ఉన్నది. అందులో శంకరుల కాలం కలి ఆదిలో రెండువేల సంవత్సరాలకు పిమ్మట అని కానవస్తుంది. ఇక వారి చరిత్రను గూర్చి 'శంకరులు కైలాసానికి వెళ్ళి భోగ లింగము, యోగలింగము, వరలింగము, ముక్తిలింగము, మోహలింగము అనే ఐదు లింగాలను తెచ్చారని, వానిని ఆరాధించియే ఇతరమతాలను ఖండించి దిగ్విజయం చేయగలిగేరని, ఇది అంతా ఆ లింగారాధనవల్ల కలిగిన బలమని'- ఆ గ్రంథంలో వ్రాయబడ్డది. అది శివమహాత్మ్యాన్ని తెలిపే గ్రంథం కదా! అందుచే ఆచార్యుల దిగ్విజయానికి కారణం పంచలింగారాధనం అని చెప్పినది.

శంకరవిజయ గ్రంథాలకు వ్యాఖ్యలు వ్రాసినవారు తమ వ్యాఖ్యలలో శివరహస్యంలోని శ్లోకాలను ఉదహరించేరు. శివ రహస్యం వాస్తవానికి ద్వైతగ్రంథం. శ్రీ శంకరులు పునరుద్ధరించినదీ అద్వైతసిద్దాంతం. ద్వైతమతావలంబకులు అద్వైతాన్ని ఆక్షేపిస్తారు. అది వారికి సహజం. అయినా శివరహస్యంలో ఆచార్యులచరిత్ర ఉంది. ఇది విశేషం. మూడు వేళలా బిల్వదళాలతో శివార్చనం చేయుమని పరమేశ్వరుడు శంకరులకు ఆజ్ఞాపించేరని అందులో ఉన్నది.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/2.html

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.