Tuesday, 29 August 2017

శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి (1-5)




శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి (1-5)
(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో)

శ్రీ మహాగణాధిపతయే నమః

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।
అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1॥


అమ్మా! శివుడు శక్తితో (నీతో) కూడినప్పుడు జగన్నిర్మాణము చేయగలుగుతున్నాడు. కానిచో స్పందించుటకు కూడా అసమర్థుడు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల చేత ఆరాధించబడు నీకు, పుణ్యసంపదలేనివాడు నమస్కరించుట, స్తుతించుట ఎలా చేయగలడు ?

ఈ సృష్టిలోని ప్రతీ కదలికకూ అమ్మవారి శక్తి కారణమనీ, ఆమెకు నమస్కరించాలన్నా, స్తుతిచేయాలన్నా అమ్మ అనుగ్రహం ఉండాలనీ, ఆ అనుగ్రహం గతజన్మలపుణ్యఫలమనీ శంకరులు అంటున్నారు.

ఈ ప్రపంచమునకు పరమేశ్వరుని స్పందన ద్వారా కారణమవుతున్నది అమ్మవారు. జీవుడు ఈ మాయా ప్రపంచమునుండి విడివడి శివైక్యం చెందుటకుకూడా అమ్మవారే కారకురాలు. అట్టి శివైక్యం చెందుటకు అమ్మ కటాక్షంకోసం ప్రార్థించాలి. ఇది శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా మనకు చేసిన ఉపదేశం.



తనీయాంసం పాంసుం తవ చరణపఙ్కేరుహభవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ ॥ 2॥

అమ్మా! నీ పాదపద్మమునుండి అతి చిన్న ధూళికణమును సేకరించి బ్రహ్మదేవుడు ఈ లోకాలను సుందరముగా నిర్మించుచున్నాడు. విష్ణువు దానినే తన వేయితలలతో ఎలాగో (శ్రమతో) మ్రోయుచున్నాడు. హరుడు దానిని చక్కగా మెదిపి భస్మధారణ చేయుచున్నాడు.

పై శ్లోకముతో కలిపి చదివినప్పుడు - త్రిమూర్తులు అమ్మవారిని ఆరాధించి, తత్ఫలముగా అమ్మవారి కరుణతో సృష్టి, స్థితి, లయములను  నిర్వహించ సమర్థులవుతున్నారని శంకరులు అంటున్నారు.
---------
అమ్మవారి పవిత్రపాదధూళి మనకు అమ్మవారి అనుగ్రహాన్ని ఎన్నోవిధాలుగా ప్రసాదిస్తుందని శంకరులు అంటున్నారు.

అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరన్దస్రుతిఝరీ ।
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ॥ 3॥

(పాఠాంతరాలు - 1. మిహిరద్వీపనగరీ - మిహిరోద్దీపనగరీ, 2. స్రుతిఝరీ - శృతిఝరీ, 3. భవతి - భవతీ)

సూర్యుడు చీకట్లు తొలగించి వెలుగునిచ్చినట్లు, అమ్మవారి పాదధూళి అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానప్రకాశమును ఇచ్చునట్టిది. మందమతుల మోడువారిన బుద్ధులను సారవంతంచేయునట్టి చైతన్యమనే పూలగుత్తులనుండి వచ్చు తేనె ప్రవాహము. దరిద్రులకు సకలసంపదలను ఇచ్చునట్టి చింతామణుల మాల. (హిరణ్యాక్షునిచేత సముద్రములో దాచబడిన భూమిని వెలికితీసినట్టుల) సంసారసాగరమున మునిగియున్నవారలను ఉద్ధరించునట్టి ఆదివరాహరూపములోని శ్రీ మహావిష్ణుని కోఱ.

లౌకికులకు ప్రజ్ఞ, సంపదలనూ, సాధకులకు జ్ఞానమోక్షములనూ అమ్మవారు అనుగ్రహిస్తుందని శంకరులు అంటున్నారు.
---------
అమ్మవారి పవిత్ర పాదపద్మములను శంకరులు స్తుతించుచున్నారు.

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥


సమస్తలోకములకూ దిక్కైన ఓ తల్లీ! నీకన్నా ఇతరులైన దేవతలు తమ తమ చేతులతో అభయ, వరదముద్రలు ధరించి యున్నారు, నీవు మాత్రము వరద, అభయ ముద్రలు ప్రకటించుట లేదు. ఎందువల్లననగా భయమునుండి రక్షించుటకు, కోరినదానికన్నను ఎక్కువగా ఫలములనిచ్చుటకు నీ పాదములే సమర్థములైనవి.

'వాంఛాసమధికం' అంటే మనము కోరిన దానికన్నా అమ్మవారు ఎక్కువ ఫలమును, వరములను ఇచ్చునని, అనగా మోక్షమునుగూడ యిచ్చునని భావము.
---------
హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥


అమ్మా!  భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం స్త్రీ గా మారి త్రిపురాసురసంహారి అగు పరమేశ్వరునే కలతనొందించినాడు.  మన్మధుడునూ నీకు నమస్కరించి రతీదేవి కన్నులకుమాత్రము అగపడు శరీరముతో మునులను సైతము మహామోహావేశులుగా చేయుచున్నాడు.

జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను సైతము కామముతో కలతనొందింపచేసిన శక్తిగలదిగా అమ్మవారు స్తుతించబడుతున్నది. మనకు ’కామమునకు వశమవడము’ అనేది కూడా అనుగ్రహమా ? అనే సందేహము కలుగవచ్చు.
భగవంతుడు మనపై కరుణకురిపించాలన్నా, మనము భగవంతుడికి శరణాగతి చేయాలన్నా, పుట్టుక, కష్టాలు అనేవి ఉండాలి. 


బాధలూ, కష్టాలూ లేనప్పుడు మనం భగవంతుని స్మరిస్తామా ? (స్మరించము కదా) కష్టాలు ఎలా కలుగుతాయి ? కామక్రోధాలు మనలను పట్టి పీడించినప్పుడు. ఆ యాతన అనుభవించునప్పుడు మనం భగవంతుడిని స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఇలాంటప్పుడు, కామక్రోధాలు, ఈ జగత్సృష్టి అన్నీ అనుగ్రహమే అని గుర్తిస్తాము.


మరో జన్మలేకుండా ఉండాలని బాధపడటం మంచిదే. కానీ ఇంకా అనుభవించవలసిన కర్మ గుట్టలు గుట్టలుగా మిగిలి ఉన్నవాళ్ళు జన్మ వద్దనవచ్చునా ? ఆ కర్మ అనుభవించటానికి జన్మనెత్తవలసిందే, ధార్మికజీవనం గడపవలసిందే. కామమే లేకపోతే మనుష్యులు పుట్టి తమ కర్మభారం తగ్గించుకోవడమెలా ? మరలా జన్మనెత్తి, కర్మలను నాశనంచేసుకోవడం అనే అవకాశాన్ని వినియోగించుకోకుండా మరింత పాపం మూటగట్టుకుంటే అది ఎవరి తప్పు ? పుట్టుక అనునది మరుజన్మ లేకుండా చేసుకోవటానికి ఒక అవకాశం. ఈ నిజాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి.


మరి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను కలతనొందించటం ఎందుకు ?  దానికి మనం అమ్మవారిని ఎందుకు స్తుతిస్తున్నాము ? వారు కలతనొందటముతో కథముగియలేదు. వారు మరలా పరిశుద్ధులయ్యారు. వారు ఒకానొక సమయములో కామమునకు వశపడినారంటే అది జగత్కళ్యాణము కొరకు. ’హరి, హరుల పుత్రునితో మాత్రమే మరణము’ అనే వరమున్న రాక్షసుని చంపుటకు అయ్యప్ప అవతరించాడు. వ్యాసులవారు ఘృతాచికి ఆకర్షింపబడకపోతే నైష్టిక బ్రహ్మచారి అయిన శుకమహర్షి ఉండేవారుకాదు.


నాణెమునకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఋషులను సైతం కామమోహితులుగా చేయగల శక్తి మన్మథుడికి అమ్మవారు ఇవ్వటము, నాణెమునకు ఒకవైపు. కొంతమందివైపు మన్మథుడిని వెళ్ళకుండా చేయటం నాణెమునకు రెండవవైపు. మన్మథుడు అమ్మవారికి సేవకుడు.  మనంతటమనం కామమును జయించలేము. అమ్మవారి ఆజ్ఞతోనే అది సాధ్యమవుతుంది. మన్మథుని మనకు దూరంగా ఆమె ఉంచగలదు. 


శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా అమ్మవారి అనుగ్రహంతో మనం కామమును జయించగలమని ఉపదేశిస్తున్నారు.


http://jagadguru-vaibhavam.blogspot.in/2017/08/1-5.html

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.