Saturday 2 September 2017

శంకరస్తోత్రాలు : అనాత్మశ్రీవిగర్హణమ్


|| శంకరస్తోత్రాలు : అనాత్మశ్రీవిగర్హణమ్ ||

లబ్ధా విద్యా రాజమాన్యా తతః కిం
ప్రాప్తా సమ్పత్ప్రాభవాఢ్యా తతః కిమ్ |
భుక్తా నారీ సున్దరాఙ్గీ తతః కిమ్
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 1||


రాజమాన్యతనుబొందించు విద్య లభించినది, ఫలమేమి? ప్రభుశక్తితో కూడిన సంపదను పొందినను ఫలమేమి? సుందరాంగియగురమణితో భోగమును అనుభవించినను ఫలమేమి?  ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. అట్టిచో ఇవి అన్నియును వ్యర్థములే!

కేయూరాద్యైర్భూషితో వా తతః కిం
కౌశేయాద్యైరావృతో వా తతః కిమ్ |
తృప్తో మృష్టాన్నాదినా వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 2||


ఏవ్యక్తి ఆత్మసాక్షాత్కారమును పొందలేదో, అతడు కేయూరాది - అలంకారములవలన భూషితుడైనను, పట్టుపుట్టములను కట్టినను, మధురాన్నాదులవలన తృప్తినందినను ఫలమేమి?

దృష్టా నానా చారుదేశాస్తతః కిం
పుష్టాశ్చేష్టా బన్ధువర్గాస్తతః కిమ్ |
నష్టం దారిద్ర్యాదిదుఃఖం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 3||


మనోహరములగు పెక్కుదేశములను వీక్షించినాడు, ఇష్టులగు బంధువర్గమును పోషించినాడు, దారిద్ర్యమును నశింపచేసికొనినాడు. కాని, ఆత్మసాక్షాత్కారమునందలేదు , లాభమేమి?

స్నాతస్తీర్థే జహ్నుజాదౌ తతః కిం
దానం దత్తం ద్వ్యష్టసంఖ్యం తతః కిమ్ |
జప్తా మన్త్రాః కోటిశో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 4||


ఎవనికి ఆత్మస్వరూపదర్శనము లభింపలేదో అతడు గంగాదితీర్థముల స్నానమొనర్చిన నేమి ఫలము? షోడశదానముల నొనర్చిన ఏమి ఫలము? కోటి మంత్రజపమొనర్చిన ఏమి ఫలము?

గోత్రం సమ్యగ్భూషితం వా తతః కిం
గాత్రం భస్మాచ్ఛాదితం వా తతః కిమ్ |
రుద్రాక్షాదిః సద్ధృతో వా తతః కిమ్
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 5||


గోత్రము(వంశము)అలంకృతమైనది. గాత్రము భస్మాచ్ఛాదితమైనది, రుద్రాక్షాదులు చక్కగ ధరింపబడినవి. కాని ఆత్మానుభవములేదు. వీని వలన కలుగు ఫలమేమి?

అన్నైర్విప్రాస్తర్పితా వా తతః కిం
యజ్ఞైర్దేవాస్తోషితా వా తతః కిమ్ |
కీర్త్యా వ్యాప్తాః సర్వలోకాస్తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 6||


ఆత్మసాక్షాత్కారమునందనివాడు విప్రులను అన్నభోజనముతో సంతోషపెట్టగ కలుగు ఫలమేమి? యజ్ఞమున దేవతలను సంతోషపరచిన ఫలమేమి? కీర్తితో సర్వలోకములను వ్యాపింపచేసిన కలుగు ఫలమేమి?

కాయః క్లిష్టశ్చోపవాసైస్తతః కిం
లబ్ధాః పుత్రాః స్వీయపత్న్యాస్తతః కిమ్ |
ప్రాణాయామః సాధితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 7||


ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. ఉపవాసములొనర్చి, కాయక్లేశ మొనర్చిన లాభమేమి? స్వభార్యవలన పుత్రులను బడసిన లాభమేమి? ప్రాణాయామమును సాధించిన ఫలమేమి?

యుద్ధే శత్రుర్నిర్జితో వా తతః కిం
భూయో మిత్రైః పూరితో వా తతః కిమ్ |
యోగైః ప్రాప్తాః సిద్ధయో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 8||


ఆత్మసాక్షాత్కారమునందనివాడు యుద్ధమున శత్రువులను నిర్జించినను, మిత్రులతో నిండియున్నను, యోగసిద్ధులను పొందినను లాభమేమి?

అబ్ధిః పద్భ్యాం లఙ్ఘితో వా తతః కిం
వాయుః కుమ్భే స్థాపితో వా తతః కిమ్ |
మేరుః పాణావుద్ధృతో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 9||


సముద్రమును అడుగులతో దాటినను, వాయువును కుంభకప్రాణాయామమున నిల్పినను, మేరువును చేతితోనెత్తినను, ఆత్మసాక్షాత్కారము నందకుండిన లాభమేమి?

క్ష్వేలః పీతో దుగ్ధవద్వా తతః కిం
వహ్నిర్జగ్ధో లాజవద్వా తతః కిమ్ |
ప్రాప్తశ్చారః పక్షివత్ఖే తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 10||


విషమును పాలవలె త్రాగగలడు, నిప్పులను పేలాలవలె తినగలడు, పక్షివలె ఆకసమున తిరుగగలడు, కాని ఆత్మసాక్షాత్కారము నందలేదు, ఫలమేమి ?

బద్ధాః సమ్యక్పావకాద్యాస్తతః కిం
సాక్షాద్విద్ధా లోహవర్యాస్తతః కిమ్ |
లబ్ధో నిక్షేపోఽఞ్జనాద్యైస్తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 11||


అగ్న్యాదులను లోబరుచుకొనిననూ, సుదృఢలోహములను విరచిననూ, అంజనాదులవలన ధననిక్షేపములను పొందిననూ, ఆత్మసాక్షాత్కారమొనర్చుకొననియెడల లాభమేమి?

భూపేన్ద్రత్వం ప్రాప్తముర్వ్యాం తతః కిం
దేవేన్ద్రత్వం సమ్భృతం వా తతః కిమ్ |
ముణ్డీన్ద్రత్వం చోపలబ్ధం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 12||


ఉర్వియందు రాజేంద్రత్వము లభించినది. లాభమేమి ?  స్వర్గమున దేవేంద్రత్వము లభించినది. లాభమేమి ? వనమున యతీంద్రత్వము లభించినది, లాభమేమి ? ఆత్మసాక్షాత్కారము లభింపకుండిన ?

మన్త్రైః సర్వః స్తమ్భితో వా తతః కిం
బాణైర్లక్ష్యో భేదితో వా తతః కిమ్ |
కాలజ్ఞానం చాపి లబ్ధం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 13||


మంత్రబలమున సమస్తమునూ స్తంభింపచేసిననూ, బాణముతో లక్ష్యమును భేదించిననూ, కాలజ్ఞానమును బడసిననూ, ఆత్మసాక్షాత్కారమొక్కటి లేకుండినచో మిగిలినవన్నియునూ వ్యర్థములు.

కామాతఙ్కః ఖణ్డితో వా తతః కిం
కోపావేశః కుణ్ఠితో వా తతః కిమ్ |
లోభాశ్లేషో వర్జితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 14||


కామావేశము ఖండింపబడినది. కోపావేశము కుంఠితమైనది. లోభపరిష్వంగము వర్జింపబడినది. అయిననూ ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. లాభమేమి ?

మోహధ్వాన్తః పేషితో వా తతః కిం
జాతో భూమౌ నిర్మదో వా తతః కిమ్ |
మాత్సర్యార్తిర్మీలితా వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 15||


మోహాంధకారము నలుగగొట్టబడినది. పృథ్వియందు గర్వరహితుడేయైనాడు. మాత్సర్యపీడ ప్రశమితమైనది. అయిననూ ఆత్మదర్శనములభింపకుండిన వీనివలన లాభమేమి ?

ధాతుర్లోకః సాధితో వా తతః కిం
విష్ణోర్లోకో వీక్షితో వా తతః కిమ్ |
శంభోర్లోకః శాసితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 16||


బ్రహ్మలోకము సాధించిననూ, విష్ణులోకమును వీక్షించిననూ, శివలోకమును శాసించిననూ,  ఆత్మలోకమును సాక్షాత్తుగ చూడకుండిన లాభమేమి ?

యస్యేదం హృదయే సమ్యగనాత్మశ్రీవిగర్హణమ్ |
సదోదేతి స ఏవాత్మసాక్షాత్కారస్య భాజనమ్ || 17||


ఎవనిహృదయమున సంపూర్ణముగ ఈ రీతిగ ఎల్లప్పుడునూ అనాత్మవస్తుసౌందర్యనింద ఉదయించుచుండునో, అతడే ఆత్మసాక్షాత్కారమునకు అర్హుడు.

అన్యే తు మాయికజగద్భ్రాన్తివ్యామోహమోహితాః |
న తేషాం జాయతే క్వాపి స్వాత్మసాక్షాత్కృతిర్భువి || 18||


మిగిలినవారు, జగత్భ్రాంతివ్యామోహమోహితులు. వారికి జగత్తున ఎన్నడునూ ఆత్మసాక్షాత్కారము లభింపదు.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ అనాత్మశ్రీవిగర్హణం సమ్పూర్ణమ్ ||

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.