Wednesday 26 April 2017

శంకరచరితామృతము : 4 : బాల్యం - 1



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 4
బాల్యం - 1

@ శంకరవాణి

ఆచార్యులవారికి ఐదవయేట ఉపనయనం అయింది. ఉపనయనము 'కామ్యోపనయనము, నిత్యోపనయనము' అని రెండు రకాలు. ఏడవేట అనగా గర్భాష్టమమందు ఉపనయనం చేయాలి. బ్రహ్మతేజాన్ని అభ్యర్థించేవారు ఐదవయేటనే ఉపనయనం చేయాలి.

ఆచార్యులవారు మూడేండ్లువయసునాటికే దేశభాషలు నేర్చుకొన్నారు. ఐదేండ్లవయసు వచ్చేసరికి వారు సంస్కృత భాషను చక్కగా అభ్యసించేరు. ఉపనీతులైన తరువాత ఎనిమిదవ ఏడు వచ్చులోగా వేదశాస్త్రాలు అభ్యసించేరు. ఉపనీతులై వారు గురుకులవాసం చేసేరు. ఎనమిదవయేటికి ఇంటికి తిరిగి వచ్చేరు. అప్పటికి వారి తండ్రి దివంగతు లయ్యేరు. అపుడు ఆచార్యులవారు తాము కేవలం ఇంటిలో కూర్చుండుటకు కాక లోకాన్ని ఉద్ధరించుటకు వచ్చితిమని భావించేరు. ఈ లోకోద్ధరణకార్యాన్ని కొనసాగించడానికి సంన్యాసం స్వీకరించవలెనని వారు నిశ్చయించుకొన్నారు. అయితే వారి తల్లి తనకీయన ఒక్కడే కుమారుడు అయినందున వీరికి వివాహము చేయవలె నన్న ఆలోచనలో ఉన్నారు. అందుచే ఆచార్యులవారు తమ తల్లితో 'అమ్మా! నేను సంన్యాసము తీసికొంటాను, అని చెపితే ఆమెకు దుఃఖం కలుగుతుందని సంశయించసాగేరు.

ఆదిశంకరులు సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు బ్రహ్మచర్యాశ్రమంలో భిక్షాన్నముతోడనే జీవించేవారు. ఆరోజులలో ఒక ద్వాదశినాడు వారు భిక్షాటనం చేస్తూ 'భవతి భిక్షాం దేహి!' అంటూ ఒక దరిద్రుని యింట అడుగు పెట్టేరు. ఆయన వారిని అనుగ్రహించాలన్న ఊహతోడనే అలా వారి యింటికి వెళ్ళేరు. ఆగృహస్థు పరమదరిద్రుడు. ఉంఛవృత్తితో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆచార్యులవారు వెళ్ళిన వేళకు ఆబ్రాహ్మణుడు ఇంటిలో లేడు. ఆయన భార్య మాత్రం ఉన్నది. మహాతేజస్సంపన్నులైన ఆచార్యులవారిని చూడగానే ఈ తేజస్వికి భిక్షపెడితే మేలు కలుగుతుంది, అని ఆమె అనుకొన్నది. ఆచార్యులవారిని చూచీ చూడడంతోటే అందరకూ ఒక గౌరవభావం ఆయనపై ఏర్పడేది. ఆ బ్రాహ్మణుని భార్య భిక్షవేయడానికి ఇంటిలో ఏముంది? అని వెదుక సాగింది. ఇంటిలో ఏమీ లేదు. ద్వాదశిపారాణానికై ఆ బ్రాహ్మణుడు ఒక ఉసిరికాయను సంపాదించి ఉంచుకొన్నాడు. అది కూడా చెడిపోయింది. ఈ బ్రహ్మచారికి ఈ ఉసిరికాయ భిక్షగా ఎట్లు వేయను? అని ఆమె సంకోచిస్తోంది.

కాని ఆచార్యులవారు ఆమె భక్తిని గ్రహించి ఆ ఉసిరికను గ్రహించేరు. అపుడు వారి దారిద్య్రాన్ని పోగొట్టుమని లక్ష్మీదేవిని ఉద్దేశించి 'కనకధారాస్తవం' అనే ఒక స్తవాన్ని చదివేరు. వారికి ఐశ్వర్యం ప్రసాదింపుమంటూ లక్ష్మీదేవిని వేడుకొన్నారు.

అప్పుడొక ఆశరీరవాణి-'వీరు చేసిన పాపం చాలా ఉంది; చాలాకాలం వీరు దరిద్రులుగా బాధపడాలి, అలా కాకుంటే వీరి పాపం తొలగదు' అని వినిపించింది.

అంతట ఆచార్యులవారు - 'వీరీవిధంగా పరమప్రీతితో భిక్షం పెట్టినారుకదా! దీనివలన సంపాదితమైన పుణ్యం ఎంత అధికమైన పాపాన్ని అయినా పరిహరింపజాలి ఉంటుంది'- అన్నారు. వెంటనే ఆ దరిద్రబ్రాహ్మణుని యిల్లు సకల సంపదలకు ఆలవాలమై ఐశ్వర్యంతో నిండింది. ఇది ఆచార్యులవారు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా జరిగిన విషయం.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/4-1.html

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.