Sunday 23 April 2017

పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 1 : శంకరుల గురుపరంపర



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 1

శంకరుల గురుపరంపర : గౌడపాదులు, గోవింద భగవత్పాదులు

@ శంకరవాణి

పతంజలి ఆదిశేషుని అవతారం. వ్యాకరణ మహాభాష్యం వ్రాసింది వీరే. వేయి జిహ్వలు కల ఆ పతంజలి చెప్పిన వ్యాకరణ భాష్య ప్రశస్తి విని దానిని చదువుకొనడానికి వేయిమంది శిష్యులు వచ్చారు. పతంజలి చిదంబరంలో వేగాళ్ల మంటపంలో ఉన్నారు. వేయిమందికి ఒకేమారు సందేహనివారణం చేయవలెనంటే ఒక నాలుక ఏం చాలుతుంది? అందు కోసం వారు ఆదిశేషునిరూపం తాల్చారు. అయితే శేష దృష్టి విష దృష్టి, నిట్టూర్పులు విషం కక్కుతూ వుంటై. అవి సోకితే ఎవరయినా సరే చిటికలో చిటికెడు భస్మమైపోతారు. అందువల్ల ఆయన తనకూ శిష్యులకూ నడుమ ఒక తెర కట్టారు. తెరలోపల తామూ తెర వెలుపల శిష్యులూ పాఠం చెపుతూ వుండగా నడుమ ఎవరు లేచి పోయినా సరే వారు బ్రహ్మరాక్షసులయిపోతారని పతంజలి ఒక కట్టడి చేశారు.

ఆజ్ఞ తీసుకొనకుండా బయటికి పోయినవాడు బొమ్మరాకాసి అయిపోతాడని కట్టడి చేసి పతంజలి ఆదిశేషుడై తెరలోపల కూర్చుండి పాఠం చెప్పడానికి పూనుకొన్నాడు. ఆ శిష్యులలో ఒకనికి మాత్రం సందేహం తోచింది - 'మనమేమో వేయిమందిమి, ఒక్కడు ఈ వేయి మందికీ ఎట్లా సమాధానం చెపుతాడు?' అని ఇట్లా అతడు సందేహించి ఆజ్ఞోల్లంఘనం చేసి తెర తొలగించి చూచాడు. అట్లా చూచాడో లేదో విషదృష్టి వారందరిమీదా ప్రసరించింది. అక్కడున్న శిష్యులందరూ పిడికెడుబూడిద అయిపోయారు. బూడిద అయిపోయిన వారు తొమ్మన్నూట తొంబది తొమ్మిది మంది. ఒకడు మాత్రం ఎక్కడికో వెళ్లాడు. అతగాడు కొంచెం బండబ్బాయి. అతనికి పాఠం తిన్నగా తెలియడం లేదు. కొంతసేపు అటూ ఇటూ తిరిగి వస్తే బుద్ధి స్థిరపడి పాఠం సరిగా అర్ధం అవుతుందేమో అని అనుకొని అతడు బయటికి వెళ్లాడు. ఇక్కడ భస్మమయి పోయిన శిష్యులను చూచిన ఆదిశేషుడు మళ్లా పతంజలియై వారి దుర్మరణానికి దుఃఖిస్తూవుండగా, వెలికి వెళ్ళిన శిష్యుడు - ''గురువుగారి ఆజ్ఞ మీరి బయటికి వెళ్ళితినే, గురువేమి కోపం తెచ్చుకుంటాడో'' అని బితుకు బితుకుమంటూ వచ్చాడు. పతంజలికి అతనిని చూడగానే సంతోషం కలిగింది. బండబ్బాయి అయితే అయినాడుకాని ఒకడయినా మిగిలాడుగదా అని ఊరటచెందాడు. ఇక అతనికి పాఠం చెప్పేటంత వ్యవధి తనకు లేదు. కాబట్టి అతనిని ఎట్లాగయినా అనుగ్రహించాలని - 'నాకు తెలిసినదంతా నీకు తెలియాలి. అయినా నా ఆజ్ఞ దాఁటి నీవు ఆవలికి వెళ్ళావు. కాబట్టి బ్రహ్మరాక్షసుడ వవటం నీకు తప్పదు. కాని దాని కొక నివృత్త్యుపాయం ఉన్నది. నే నిచ్చిన విద్యను పాత్రమెరిగి నీ వెపుడుపదేశిస్తావో అపుడు నీకీ బ్రహ్మరాక్షసత్వం పోతుంది' అని అన్నాడు. అనుగృహీతుడయిన ఈ శిష్యుడే గౌడపాదులు. ఆయన గౌడదేశం నుంచి వచ్చారు. ఆయన గురుశాపంచేత బ్రహ్మరాక్షసుడై కూచున్నాడు.

బొమ్మరాకాసి ప్రతిదినమూ ఒక బ్రాహ్మణ్ణి వేదాధ్యయనం చేసినవాణ్ణి గుటకాయ స్వాహా చేస్తూ ఉంటాడు. ఒక శాఖను అధ్యయనం చేసిన వాణ్ణి దూరంగా ఎత్తుకొని పోయి పలు తీరుల ప్రశ్నలు వేయడమూ, వాళ్ళు ప్రత్యుత్తరించలేక పోవడమూ గుటకాయ స్వాహా చేయడమూ ఇది బొమ్మ రాకాసులకు మామూలు. బొమ్మరాకాసి అయిపోయిన గౌడుడు నర్మదాతీరంలో ఒక రావిచెట్టు మీద కూచున్నాడు. ఆ చోటు పంచగౌడ దేశాలకూ పంచద్రావిడ దేశాలకు నట్టనడుమ ఉన్నది. దక్షిణమునుండి ఉత్తరానికిన్నీ ఉత్తరము నుండి దక్షిణానికిన్నీ పోయేవారికి అది దారి. ఉత్తరదేశాన ప్రచారంలో ఉన్న శాస్త్రాలు చదవబోయే దాక్షిణాత్యులున్నూ దక్షిణదేశాన ప్రచారంలో ఉన్న శాస్త్రాలు నేర్వపోయే ఔత్తరాహులున్నూ అనుదినమూ ఆ దారిగుండానే రాకపోకలు చేస్తూవుండేవారు. గౌడులు ఆ వచ్చిపోయేవారిని వ్యాకరణంలో ఒక ప్రశ్న అడిగేది, వారు దానికి బదులు చెప్పలేకపోయేది, ఆ పళంగా వారిని చంపి ఫలాహారం చేసేది. ఇది వాడుక ఐపోయింది. పచ్‌ (డు పచష్‌ పాకే) అనే ధాతువొకటి ఉన్నది. దానికి నిష్ఠాప్రత్యయమైన క్త చేరిస్తే 'పక్వమ్‌' అని అవుతుంది. కాని 'పక్తమ్‌' అని మాత్రం కాదు. దీనికి ప్రత్యేకించి - 'పచో వః' (8-2-52) అని ఒక సూత్రమున్నది. దాని వల్ల 'పక్త' అని కాక 'పక్వ' అని అవుతుంది. గౌడ బ్రహ్మరాక్షసుడువైయాకరణుడు ఎవడయినా కనబడితే 'పచ' ధాతువుకు నిష్ఠలో రూపం ఏమిటి? అని ప్రశ్నించేవాడు. 'పక్తం' అని సమాధానం వచ్చేది. ఎంచేత నంటే అప్పటికింకా మహాభాష్యం అవతరించలేదు. 'పచ' అనే ధాతువుకు నిష్ఠలో వేరు రూపం కలుగుతుందని తెలియని కాలం అది. 'పక్తమ్‌' అని చెప్పగానే - 'పక్తం కాదు; పక్వమ్‌, అని ఔతుంది, నీవు కూడా పక్వమనే అని అంటూ ఆబొమ్మరాకాసి వానిని గుటుక్కున నోట్లో వేసికోనేవాడు. ఇది గౌడుల దినచర్య.

ఇట్లా ఉంటూ ఉండగా ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఆ తోవన వచ్చాడు. చాలా చక్కగా ఉన్నాడు. బొమ్మరాకాసి అతనిని చూడంగానే ఉప్పొంగిపోయాడు. ఎంచేత? నాటికి మంచి ఆహారం దొరికిందీ ఇంకేం తన అస్త్రం తీశాడు. అతడు మహాభాష్యం శాంతిచేయడానికి కాశ్మీరం నుంచి చిందంబరం వెళుతున్నాడు. అతన్ని నిలేసి ఆ బొమ్మరకాసి 'పచ' ధాతువుకు క్త ప్రత్యయం చేరిస్తే ఏమిటిరూపం? అని అడిగాడు. అతడు 'పక్వమ్‌' అని చెప్పాడు. గౌడునకు అపరిమితమయిన ఆనందం కలిగింది. 'ఎన్నో నాళ్ళుగా సరియయినవాడొకడయినా రాలేదు, నేటికి అట్టి వాడవు నీవు వచ్చావు, నీవు సరియయిన శిష్యుడవు. నా గురువు గారు నాకు చెప్పిన విద్యలన్నీ నీకు చెపుతాను, నీ వెక్కడికి వెళుతున్నావు' అని అడగాడు. అతడు వ్యాకరణం చదువు కోడానికి చిదంబంరం పోతున్నాను' అని చెప్పినాడు. 'నాయనా' అలాగా? చిదంబరం విషయం ఎపుడో కొండెక్కింది. అచట నీవు అభ్యసింపగోరే విద్యలను నేనే నీకు చెప్పగలను, నీ విక్కడ ఉండేం' అని గౌడు లన్నారు.

బ్రహ్మరాక్షసుని గురువునుగా వరించి ఎవరు నెగ్గగలరు? దయ్యాలముందు బిడ్డలా? ఎనాళ్ళా బ్రహ్మరాక్షసుడు పాఠం చెబుతాడో అన్నాళ్ళూ చెట్టుదిగరాదుగదా, నిద్రాహారాలుండవు గదా, పాఠాలు రాక్షసివేగంతో ముగించాలిగదా! ఇవన్నీ ఇలా తెలిసినన్నీ శిష్యుడు విని అన్నింటికీ తల ఒగ్గాడు.

పాఠాలు వ్రాసికొందామంటే తాటాకులూ లేవు, గంట మంతకంటే లేదు. పైగా చెట్టు చివరమెట్టు మీద పాఠశాల. చెట్టు దిగకూడదు. అంచేత ఆ శిష్యుడు తన తొడ చీరుకొని అందుండి కారే నెత్తురులో ఒక పుడక కలముగా ముంచి రావాకులమీద ఆ బొమ్మరాకాసి చెప్పేదంతా వ్రాసికోవడం సాగించాడు. ఇలా తొమ్మిది రోజులు నిద్రాహారాలు లేక గడచినవి. ఆ రావియాకులలో ఆ శిష్యుడు వ్రాసికొన్న పాఠమే మహాభాష్యం. ఆ శిష్యుని పేరు చంద్రశర్మ. ఈ కథ పతంజలి విజయం అనే పుస్తకంలో చూపబడుతుంది. పతంజలియే తన శిష్యుడయిన గౌడునికి శాపవిమోచనం చేయడానికి చంద్రశర్మగా వచ్చినటులు ఆ గ్రంథంలో చదువుతాం. ఈ చంద్రశర్మయే తరువాతి ఆశ్రమమున శ్రీ శంకరులకు గురువుగా గోవింద భగత్పాదులను పేర అవతరించారు. గౌడులు గౌడ పాదాచార్యులవారు అనే ప్రసిద్ధి పొందారు.

చంద్రశర్మ వ్యాకరణం పూర్తిగా అయింది. గౌడులకు శాపనివృత్తి అయింది. 'నాకిక వైరాగ్యం శరణ్యం, ఆత్మను ధ్యానించాలి. దానిని తెలుసుకోవడానికి ఉత్తముడైన గురువును అన్వేషించాలి' అని గౌడపాదులు ఆలోచించి ఆలోచించి సమకాలికులలో అట్టివారు, జన్మతోనే జీవన్ముక్తలయినవారు ఎవరా అని తఱచిచూడగా శుక్లాచార్యులు అని అనుకొన్నారు. శుకులు పుట్టుకతోనే ఆత్మజ్ఞాని. యత్నమే లేదు. యజ్ఞాద్యనుష్టానాలు అంతకు ముందే లేవు. 'అంతా మనమే' అని భావించినవారు శుకులు. అనగా అన్నిటిలోనూ నేను ఉన్నానని అర్థం. అట్టి శుకాచార్యుల అనుగ్రహం పొందాలని గౌడసాదులనుకొన్నారు. శ్రీ శుకాచార్యులవారు హిమాలయములో బదిరాకశ్రమంలో ఉన్నారని తెలిసికొన్నారు. తెలిసికొని వారి కడకు వెళ్లారు. వారి దగ్గర సన్న్యాసం పుచ్చుకొన్నారు. అపుడు వారు గౌడపాదాచార్యులు అని పేరు పడ్డారు.
గౌడపాదులు శ్రీ శుకులవద్ద సన్యాసం స్వీకరించి ఆత్మ నిష్ఠయందున్నారు.

నర్మదానదీ తీరంలో ఉన్న చంద్రశర్మ చెట్టుదిగి ఆకుల మూటతో కొంతదూరం వెళ్ళేడు. అతనికి చాలారోజుల నుండి కడుపు తిండి కంటికి కూర్కు లేవు. అందుచే చాలా అలసి ఉన్నాడు. అతడు తన చేతిలోఉన్న ఆకులమూటను తలక్రింద పెట్టుకొని ఒకచోట నిద్రించాడు. ఆ సమీపంలో ఒక గొఱ్ఱ ఆకలములు తింటూ ఉన్నది. అది చంద్రశర్మ తలక్రింద బొత్తిగా ఉన్న ఆకులను చూచి అచటకు చేరి కొన్ని ఆకులు తినివేసింది. అది తినగా మిగిలిన భాగమే నేడున్న మహాభాష్యము. అది తినివేసిన భాగమును అజభక్షితభాష్య మని పిలుస్తారు. చంద్రశర్మ నిద్రనుండి లేచి భాష్యములో కొంత భాగము అజభక్షత మైనందుకు చింతించి మిగిలిన భాగమును చేతబట్టుకొని ఉజ్జయినీ నగరానికి చేరుకొన్నారు.

ఉజ్జయినికి చేరినంతనే చంద్రశర్మను మఠం నిద్ర ఆవహించింది. అతడిచ్చట ఒక వైశ్యుని యింటి అరుగుపై మేను వాల్చాడు. గాఢ నిద్రలో మునిగేడు. అతడు మెలుకవ అన్నది లేక నిద్రిస్తూ ఉన్నాడు.

ఆ వైశ్యుని కొక కుమార్తె ఉన్నది. ఆమె కన్య. తెలివి కలది. ఆమె తమ అరుగుపై ఒడలు తెలియక నిద్రిస్తూఉన్న చంద్రశర్మను చూచింది. కొంతసేపటికి లేస్తాడనుకొన్నది. కాని చంద్రశర్మ లేవలేదు. ఆమె అతనిని మేలుకొలుపుటకు యత్నించింది. కాని చంద్రశర్మకు మెలకువ రాలేదు. ఇతడెవరో తేజస్వి. కాని చాలా కాలంగా ఏ కారణంచేతనో నిద్రాహారములు లేక యీనాడిట్లు నిద్రిస్తున్నాడను కొన్న దామె. అతని ప్రాణములు నెటులైన కాపాడవలెనని ఆ వైశ్యకన్య నిశ్చయించుకొన్నది. కాని ఎలా కాపాడవలెను?

ఆనాడామె పెరుగన్నమును గలిపితెచ్చి యాతనిదేహమునిండా పూసినది. అన్నసారము కొంచెము కొంచెముగా రోమకూపములద్వారా శరీరమున బ్రవేశించ నారంభించినది. ఆమె మరునాడును అటులేచేసినది. కొన్నిదినములిట్లు చేయగా చంద్రశర్మ నూనెలేక క్షీణించుచున్న ద్వీపజ్వాల నూనె పోసినంతనే జ్వలింప నారంభించినట్లు మేల్కొన్నాడు. ఇట్టి చికిత్స మన వైద్య శాస్త్రాలలో చెప్పబడ్డది. నేడు 'ఇంజెక్షనుల' ద్వారా అన్నసారాన్ని శరీరంలోకి ఎక్కించే విధానం ఉన్నది. కాని ఇది హింసతో కూడినది. శరీరమున సూదితో క్రొత్తగా నొక రంధ్రము చేయనిదే యిది సాధ్యం కాదు. కాని పై చికిత్స సులభమైనది. సహజమైనది. కేరళదేశంలో నేటికిని దీనిని పోలిన చికిత్స ఆచరణలో ఉన్నది.

మెలుకవ రాగానే చంద్రశర్మ మొదట తన ఆకులమూట భద్రంగా ఉన్నదా లేదా అని చూచుకొన్నాడు. అది భద్రంగానే ఉన్నది. అతడా ఆకులను చేతబట్టుకొని మరల బయలుదేరాడు.

గృహయజమాని అయిన వైశ్యుడిది చూచాడు. అతడు చంద్రశర్మ మార్గానికి అడ్డువెళ్ళి-అయ్యా! ఇదేమి? మీరిట్ల వెడలిపోతున్నారు. నాకూతురు కన్య. కడంటిన మీ ప్రాణాలను ఆమె కాపాడింది. ఆమె మీ తేజమును జూచి మనస్సులో మిమ్ము పతిగా వరించి ఎంతయో సేవచేసి మిమ్ము బ్రతికించింది. అందుచే మీరామెను పెండ్లాడక యిట్లు పోవుట ధర్మముకాదు. రండు! ఆమెను పరిణయమాడుడు అని ప్రార్ధించేడు. అది విని చంద్రశర్మ ఇదేమి! నేను ఉపదేశము పొందుట పెండ్లియాడుటకా? అని తలచుకొని ఆర్యా! మీ కుమారై చేసిన ఉపకారము దొడ్డది. ఆమెకు భగవానుడు మేలుచేయునుగాక! నేనామెను పెండ్లియాడుట జరుగదు. నాకసలు పెండ్లియం దిచ్ఛ లేదు. నన్ను పోనియ్యండి అని ప్రార్థించేడు. కాని వైశ్యుడు దాని కంగీకరింపలేదు. అతడు చంద్రశర్మతో-అయ్యా! మీ మాటలు ధర్మబద్ధంగా లేవు. నాకూతురు చేసిన ఇంత సేవను ఒక్క ఆశీర్వచనంతో ప్రక్కకు నెట్టి వేస్తున్నారు. ధర్మాధర్మాలను రాజు కదా నిర్ణయిస్తాడు. మీరూ నేనూ రాజునొద్దకు పోదాము. అయన చెప్పినట్లు చేద్దాము-అన్నాడు.

చంద్రశర్మ అంగీకరించాడు. వైశ్యడు, చంద్రశర్మ రాజుయొక్క కొలువులో అడుగుపెట్టేరు. రాజు సింహాసనం మీద కూర్చుండి వీరి రాకను గమనిస్తున్నాడు. ఆయనకు చంద్రశర్మ వయోరూపాలు ఆశ్చర్యానందాలను కలిగించేయి. చంద్రశర్మ తేజస్సుకు రాజు ముగ్ధుడైపోయాడు. ఆయనకును ఒక పెండ్లీడు వచ్చిన కన్య ఉన్నది రాజు మనస్సులో ఈ వర్చస్వి తన కల్లుడైతే! అన్న భావం మెదలింది. అందుచే ఆయన వైశ్యుని వివాదం ఆలకించకుండానే చంద్రశర్మను జూచి అయ్యా! మీరెవరు? మీకు వివాహమైనదా? నా కూతురును మీరు పెండ్లాడాలి! మీకు అంగీకారమేనా? కాని యీ వివాహాన్ని ధర్మశాస్త్రాలు అంగీకరిస్తాయా? అని ప్రశ్నిస్తూ చంద్రశర్మ సమాధానానికి ఎదురుచూడకుండా ఒక సేవకుణ్ణి పిలిచి-పోయి మంత్రిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు.

ఇది చూచి చంద్రశర్మ, వైశ్యుడు నోటమాట లేక నిలువబడ్డారు. రాజాజ్ఞ విన్నంతనే మంత్రి కొలువులోకి వచ్చేడు. ఆ మంత్రి సూక్ష్మబుద్ధి. కొలువులో నిలువబడి ఉన్న యువకుడై తేజస్వియైన చంద్రశర్మను చూడగానే రాజాజ్ఞలోని ఆంతర్యం అవగతం చేసికొన్నాడు. చంద్రశర్మ తేజోమయ రూపానికి ఆతడుకూడ ముగ్ధుడై-తమ రాజ్యానికి ఇది భాగ్యవంతమైనకాలం అనుకొన్నాడు. ఆయన విషయం అంతా వివరంగా తెలిసికొని చంద్రశర్మ బ్రాహ్మణుడు కనుక తొలుత బ్రాహ్మణకన్యను పెండ్లాడి పిదప క్షత్రియ వైశ్యకన్యలను క్రమంగా పెండ్లాడవచ్చును, ఇది ధర్మశాస్త్రములంగీకరించిన విషయమే-అని చెప్పేడు.

చంద్రశర్మ ఏంచేస్తాడు! ఒక్క వైశ్యకన్యను వదల్చుకొనడానికి చేసినయత్నం ముగ్గురు కన్యలను పెండ్లాడడానికి దారితీసింది. అతడు తన ముగ్గురు భార్యలకు పుత్రోత్పత్తి అయినంతనే తనదారిని తాను పోతానన్నాడు. రాజు దాని కంగీకరించాడు. క్షత్రియ వైశ్యకన్యలు సిద్ధంగానే ఉన్నారు. ఉత్తమకులంలో పుట్టిన బ్రాహ్మణకన్యను వెదకడం వారికి కష్టంకాలేదు. చంద్రశర్మ ముగ్గురు కన్యలనూ పెండ్లాడేడు.

కొంతకాలానికి చంద్రశర్మకు ముగ్గురు భార్యలయందు ముగ్గురు పుత్రులుదయించారు. వెంటనే చంద్రశర్మ బయలుదేరేడు. అతని అన్వేషణం అంతా తనకు వ్యాకరణం, నేర్పిన గురువును గూర్చి. తన గురువు బదరికాశ్రమంలో సన్యాసియై ఉన్నాడని తెలిసికొని చంద్రశర్మ నెమ్మదిగా పయనించి ఆయన వద్దకు చేరుకొన్నాడు. గురువుననకు నమస్కరించి చంద్రశర్మ తనకుకూడ సన్యాసం అనుగ్రహింపవలసినదని ప్రార్థించాడు. ఆయన శిష్యుని యోగ్యత గుర్తించి అనుగ్రహించారు. సన్యాసం స్వీకరించిన చంద్రశర్మ గోవింద భగవత్పాదాచార్య నామంతో ప్రసిద్ధులయ్యేరు. శ్రీ శుకులకు పిమ్మట వచ్చిన ఆచార్యులకు పరివ్రాజకులన్న పేరు ఏర్పడ్డది.

గోవింద భగత్పాదులవారు గురు సన్నిధానంలో బదరికాశ్రమంలో ఉన్న సమయంలోనే శ్రీ శుకులతో వారికి తండ్రియు గురువునైన వ్యాసులు అచటికి వచ్చేరు. శ్రీ శుకులను వ్యాసులను దర్శించి గోవిందభగవత్పాదులు తాము ధన్యుల మయినామని భావించేరు. గోవింద భగవత్పాదులను చూచి వ్యాసులు-ఓయీ! 'బ్రహ్మసూత్రములను' నేను కూర్చేను. వానికి భాష్యం వ్రాయాలి. ఆ భాష్యం వ్రాయడానికి ఈశ్వరుడే భూమి మీద అవతరిస్తాడు. అలా అవతరించి ఆయన సన్యాసం పుచ్చుకొంటారు. లోకంలోని సంప్రదాయాన్ని నిలువ బెట్టడానికి ఈశ్యరావతారమైనప్పటికి వారికి గురువు అవసరం. అందుచే నీవు నర్మదా తీరంలోఉన్న రావిచెట్టుక్రింద నివసిస్తూ వారి రాకకై నిరీక్షించు. ఆయనరాగానే ఆయనకు ఉపదేశం చెయ్యి. ఇది నీవు చేయవలసిన పని'-అన్నారు.

శ్రీశుకులు, వ్యాసులు, గౌడపాదులు, గోవింద భగవత్పాదులు బదరికాశ్రమంలో సమావిష్టులై చేసిన నిర్ణయమిది. ఆ నిర్ణయాన్ని అనుసరించి గోవిందభగవత్పాదులవారు నర్మదాతీరానికి బయలుదేరేరు.

ఈ గోవిందభగవత్పాదులకు పూర్వాశ్రమంలో ఏగురువులు వ్యాకరణ శాస్త్రము బోధించారో ఉత్తరాశ్రమంలో వారే యతిధర్మాన్ని అనుగ్రహించారు. అట్లే ఆయన పూర్వాశ్రమంలో ఏవక్షంక్రింద విద్యాగ్రహణం చేశారో ఉత్తరాశ్రమంలో ఆ వృక్షం క్రిందనే నివసిస్తూ శిష్యుని రాకకై ఎదురుచూడసాగేరు.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/1.html
 

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.