Thursday 27 April 2017

శంకరచరితామృతము : 6 : బ్రహ్మసూత్రభాష్య రచన



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 6
బ్రహ్మసూత్రభాష్యరచన

@ శంకరవాణి

తల్లిని వదలి ఆచార్యులవారు సక్రమంగా సన్యాసం స్వీకరించడానికై గురువును అన్వేషిస్తూ బయలుదేరేరు. ఈశ్వరావతారమైన ఆచార్యమూర్తికి వేరొక గురువు అవసరం కాకపోయినా లోకంలో సంప్రదాయాన్ని నిబంధించడానికై వారు అట్లు చేయవలసి వచ్చింది. స్వయంగా శంకరులే గురువును ఆశ్రయింపకపోతే లోకంలోని ఇతరులు గురువును ఆశ్రయించే సంప్రదాయం లోపించవచ్చును. అందుచే వారు గురువును వెదుకుతూ బయలుదేరేరు. వారు నర్మదాతీరంలో గురువును కలసికొన్నట్లు గ్రంథాలలోను కనిపిస్తొంది.

ఆచార్యులవారు శ్రీ గోవిందభగవత్పాదుల సన్నిధిలో సక్రమంగా సన్యాసం స్వీకరించేరు. శ్రీ గోవిందభగవత్పాదులవారు బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయవలసినదిగా శంకరులను ఆజ్ఞాపించేరు. పిమ్మట ఆచార్యులవారు అచటనుండి వారణాసికి బయలుదేరేరు. అక్కడనే వారు భాష్యరచనకు ఉపక్రమించేరు. వారు కాశిలో మణికర్ణికాఘట్టంలో ముక్తి మంటపంలో నివసిస్తూ శిష్యులకు ఉపదేశం చేస్తూ ఉండేవారు.

కాశి ఒక మహాక్షేత్రం. అక్కడ దేహత్యాగం చేసిన ప్రతి ప్రాణికి విశ్వేశ్వరుడు జ్ఞానోపదేశం చేసి ముక్తిని ప్రసాదిస్తాడు, ఇది ఆక్షేత్రంయొక్క విశేషం, కాశీక్షేత్రానికి వేరొక విశేషం కూడా ఉంది. మనదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అన్నిమతాల ప్రతినిధులూ కాశీలో ఉండేవారు. ఆ కాలంలో కాశి అంటే పండితులుండే పట్టణం. యాత్రకై ఎందరో పండితులు అచటకు వచ్చి కొంతకాలం ఉండిపోతూ ఉండేవారు. మన దేశంలో ఎన్ని జాతులు ఎన్ని మతములు, ఎన్ని భాషలు ఉన్నాయో, అన్నీ అక్కడ కనిపిస్తాయి. అందుచే ఏ విషయమైనా కాశిలో ప్రచారంచేస్తే లోకంలో అంతటా ప్రచారం చేసినట్లు అవుతుంది. ఆచార్యులు కాశిలో భాష్యం రచించడానికి ఇదికూడా ఒక హేతువు. దినదినము దేశవిదేశములనుండి వచ్చిన వేదపండితులు కొంత కొంత ఆలకించుచుండగా ఆచార్యులవా రొనరించిన భాష్యరచన లోకంలో అనతికాలంలో ప్రశస్తి వహించింది. ఆచార్యులవారు తమరచనలో కొన్ని మతముల సిద్ధాంతాలను నిరాకరించేరు, ఔపనిషదమైన మతాన్ని స్థాపించేరు.

ఒకనాడు వ్యాసమహరి స్వయంగా ఆచార్యులవారిని అనుగ్రహించాలనుకొన్నారు. ఈశ్వరావతారమైన శంకరులకు ఉపదేశం చేయవలసినదిగా శ్రీ గోవిందభగత్పాదులవారికి ఆజ్ఞాపించినవారు వ్యాసులే. వారు శంకరభాష్యము లోకోపకారకమైన మహాగ్రంథమని లోకం గ్రహించేలా చెయ్యాలనుకొన్నారు. శంకరభాష్యం ప్రశస్తమైన దని నలుగురూ తొలిసికోవాలంటే, దానిపై కొన్ని ఆక్షేపాలు లేవదీయాలి, శంకరులు వానికి అన్నిటికి సమాధానాలు చెప్పాలి; అప్పుడే దాని ప్రశస్తి లోకానికి వెల్లడి అవుతుంది. అందుచే వ్యాసులు ఒకనాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆచార్యులవారి వద్దకు వచ్చి వారి భాష్యరచనపై ప్రచండమైన వాదం లేవనెత్తేరు. వ్యాసులవారి ఆక్షేపణలకు ఆచార్యులవారు సమాధానాలు చెపుతున్నారు. వ్యాసులవారు ఆచార్యులవారి సమాధానాలలోని సూక్ష్మాంశాలను తిరిగి ఆక్షేపిస్తున్నారు. ఆచార్యులవారు వానికి యుక్తియుక్తంగా సమాధానాలు చెపుతున్నారు. ఇలా జరిగే వాదప్రతివాదాలు పరమ సూక్ష్మాంశాలపై సాగుతూ అన్యులకు అర్థంకాని క్లిష్టస్థితికి చేరుకొన్నాయి. ఈ వాదప్రతివాదాలు చూచి ప్రక్కనున్న శిష్యులు, ఇతరులు కూడా ఒకరి మొగాలు ఒకరు చూచుకొనసాగేరు. వృద్ధబ్రాహ్మణరూపంలో ఉన్న వ్యాసుని వాదం పొంగిన గంగలా పరుగెడుతూ ఉంటే ఆచార్యులవారి ప్రతివాదం సాగరగంభీరమై అలరారుతోంది. అపుడు ఆచార్యుల శిష్యులైన పద్మపాదులవారు 'ఉద్దండవాదన కొనసాగించే యీ వృద్దబ్రాహ్మణుడెవరై ఉంటాడు?' అని జ్ఞానదృష్టితో పరింకించి, 'ఈ వచ్చినవాడు వ్యాసుడు' అని గ్రహించేరు, వెంటనే వారు -

'శంకర శ్శంకర స్సాక్షాత్‌ వ్యాసో నారాయణ స్స్వయం|
తయో ర్వివాదే సంప్రాప్తే కింకరః కింకరో మ్యహం||'


శంకరులు శంకరావతారము, వ్యాసులు నారాయణావతారము అయినవారు. వారు వాదిస్తూ ఉంటే కింకరుడైన నేనేమి చేయగలను? అని పలికి, వాస్తవముగా ఈ భాష్యము మీహృదయములోని అభిప్రాయలనే అనుసరిస్తూ ఉంటే మీరు నిజరూపం ధరించాలి' అని వ్యాసులవారిని ఆర్థించేరు. తత్‌క్షణమే వ్యాసులు నిజరూపం ధరించేరు.

అపుడు శంకరులు - నేను వచ్చిన పని పూర్తి అయింది, పదునారేడులు నిండినవి, ఇక నేను పోవాలి, అనుగ్రహించండి' - అని వ్యాసులతో పలికేరు. దానికి వ్యాసులవారు నేను మరియొక పదునారేడ్లు అనుగ్రహించుచున్నాను; భాష్యరచన మాత్రము చాలదు, దానిలోని సిద్ధాంతములను పలుదేశాలలో ప్రచారం చెయ్యాలి, కొందరు ఏవో ఆక్షేపణలు లేవదీస్తారు, వానికి సమాధానాలు చెప్పాలి; భాష్యవిషయాలను సిద్ధాంతీకరించాలి' - అన్నారు. శంకరులు దానికి అంగీకరించేరు. వ్యాసుల కోరికను తీర్చుటకై వారు దిగ్విజయం గావించేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/6.html

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.