Saturday 22 April 2017

పరమాచార్యుల అమృతవాణి : కలిలో ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువ, కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది



పరమాచార్యుల అమృతవాణి : కలిలో ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువ, కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది
(జగద్గురుబోధల నుండి)

@ శంకరవాణి

కొందరు శంకిస్తూ ఉంటారు. ఏమని అంటే అయ్యా! కలిలో అధర్మాలు ప్రబలుతాయని ధర్మం క్షీణిస్తుందని పురాణాలు చెప్పిన మాటయేకదా! ఇక వేదాలు నశిస్తున్నాయనీ అధర్మం పెరిగిపోతోందనీ గోల చేయడం ఎందుకు? దీనివల్ల ప్రయోజనం ఏమున్నది? పురాణాలు చెప్పినమాటలు దబ్బరలు కావని మీరే అంటున్నారు కదా!- అని ఆక్షేపిస్తారు వారు.

జోస్యం విషయంలోకూడా వారి ఆక్షేపణ ఈ తీరుగానే ఉంటుంది. దానిని గూర్చి వారి ఆక్షేపణ ఏమంటే-జోస్యం వట్టి నిరర్థకవిషయం. మనకు దుఃఖం రానున్నదని జోస్యం ద్వారా తెలిసింది. దానివల్ల ఎప్పుడో రాబోయే దుఃఖాన్ని తలచుకొని ఇప్పటినుండీ ఏడవవలసి వస్తోంది. అలా కాక మనకు ఏదో గొప్ప సుఖం కలుగనున్నదని జోస్యంద్వారా తెలిసింది. అప్పుడు రాబోయే సుఖాన్నిగూర్చి ముందే తెలియడంద్వారా వాస్తవంగా సుఖం కలిగిన సమయంలో ఎక్కువ ఆనందం అనుభవించలేకున్నాము. ఈ సుఖం ఎలాగూ రావలిసినదే. వచ్చినది, అంతే! అన్నభావంతో ఎక్కువగా ఆనందించలేము. కాగా జ్యోస్యం రానున్న సుఖాన్ని గూర్చి చెప్పినా లేక దుఃఖాన్ని గూర్చి చెప్పినా మనకు కలిగే ప్రయోజనం లేదు సరికదా; నష్టం ఉన్నదని వారి ఆక్షేపణ.

మరి అయితే ఆ పురాణాలలో కలిరాబోతోంది, ధర్మం క్షీణిస్తుంది, అధర్మం విజృంభిస్తుంది-అనే మాటలు ఎందుకు చెప్పినట్లు? ముందుగా ఈ హెచ్చరిక చేయడంవల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పై ఆక్షేపణచూస్తే కొందరకు సమాధానం వెంటనే స్ఫురించదు.

కాని పరిశీలిస్తే ఆ హెచ్చరిక నిష్ప్రయోజనం కాదని, దానివల్ల ప్రయోజనం ఉందని తేలుతుంది.

ఒకచోట దొంగల భయం ఎక్కువగా ఉన్నది. ఆ దొంగలు గజదొంగలు. ఎంత జాగ్రత్తగా భద్రం చేసినా సొత్తు ఎత్తు పోతున్నారు. ఇది అచట నున్న వారికందరికీ తెలిసినదే. అయితే మాత్రం - మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు మన కన్నులుగప్పి సొత్తు అపహరిస్తూనే ఉన్నారు. ఇక మనం జాగ్రత్తపడి ప్రయోజనం ఏముంది? ఇంటిలో ఉన్న యీ సొత్తు అంతా వాకిటిలోనే పారవేద్దాం- అని తలచేవారు ఉంటారా! ఉండరు. జాగ్రత్తకలిగి ఉంటే ఏదో కొంతైనా రక్షించుకోవచ్చునను కొంటారేగాని సొమ్మును నడివీధిలో పారవేయరు.

అలాగే కలిలోని ధర్మవిషయములో కూడ ఎక్కువ జాగ్రత్త అవసరమని తెలియజేయడానికే పురాణాలు అలా హెచ్చరించాయి. అదీ కాక కలిలోని అధర్మప్రవాహాన్ని ఎదురిస్తూ ఆచరించిన ధర్మం అల్పమైనా ఇతర యుగాలలో ఆచరించపడినదాని కంటె కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిపక్షాన్ని ఎదురించి నిలుచుటలోనే శూరుడు యశ మార్జిస్తాడు. అందుచే లోకం ఎంత పరిహసిస్తూ ఉన్నా లక్ష్య పెట్టక ధైర్యంతో ధర్మాన్ని ఆచరిస్తే ఎంత కలి అయినా చిత్తశుద్ధి కలుగుతుందనడానికి సందేహం లేదు.

'కలిః సాధుః' అని ఒక వాక్యము. అనగా కలికాలము సాధువైన కాలము అని అర్థం. ఇదెలా! వెనుకచెప్పిన మాటలకిది విరుద్ధం కాదా! అనిపిస్తుంది. ఇది వేరొక దృష్టితో చెప్పినమాట. మిగిలిన యుగాలలో ఎంతోకాలం తపస్సుచేస్తేగాని లభించని ఫలితం కలిలో అల్పకాలం చేసిన తపస్సు ద్వారా పొందవచ్చును. అది దృష్టియందుంచుకొని 'కలిః సాధుః' అన్నారు. ఈశ్వరుడుకూడ ఈ యుగంలో తన్నెవరును ఆశ్రయింపవచ్చుటలేదే! అని, ఎవరైనా తనవద్దకు వెదకుకుంటూ వస్తారా! అనీ అట్టివారిని తానే వెదకుతూ ఉంటాడు. తనను గూర్చి కొంచెంగా అన్వేషించేవానిని కూడా చక్కగా అనుగ్రహిస్తారు. అందుచే కలిలో అధర్మం ఎక్కువుగా ఉండేమాట నిజమైనా ఇచట ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువైనందున వేదధర్మాలను ఎవరూ విడచిపెట్టకూడదు. 

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/blog-post.html

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.