Saturday 26 August 2017

పరమాచార్యుల అమృతవాణి : కామాక్షి చరణ ప్రభావము




పరమాచార్యుల అమృతవాణి :  కామాక్షి చరణ ప్రభావము
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

మన భారతదేశము పరమ పవిత్రమైన దేశము, ఇది కర్మభూమి ఇతర దేశములన్నీ భోగ భూములు. శాస్త్రముల ప్రకారము ఇది అన్వర్థము, అనుభవములో కూడా ఒక్క భారతదేశములో మాత్రమే ఈనాటికి కూడా వైదిక కర్మానుష్టానము జరుగుచున్నది. ఇక్కడ ఏడు ముక్తి ప్రదములైన క్షేత్రము లున్నట్లు సంప్రదాయముగా చెప్పుకుంటున్నారు.

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా,
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః


కాంచీ అంటే మధ్యభాగము, లేక ఓఢ్యాణము, అని అర్థము, స్త్రీలు ఓఢ్యాణమును (వడ్డాణమును) శరీర మధ్యభాగములోనే ధరిస్తారుగదా! కాంచీదేనికి మధ్య భాగము? ఒకప్పుడు మన వైదికమతము సింహళము, ఇండోనేషియా మొదలైన అనేక దేశములలో వ్యాపించి ఉండేది. విశాలమైన వైదిక మతావలంబులు నివసించే భూభాగానికి ఆనాడు కాంచీనగరము మధ్యభాగమున ఉండేది. కాంచీ వంటి నగరము మరొకటి లేదు. ఆ ఊరిలో 108 శివాలయములున్నవి. ఇవిగాక విశిష్ణ్వాలయములు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలు ఉన్నవి. ప్రతివీధిలోను ఒక దేవాలయ మున్నది. గుడిలేని వీధిలేదు. ప్రతిరోజు ఏదో ఒక దేవాలయములో ఉత్సవము జరుగుతూనే ఉంటుంది. అట్టి కాంచీపుర మధ్య భాగములో కామాక్షీ దేవి ఆలయమున్నది.

ఏ గుడిలో ఏ ఉత్సవము జరిగినా వరద రాజస్వామి రథోత్సవము, ఏకామ్రనాథ స్వామి రథో త్సవము జరిగినా, ఆ ఉత్సవము వచ్చి కామాక్షీదేవి ఆలయ ప్రదక్షిణము చేసి వెళ్లవలసినదే. ఒకప్పుడు స్వదేవాలయ ప్రదక్షిణము మానివేసి కూడా కామాక్షీ దేవి ప్రదక్షిణము చేస్తారు. రథోత్సవములో, తంత్రశాస్త్రవేత్తల పరిభాషలలో కాంచీనగరము అమ్మవారి ఉద్యానపీఠస్థానము. సామాన్యముగా అన్ని గుడులలోను అమ్మవారికి నాలుగు చేతులు, ఆ చేతులలో 1. వరదముద్ర, 2.అభయముద్ర, 3. పాశము, 4. అంకుశము ఉంటవి. పాశము అనే ఆయుధము మనలో ఆశాపాశములను తొలగించి, మనసుకున్న చంచలత్వము పోగొట్టుతుంది. అంకుశము - మన అహంకారమును నశింపచేస్తుంది. అభయముద్ర కష్టములలోనున్న వారికి భీతిలేకుండా చేయగా, వరదముద్ర కోరిన వరముల నిస్తుంది. కొన్ని గ్రామములలో అమ్మవారికి రెండు చేతులే ఉండి, వరదాభయముద్ర లుండును. కామాక్షీ దేవి కూడా చతుర్భుజయే, 1. కుడివైపు క్రిందిచేతులో పంచ (పుష్ప) బాణములు, 2. కుడివైపుపై చేతిలో పాశము. 3. ఎడమవైపు క్రిందిచేతిలో ధనుస్సు, 4. ఎడమ వైపు పైచేతిలో అంకుశము ఉన్నవి. వరదాభయ ముద్రలు లేవు. కామాక్షి అమ్మవారికి వరదాభయముద్రలు లేకుండుట చూచి శంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు.

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ


అమ్మా! నీకన్నా ఇతరులైన దేవతలు అభయ, వరదముద్రలు ధరించి యున్నారు, నీవు మాత్రము వరధాభయము ముద్రలు ప్రకటించుట లేదు. ఎందువల్లననగా భయమునుండి రక్షించుటకు, వరముల నిచ్చుటకు నీపాదములే సమర్థములైనవి.

''వాంఛా'' ''సమధికం'' అంటే మనము కోరిన దానికన్నా అమ్మవారు ఎక్కువ ఫలమును, వరములను ఇచ్చునని భావము, అనగా మోక్షమునుగూడ యిచ్చునని భావము, అమ్మవారి చతుర్భుజములలోని ఆయుధములను లలితా సహస్రనామములో వివరించి చెప్పారు. అమ్మవారి మూర్తిలో ఒక్కొక్క భాగమును ధ్యానముచేస్తే, ఒక్కొక్క సిద్ధివస్తుంది. పంచబాణములను ధ్యానముచేస్తే ఆశాపాశము విడి పోతుంది. దేవతామూర్తుల విగ్రహములలో, వాహనములలో, ఆయుధములో, ముద్రలలో తంత్రశాస్త్ర సంకేతము లిమిడి ఉన్నవి. మిగిలిన క్షేత్రములు రామకృష్ణాదుల వలన పవిత్రము లైనవి. కాంచీనగరము అమ్మవారి చరణములవలన మోక్ష క్షేత్రమైనది.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.