Thursday 27 April 2017

శంకరచరితామృతము : 7 : మనీషాపంచకం, అంతరార్థం


పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 7
మనీషాపంచకం, అంతరార్థం

@ శంకరవాణి

ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి బయలుదేరారు. అపుడొక మాలవాడు ఎరిగి ఎరిగి అలాచేయాలనే ఉద్దేశ్యంతోనే వారికి దగ్గరగా వచ్చి వారికి ప్రక్కనే నిలువబడ్డాడు. ఆచార్యులవారు మాలవానిని దూరంగా తొలుగుమన్నారు. కాని వాడు తొలగక ఆచార్యులవారిని ప్రశ్నించనారంభించేడు.

అన్నమయా దన్నమయం, అధవాచైతన్యమేవ చైతన్యాత్‌|
ద్విజవరదూరీకర్తుం వాంఛసి కిం బ్రూహీ గచ్ఛ గచ్ఛేతి ||


బ్రాహ్మణోత్తమా! దేనిని తొలగు మనుచున్నారు?

విప్రోఽయం శ్వపచోఽయ మిత్యపి మహాన్‌కోఽయం విభేదభ్రమః|

అంటూ ఆ మాలవాడు మీరు శిష్యులకు వేదాంతమే కదా బోధిస్తున్నారు! వేదాంతం - 'వాడు వేరు, వీడు వేరు' అని చెపుతూ ఉన్నదా? గీతలో భగవానులు -

విద్యా వినయంసంపన్నే బ్రాహ్మణ గవిహస్తిని|
శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః||

అని కదా చెప్పేరు. ఈ భేదభ్రాంతి మీకు ఎలా అలవడింది? మీరు 'అహం బ్రహ్మస్మి, శివోఽహం' అని పలుకుతూ ఉంటారుకదా! వానికి అర్థం ఏమిటి? అని ఆ చండాలుడు ప్రశ్నించేడు.

బింబ ప్రతిబింబవాదము, అవిచ్ఛిన్నవాదము అని రెండు వాదములున్నవి. ఈ రెండును పరమాత్మకును మనకును భేదము లేదని నిరూపించును.ఈ రెండు వాదాలను బుద్ధియందుంచుకొనియే ఆ మాలవాడు ఆచార్యులవారితో తర్కానికి దిగేడు.

సూర్యుడు పవిత్రమమైన గంగయందుప్రకాశించినట్లే చండాలవాటికయందున్ను ప్రకాశిస్తున్నాడు. రెండు ప్రకాశాలకు తేడా ఉన్నదా! బంగారుబిందె, మట్టికడవ రెండింటిలోనూ ఆకాశం ఉన్నది, ఈ రెండు ఆకాశాలకు భేదం ఉన్నదా! లేదే!

అలాగే సర్వశరీరాలలోనూ ఒకే ఒకవస్తువు భాసిస్తోంది. ఆ వస్తువు ఆనందమయమైనది. అది పూర్ణమైనది. సముద్రమును పోలినది. వాస్తవానికి ఆ పరిపూర్ణవస్తువును సముద్రముతో పోల్చడం తగదు. ఏమంటే సముద్రం లేని చోటు చాలా ఉన్నది? కాని ఈ వస్తువు లేనిచోటు లేదు. మన ఎరికలో సముద్రాన్ని మించి పూర్ణమైన వస్తువు లేదు కనుక దానితో పోలుస్తున్నాము. ఆ మాలవాడు పేర్కొన్న వస్తువు ఆనందసముద్రము, ఙ్ఞాన సముద్రము అయినది. నిరవధికమైన ప్రేమతో, నిరవధికమైన చైతన్యముతో నిండినది, సముద్రము నందు తరంగాలు ఉన్నాయి. కాని ఆనందసముద్రము నిస్తరంగము, అందులో అలలు లేవు కారణం ఏమంటే - లోకంలోని సముద్రం విషయంలో దానికంటే భిన్నమైన దేశం ఉన్నది, అందుచే అందు అలలు పుట్టడానికి అవకాశం ఉంది. కాని యీ ఆనందమయ వస్తువు లేనిచోటులేదు. దీనికి వెలితిలేదు. ఇది అంతటా నిండి ఉన్నది. అందుచే ఇచ్చట అలలుపుట్టే అవకాశమే లేదు. ఇట్టి వస్తువులో వ్యత్యాసం ఏమిటి? అని మాలవాడు ఆచార్యులవారిని ప్రశ్నించేడు.

ఈ ప్రశ్నకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సమాధానం చెప్పాలి అని మనం భావిస్తాం. కాని ప్రశ్న ఙ్ఞానవిధానంలో వేయబడింది. అందుచే ఆచార్యులవారు కూడా జ్ఞానవిధానంలోనే సమాధానం చెప్పేరు.

ఆచార్యులవారు అన్నారు కదా!- 'తాము ఇట్టివారా! బ్రాహ్మణుడైనా సరే చండాలుడైనా సరే అతడు బ్రహ్మవేత్త అయితే నాకు గురువే'- అన్నారు. మనంకూడా ఇటువంటి వారికి నమస్కరించడానికి సిద్దంగా ఉండాలి. అట్టి జ్ఞానస్థితిలో చండాలుడు చండాలుడుకాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు, అని వేదం ఉద్ఘాటిస్తోంది. ఈ విషయాన్నే శ్రీ శంకరులు 'మనీషాపంచకం' అనే ఐదు శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థిరతరా యా సంవిదుజ్జృంభతే|
యాబ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షీణీ||

- మనీషా పంచకం.

'జాగ్రత్స్వప్న సుషుప్తులలో ఏ చైతన్యం మిక్కిలి స్ఫుటంగా ప్రకాశిస్తూ ఉన్నదో, ఏది చీమ మొదలు బ్రహ్మ వరకూగల సర్వశరీరాలలోనూ సాక్షిగా నెలకొని ఉన్నదో ఆ చైతన్యమే నేను కాని, ఈ దృశ్యమైన జడవస్తువు నేను కాను, అనే జ్ఞానం ఎవనియందు సుధృడమై భాసిస్తుందో వాడు చండాలుడైనాసరే ద్విజుడైనా సరే నాకు గురువు' - అనునదే పైశ్లోకం యొక్క తాత్పర్యం.

ఆ మాలవాడెవరు? కాశీనాథుడు విశ్వేశ్వరుడే. ఆచార్యులను పరిశోధించడానికి అలా వచ్చేరు. ఈ ఆచార్యుడు జ్ఞాన ప్రచారం చేస్తున్నాడే కాని తాను బోధించే విషయంలో అనుభవం ఉండి చెపుతున్నాడా లేక నోటిమాటగా చెపుతున్నాడా? పరిశీలిద్దామనే ఊహతో, ఆచార్యుల మహిమను వెల్లడించి లోకానికి శ్రేయం చేకూర్చాలన్న తలంపుతో అలా చేసేరు. తమ గొప్ప తామే చెప్పుకోకూడదు. అలా చెప్పుకొనడం లోపమే అవుతుంది. ఇతరులు చెప్పుకొంటే అది కీర్తి అవుతుంది. మహత్త్యం వెల్లడి అవుతుంది. అందుకే ఆచార్యుల మహిమను వెల్లడించే తలంపుతో కాశీవిశ్వనాథుడు కుహనాచండాల వేషం ధరించేడు.

ఇక్కడ ఆచార్యులవారు చెప్పిన శ్లోకభావాలను కొంత పరిశీలిద్దాం. ప్రపంచంలోని సమస్త ప్రాణులను ఆత్మభావంతో చూడడం ఏ విధంగా సాధ్యం? భేదజ్ఞానం ఎందుకు కలుగుతూ ఉన్నది? అభేదజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అన్న విషయాలు వారు ఆ శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్‌-స్వప్న-సుషుప్తులు అనే అవస్థల భేదాలను బట్టి క్రియాభేదం ఏర్పడినా ఆ మూడవస్థలను గమనించేవాడు ఒక్కడే అయినట్లు-లోకంలోని వేర్వేరుదేహాలు వేర్వేరుమనస్సులు కారణంగా వేర్వేరు కార్యాలు ఆచరింపబడుతూ ఉన్నట్లు తోచినప్పటికి-ఈ అన్ని చోటులందు ఒకే ఒక్క తత్త్వం ఒకేనేను అన్న వస్తువు భాసిస్తోందని గ్రహించాలి. జగత్తును అంతను ఈ విధంగా ఆత్మదృష్టితో పరికించగలగాలి, అప్పుడు జగత్తు అంతా ఒక్క నేనుగా అనుభవానికి వచ్చి-అంతా నేనే, అంతటా నేనే, నాకంటే వేరేమీ లేదు అన్న జ్ఞానం భాసిస్తుంది. ఇట్టి మహోన్నతజ్ఞానం కలవాడు చండాలుడైనా పండితుడే. చండాలుని దూరము తొలగుము తొలగుమని తరిమిన వారును, అనంతర మాతని జ్ఞానవైభవమును గాంచి ప్రణమిల్లిన వారును ఆచార్యులే.

మొదట మిమ్ము గుర్తించలేదు, మీరట్టి బ్రహ్మవిదులైనచో మీరే ఆచార్యులు, మీకు నమస్కారములు అని ఆచార్యులు చండాలునికి నమస్కరించేరు.

ఇలా జ్ఞానపథంలో ఆచార్యుల ఘనతకు చాటడానికై చండాలరూపంలో వచ్చి విశ్వేశ్వరుడు అడిగిన ప్రశ్నలకూ, తత్కాలంలో ఆచరణలో ఉన్న లోకవ్యవహారానికి సంబంధం ఏమీ లేదు. ఆచార్యులు అన్నిచోట్లా శాస్త్రరీత్యా ధర్మ కర్మానుష్ఠానపాలనం జరుగవలెననియే బోధించేరు అనుష్ఠానాలను వారు మర్చలేదు. కర్మానుష్ఠానాన్ని వారు ఒక్కనాడు కూడా విడిచిపెట్టలేదు. లోకానికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికై వారు అవతరించేరు. శాస్త్రవిధి, ధర్మానుష్ఠానం జ్ఞానానికి సాధనాలు అనియే వారు ఉపదేశించేరు.

ఏదో ఒక పని చేసి కారణంగా ఒకడు అధికుడు, మరియొక రకమైన పనిచేస్తున్నాడు కనుక వాడెవడో అధముడు అనే భావం అర్హమైనది కాదు. ఆలోచిస్తే అందరూ సమిష్టిగా ఒకే కార్యాన్ని గూర్చి పాటుపడుతున్నారు. సంఘశ్రేయంతో కలిసిన ఆత్మాభ్యున్నతియే ఆ కార్యం, ఆ కార్యసాధనకు తగిన అనుష్ఠానాలకు క్రొత్తగా సృష్టించడంకంటే పరంపరాగతములైన అనుష్ఠానపాలనమే మేలైనది, శ్రేయోదాయకమైనది.

మన ఆచారాలు అనాదిగా ఏర్పడి ఉన్నాయి. పరదేశాలవారి ఆచారాలు మధ్యకాలంలో రూపొందేయి. వారిని చూచి మనం మన ఆచారాలను మార్చుకొనడంవల్ల సామాజిక జీవనంలో ఎన్నోక్లేశాలు తలయెత్తుతాయి. మనకు నచ్చిన పనులన్నీ చేయనారంభిస్తే మనం సాధించేది ఏమీ ఉండదు. కంచెలోని ఏకొంతభాగాన్ని తొలగించినా క్రమంగా కంచె పూర్తిగా నశించే సావకాశం ఉన్నది. ఒక నియమాన్ని మనం యీనాడు ఉల్లంఘిస్తే క్రమంగా నియమోల్లంఘన మే మనస్వభావం అయి కూర్చుంటుంది.

భారతీయులమైన మనలో ఎన్నో తెగలు ఉన్నాయి అంటారు. అవును సాంఘికశ్రేయంతోబాటు ఆత్మాభ్యున్నతిని సాధించాడానికి ఈ వర్ణాశ్రమాలు, ఈ ధర్మాలు ఉండాలి, భోజ్యాభోజ్యాలు, దృశ్యాదృశ్యాలు మొదలైన నియమాలుకూడా తప్పనివే. ఈ కట్టుబాట్లు అందరకు సుఖాన్ని ప్రసాదిస్తాయి.

విధినిషేధాలు అందరకూ ఉన్నాయి. అవి ఆత్మ శ్రేయాన్నేకాక సామాజిక శ్రేయాన్నిసైతం ప్రసాదిస్తాయి. ఈ నియమాల అర్థాలు ప్రయోజనాలు ఇప్పుడు తెలియక పోయినా కాలాంతరంలో వానివలన ప్రయోజనం తెలిసి వస్తుంది. అందరూ ఆచారాలను విడిచిపెడితే అవి అంతరిస్తాయి. ఎవరో పదిమంది ఆచారవంతులై ఉంటే చాలదా? అంటే అందరూ యత్నించినపుడే పదిమందియైనా ఆచారసంపన్నులుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుచే ప్రతి ఒక్కడూ తన ఆచారాన్ని తాను రక్షించుకొంటూ ఇతరుల ధర్మాలను కూడా రక్షించడానికి యత్నించాలి.

ఆయా వర్ణాశ్రమాలవారు ఆయా వర్ణాశ్రమాచారాలను చక్కగా పాలించడంవల్ల వారివారి శ్రేయస్సులతో సామాజిక శ్రేయంకూడా ఫలిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగినమీదట ఆచారానుష్ఠానాలు తామంతతామే తొలగిపోతాయి. జ్ఞానదశలో కట్టుబాట్లు ఏమీ ఉండవని మనుస్మృతి చెపుతోంది. అది జ్ఞానకాండకు చెందిన మాట.

ఆ మనుస్మృతియే కర్మకాండలో కర్మాచరణావశ్యకతను వివరించింది. ఆ స్మృతిగ్రంథంలో మనకు నచ్చిన విషయాలను అంగీకరించి, మనకు నచ్చని వానిని గూర్చి ఇవి ఎవరో మధ్య కాలంలో వ్రాసి యిందులో చేర్చేరు అనడం యుక్తమా! మనం ఎదుర్కొనజాలని అధర్మం లోకంలో ఆవిర్భవిస్తే ఆ అధర్మం అధర్మం కాదు, ధరమ్మే అని చెప్పడం తప్పు. మనం మన ధర్మాలను సాధ్యమైనంతవరకు రక్షించుకొనాలి. మానసికంగా చేసినప్పటికీ ధర్మం ధర్మమే, అధర్మము అధర్మమే అని నిశ్చయించుకొనాలి. అంటే మనస్సులోకూడ అధర్మాన్ని ఆచరించరాదు. ధర్మాచరణవిషయంలో యీ నిశ్చయబుద్ధి ఉంటే క్రమంగా అది మనచే సుష్ఠుగా పాలించబడుతుంది. ఆచార్యులవారి ఆదేశంకూడా ఇదే.

వ్యాసులవారు చెప్పినట్లు శంకరులు ముమ్మారు దిగ్విజయం చేసేరు. మూడు సార్లు భారతదేశంలో ప్రదక్షిణ క్రమంగా పర్యటించేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/7.html
 

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.