Saturday, 23 April 2016

పరమాచార్యుల అమృతవాణి : చిత్తశుద్ధికి సాధనాలు



పరమాచార్యుల అమృతవాణి : చిత్తశుద్ధికి సాధనాలు

ధ్యానం చేయవలెనని మనం కూచుంటాం, కానీ ఏకాగ్రత సులభంగా రాదు. దీనికి కారణమేమి? మనశ్చాంచల్యమే. మనస్సు లెక్కలేనన్ని విషయాలను గూర్చి ఆలోచిస్తూ వుంటుంది. అన్ని కష్టాలకు కారణము మనస్సే. ''మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః'' మనకున్న లెక్కలేని కోరికలు మనస్సుకు స్థిరతను ఇవ్వడంలేదు. ఆశలను అన్నిటినీ వదలిపెట్టు అని మనస్సుకు మనం దృఢంగా చెప్పలేకున్నాం.

ఒక ప్రత్యేకమైన విషయం గూర్చి ధ్యానించు అని మనం మనస్సుకు చెబితే అది కొన్ని క్షణాలు దానిని గూర్చి ధ్యానించి వెంటనే వేరు విషయాలపై వ్యగ్రమౌతుంది. ధ్యానాన్ని గూర్చి, శాంతిని గూర్చి నేను ఉపన్యాసం చేస్తున్నపుడు కొన్ని క్షణాలు మీ మనస్సు ధ్యానలగ్నమై శాంతిని చవిచూచినా వెంటనే మళ్ళా తన పాత వాసనల ప్రకారం ఇతర విషయాలపైకి వెళ్ళిపోతుంది. ఆ క్షణంసేపు మీరు అనుభవించిన ఆనందం అట్లే అందకుండా జారిపోతుంది.

మనం చెప్పినట్లు మనస్సు వింటేనే, మనకు మనస్సు స్వాధీనమైనదని చెప్పగలం. పిచ్చివారికి చిత్త స్వాధీనంలేదని అంటాం. కానీ మనంకూడ ఒక విధంగా పిచ్చివాళ్ళమే. వాళ్ళకెంత అస్వాధీనమో, మనచిత్తాలూ అంత అవశములుగానే వున్నాయి. చిత్తస్వాధీనమున్న వారు ఎట్టి కష్టం వచ్చినా, ఎట్టి భయానక సందర్భము ఏర్పడినా, ఎంత దుఃఖం సంభవించినా, మనస్సులో అలజడి లేక శాంతంగా ఉండగలరు. వారిని కామక్రోధాలు కలవరపెట్టవు. ఏ స్థితిలోనూ వారు కోపావేశానికి గురికాకుండా, అనుద్విగ్నులై నిర్లిప్తులుగా వుంటారు. మనస్సు తైలధారవలె, అఖండంగా ఒక స్థాయీ భావానికి వచ్చినపుడే మనస్సు ధ్యానమగ్నమైనదని చెప్పగలం.

ఇట్లు చిత్తవృత్తులు నిరోధించి మనస్సును ఏకాగ్రతం చేయడాన్నే యోగమని అంటారు. జీవితంలో కామక్రోధాలు సంభవించే సన్నివేశాలు ఎన్నో వుంటాయి. వీనినుంచి తప్పించుకోడానికి యోగం అవసరం. ఆ యోగం ఎప్పుడో చేస్తామని అనుకోకూడదు. ఆ యోగభ్యాసం ఈ జన్మలోనే జరగాలి. అట్లా యోగాభ్యాస తత్పరుడై, మనస్సును స్వాధీనం చేసుకొన్నవానిని గీత యుక్తుడని అంటుంది.

యోగాభ్యాసం ఎవరో ఋషులూ, యోగులూ చేయవలసిన కార్యమేకాని మనబోటి వారికి కాదు అన్న భావానికి మనం ఎన్నడూ చోటు ఇవ్వరాదు. వ్యాధిగ్రస్తునికే కదా ఔషధం యొక్క అవసరం. చిత్త చాంచల్యంతో, యెడతెగని కోరికలతో బాధపడుతున్న మనకే కదా యోగం ఉపయుక్తంగా వుంటుంది. అందుచేత ప్రతి ఒక్కరూ తమకున్న కాలంలో కొంతసేపయినా చిత్తవృత్తి నిరోధకమైన యోగాన్ని అభ్యసించడానికి పూనుకోవాలి.

మనో నిరోధానికి రెండు సాధనలున్నవి. ఒకటి అంతరంగం. రెండవది బహిరంగం. ఈ రెండూ అవసరమే. యజ్ఞయాగాదులు, సంధ్యోపాసన, దేవతార్చన, పరోపకారము, దానధర్మములు చేయుట, బహిరంగసాధనలు. అహింస, సత్యము, ఆస్తేయము, శౌచము, ఇంద్రియనిగ్రహము అంతరంగసాధనలకు ఉపాంగములు.

ఏ వ్యక్తిగానీ, ఏ జీవికిగానీ కీడుచేయక భూతదయతో మనస్సు ప్రేమ ప్రపూర్ణంగా చేసుకోవటమే అహింస. మనోవాక్కాయ కర్మలతో యదార్ధచింతన, కధన, ఆచరణలే సత్యము. అస్తేయమనగా దొంగతనం చేయకుండుట. పరద్రవ్యాపహరణ చేయకుండా వైరాగ్య నిరతితో ఉండుట. ఆహారశుద్ధి, దేహశుద్ధి, మలాపకర్షక స్నానాదులు శౌచము. ఇంద్రియాలను ఇచ్చ వచ్చిన రీతి మెలగనీయక నియమ వ్యాపార బద్ధములుగా చేయుట ఇంద్రియ నిగ్రహం. ఈ ఐదున్నూ సామాన్య ధర్మములు. వీని ననుష్టించవలెనని మనుధర్మశాస్త్రం చెబుతుంది.

1. అహింస

మనోజయమే యోగం. అహింస దానికొక అంగం. ధర్మశాస్త్రాలలో అది సామాన్య ధర్మంగా చెప్పబడింది. యోగశాస్త్రంలో అదొక అంగం. అహింస ముఖ్యోద్దేశం చిత్తవృత్తి నిరోధం. ఇది ముఖ్య ప్రయోజనం. దీనితోబాటు దీనికొక అవాంతర ప్రయోజనంకూడా వుంది. అది వైరత్యాగం. యోగ సూత్రాలు 'అహిస ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైర త్యాగః' అని చెబుతున్నవి. అహింస సాధించిన వారి సమక్షంలో పరస్పరం వైరమున్నవారు సఖ్యభావాన్ని భజిస్తారట. అహింసావ్రతం పాటించే మహాత్ముని ముందు ఘాతకులు చెష్టతక్కి నిల్చిపోతారు. సన్యాసులు అహింసను పాటించాలి. అది వారి ప్రతిజ్ఞ. వారి వలన ఏ ప్రాణికీ భయముండరాదు. వేదోక్త కర్మలను తప్పించి ఇతర కర్మలలో హింస ఉండరాదు. అందుకే సన్యాసి వంట చేయరాదు. ఆకు గిల్లరాదు.

2. సత్యం

అహింస తర్వాత సామాన్య ధర్మం సత్యం. ''వాఙ్మనసయోరైక రూపం సత్యం''. - అని సత్య లక్షణం. మనస్సులో ఉన్నది ఉన్నట్లు చెప్పుటే వాక్ప్రయోజనం. మనం ఊరి వారి తప్పులన్నీ ఉగ్గడిస్తూ వుంటాం. మనం చెప్పేది నిజం కావచ్చు. వాఙ్మనస్సులకు ఏకత్వమూ ఉండవచ్చు. కాని అవి సత్యభాషణలుకావు. 'సత్యం భూతహితం ప్రియం' అన్నారు. మనం చెప్పేదానిలో భూతహితమూ, ప్రియమూ వున్నదా అని చూడాలి. సత్యం సర్వ జీవక్షేమకరంగా వుండాలి. కామక్రోధవశంగా వాగ్రూపంగా బయటకు వచ్చేది సత్యమనిపించుకోదు. సత్యం ఇతరులకు తాపకారణంగా వుండరాదు.

సత్యభాషణకు ముఖ్య ప్రయోజనం చిత్తనిరోధం. దాని అవాంతర ప్రయోజనం వాక్శుద్ధి. సత్యవ్రతుని వాక్కు రిత్తకాదు. అతడేమి చెప్పినా అది ఫలించవలసినదే. వారి హక్కులు శాపానుగ్రహదక్షములు. ''సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్‌''. సత్యము నెలకొనగా, కర్మాచరణచే కలుగు ఫలము, యోగి మాట వలనే కలుగుచున్నది. అట్టి యోగి వాక్కులు అమోఘములు. ఐతే ఈలాంటి అవాంతరప్రయోజనాన్ని ఉద్దేశించి మనం సత్యవ్రతం అనుష్ఠించరాదు. సత్మం సత్యాన్వేషణ కోసమే చేయాలి.

3. మానవ సేవయే మాధవ సేవ

అన్ని భాగ్యాలలోనూ పరమ భాగ్యమేదంటే మానవసేవయే. మనకు తెలియకుండానే మన కుటుంబానికి ఎన్నో రకముల సేవ చేస్తున్నాం. ఈ సేవ వారి వారి కుటుంబములకే పరిమితం కాక, ఇతరులకూ దేశానికీ కూడ మనమందరమూ చేయవలెనని నేను చెబుతున్నాను.

మనకు ఎన్నో శ్రమలు జీవితంలో వున్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబానికి ఆహార వస్త్ర సదుపాయాలు చేయటం, వెలలు తెగపెరిగిన ఈ కాలంలో ఎంతో కష్టంగా వున్నది. ఇట్లున్నపుడు ఇవి చాలవన్నట్లు సమూహసేవ ఎక్కడ చేయగలమని మనం అనుకోరాదు. ఒక విధంగా చూస్తే, ఈ సామాజిక సేవ మన కుటుంబాలలోని కష్టాలను తాత్కాలికంగానైనా మఱచి పోవడానికి మందువలె వుంటుంది. పరోపకార పుణ్యఫలంగా భదగవదనుగ్రహం నిశ్చయంగా వుంటుంది. పరోపకారం చేయటం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దాని వలన అత్మతుష్టి, సంతోషమూ కూడా కలుగుతుంది.

ఒక్క మానవులకే కాదు. నోరులేని మృగాలకు మన చేతనయినంత సాయంచేయాలి. పూర్వకాలంలో ఇష్టాపుర్తాలు చేయడమేకాక, పశువులకు దురద తీరడానికి గరకుగా వున్న రాతిస్తంభాలను అక్కడక్కడా నాటేవారు. పశువులకు ఒక పిడికెడు కసవైనా మనం వేయాలి. దీనినే గోగ్రాసమని శాస్త్రాలు చెబుతున్నవి. గ్రాసమంటే, నోరునిండే పదార్ధం. ఃుషషఠౌష అని అర్ధం. యజ్ఞయాగాదులు తర్పణశ్రాద్ధములు, ఇతర లోకాలలో వున్నవారిని ఉద్దేశించి చేయబడుతున్నవి. ఇవి మంత్రపూర్వకంగా చేయబడే సేవలు.

ఈ సమాజ సేవకు సంఘాలు ఏర్పాటుచేసుకోవాలి. సభ్యులకు ఏకాభిప్రాయం వుండాలి. వీరిలో పరస్పరం ఒద్దిక వుండాలి. ధృతీ, ధైర్యమూ, తుల్యనిందాస్తుతి స్వార్ధరాహిత్యం మొదలైన గుణాలు వుంటే ఈ సమాజసేవ బహుజన హితంగానూ పటిష్ఠంగానూ జరుగుతుంది.

ఈ సమాజసేవ ఉల్లండా మనఃక్లేశమూ దేహక్లేశమూ లేకుండా చేయాలి. కృష్ణ పరమాత్మను చూడండి. ఆయన గోవర్ధనోద్ధరణ చేసింది గోపబాలురను రక్షించడానికి. చిన్నతనంలోనే కాళియమర్ధనం చేశాడు. చూడటానికి క్రీడవలె కనబడినా అది ఆయన విషసర్పంతో చేసిన పోరాటమే. ఇదీ పరోపకార్యార్ధమే. కృష్ణలీలలన్నిటిలోనూ ఆయన పరోపకార పారీణత, కరుణా పెనవేసుకొని వుంటాయి. లౌకిక సేవ ఒక్కటే కాదు. ఆయన అర్జునుడు, ఉద్ధవుడు మొదలైన వారికి జ్ఞానబోధ కూడా చేశాడు. ఇన్ని కార్యాలు చేసినప్పటికీ ఆయన నిర్లిప్తంగా తామరాకుపై వున్న నీటి బిందువువలె అనాయాసంగా ఆనందంగా వుండిపోయాడు.

సేవ చేసేవారికందరికీ ఈ శాంతమూ, నిర్లిప్తతా వుండాలి. అపుడే సమాజ సేవ శ్రమ లేకుండా జరుగుతుంది. సమాజసేవ నిరాడంబరంగా, నిస్వార్థంగా చేయాలి. ఇట్టి మానవ సేవ చిత్తశుద్ది కలిగించి చివరకు మాధవసేవగా పరిణమిస్తుంది.

4. చిత్త శుద్ధి కలిగించే చిన్న విషయాలు

చిత్తశుద్ధి కలగడానికి కొన్నికొన్ని చిన్న విషయాలున్నవి. మన పెద్దలు ఈ విషయాలను అతిశ్రద్ధతో అనుసరిస్తూ వచ్చినందువలన జీవితంలో వారికి తృప్తి, సంతోషం కొదవ లేకుండా వుండేవి. మనమూ వారు వెళ్ళిన మార్గాలలో అనుగమిస్తే, మనజీవితాలూ శాంతిప్రదములౌతాయి. ఆ రోజులలో స్నేహబాంధవ్యాలను వారు చక్కగా పాటించేవారు. ఒక ఇంటిలో పెండ్లి జరిగినా, లేక ఏదైనా అపరకార్యములు జరిగినా అందరూ కలసి, పరస్పర సాహాయ్యకంగా వుండేవారు. ఈ సహాయం ఈ కాలంలోవలె బాహిర ప్రకటనంగా వుండేది కాదు. బీదలకు సహాయం గొప్పలకు కాక నిజంగా వారి అభివృద్ధిని మనస్సులో వుంచుకొని చేసేవారు.

పూర్వం, బంధువర్గంలో ధనికులకూ బీదలకూ జీవనవిధానంలో పెద్ద వ్యత్యాసం వుండేది కాదు. ధనికులైనవారు బీద బంధువులకు విశేషంగా ధన సహాయం చేసేవారు. దీనిని వారు ధర్మకార్యంగా భావించి చేసేవారు. బాధితునికి మనం చేసే సహాయం, సహాయం పొందినవానికంటే, సహాయం చేసినవాని చిత్తశుద్ధికి ఎక్కువ తోడ్పడుతుంది.

కానీ ఇదంతా ఇపుడు మారిపోయింది. ఈ కాలపు జనులు పూర్వకాలపు బాంధవ్యం మరచిపోయారు. ధనికునికి సహాయబుద్ధిలేదు. పూర్వం విరివిగా అన్నదానం చేసేవారు. ఈ కాలంలో ధనికులు ఉన్నవారికే పార్టీల మూలంగా అన్నదానం చేస్తున్నారు కానీ, బీదలను గమనించడములేదు. ద్రవ్యమేమో విచ్చలవిడిగా ఖర్చవుతున్నా, ఆ ఖర్చు ధర్మానికో చిత్తశుద్ధి కోసమో వినియోగంకావటంలేదు. ఈ పార్టీలు, ఫీస్టులు ఒక కార్యార్ధమే చేస్తున్నారు. ఇందులో పరోపకార ప్రశంసలేదు. స్వార్ధమే ఉన్నది.

పూర్వకాలంలో అన్నదానమో ద్రవ్యదానమో చేసేటపుడు, దాతకూ గృహీతకూ ప్రియమూ సంతోషమూ నిండుకొని వుండేవి. ఈ కాలపు పార్టీలలో ఇవి రెండూ మృగ్యం. ఈ పార్టీలు, స్పర్ధలకూ, అసూయలకూ కారణమౌతున్నవి. ద్రవ్యరూపంగా సహాయం చేయలేనివారు, శారీరకంగానైనా ఇతరులకు తోడ్పడాలి. శ్రీమంతుడు, బీదవాడు అన్న భేదం లేకుండా సామూహిక సేవలలో పాల్గొనాలి. దారిలో పడియున్న ఒక ముండ్ల కంపను తీసివేసినా అది సహాయమే. అందరూ కలసి ఒక చెరువో బావియో త్రవ్వటమూ పరోపకారమే. అది చిత్తశుద్ధినిస్తుంది. అట్టి చిత్తశుద్ధి ఈశ్వరానుగ్రహం కల్గించడమేకాక, హృదయదర్పణములలో భగవత్స్వరూపమును మనం చూడగలిగేటట్లు చేయగలదు.

5. గుణ దోషములు

మనం ధార్మిక జీవనం చేయాలంటే అన్ని విషయములలోనూ విధి నిషేధాలను పాటిస్తున్నాము అని జాగ్రత్తగా గమనించాలి. ఈ విధి నిషేధాలను ఇతరులు మనకు గుర్తు తేవడం కంటే స్వేచ్ఛగా అనుసరించడం ఉత్తమం. ఒకరి నిర్బంధము వలన విధి నిషేధాలను మనం పాటించామంటే అది గొప్పకాదు. సంప్రదాయమనేది పురాతన కాలం నుంచి మన పెద్దలు స్వయంగా ఆచరిస్తూ వచ్చినది. ఈ సంప్రదాయాలను శాస్త్రం చట్టమువలె వ్రాసిపెట్టలేదు. ''సహస్రంవద ఏకం మాలిఖ''. వేయి విషయాలు నోటితో చెప్పినా, ఒక్క విషయం కూడా వ్రాసి చూపకు - అని దీని భావం. కాని ఈ కాలపు చర్య పూర్తిగా దీనికి విరుద్ధంగా వుంది. ఎక్కడ చూచినా, దీనిని చేయ్‌, దానిని చేయ్‌ - అని నోటీసులు కొల్లలుకొల్లలుగా చూస్తున్నాం. నేను పూజ చేస్తున్న స్థలంలోనే ''మాట్లాడవద్దు, చొక్కా వేసుకోవద్దు'' అన్న నిషేధ వాక్యాలు వ్రాసి బోర్డులు తగిలిస్తున్నారు. ఇకమీదనైనా ఇలాంటివి లేకుండా ఉండుట మంచిది.

మన పెద్దలు, ఒకరిలో ఏ లవలేశమైన గుణమున్నా దానిని గమనించి, శ్లాఘించేవారు. దోషదర్శనం చేసేవారు కాదు. చంద్రునిలో కళంకమున్నది. అందుచేత అతనికి దోషాకరుడన్న పేరున్నది. కాని కళంకమున్న చంద్రుణ్ణి పరమశివుడు తన శిరస్సులో వుంచుకొని, తన ఉత్తమాంగంలో ఉత్తమ స్థానాన్ని యిచ్చాడు. ఆ ఈశ్వరుడే కరాళమైన విషాన్ని, గరళాన్ని తన కంఠంలో వుంచుకొని గరళకంఠుడైననాడు. ఈ విషయాన్ని దండి అనే సంస్కృత కవి ఒక శ్లోకంలో వ్రాశాడు.

కానీ ఈ కాలంలో గుణదోష విమర్శ విరివిగా సాగుతున్నది. అందులో చక్కగా చదువుకొన్నవారు దోషదర్శనాన్ని మరింత చక్కగా చేస్తున్నారు. విద్వాంసుడు అంటే దోషజ్ఞుడనే లక్షణమొక్కటి వున్నది అని వాదించవచ్చును. దోషజ్ఞుడు అంటే దోషమును తెలుసుకొన్నవాడని అర్ధమే కానీ దానిని ప్రచారం చేసేవాడని కాదు. దోషములను తెలుసుకోవలసినదే. వానిని చేయకుండా ఉండేటట్లు చూడాలి. దోషం చేసిన వారికి హితం చెప్పాలి. కాని, వారిని చిన్న చూపు చూడరాదు. దోషప్రచారం ఎన్నడూచేయరాదు.

మనమే దోషభూయిష్ఠలముగా వుంటే ఇతరులకు వారి దోషాలను ఎట్లు చూపగలము? మనకు దోషములు చూపగల యోగ్యతాస్థానము ఉంటేనే ఇతరులకు వారి దోషములను చూపాలి. అంతేకాదు, వారు మన మాటకు విలువ ఇస్తారన్న నమ్మకముంటేనే వారికి చెప్పాలి. ఒకరి మంచిని చూచి శ్లాఘ్య వచనములు పలికామంటే అది వారికి ఉత్సాహవర్ధకంగా వుంటుంది. కాని పొగడ్త కూడ మితిమీరరాదు. మనం ఒకే ధాటిలో స్తోత్రం చేసి వారి అహంకారాన్ని పెంపొందించరాదు. అందులకే సమక్షంలో గురువు, ఈశ్వరుని మాత్రమే స్తుతించాలన్న నియమం ఉన్నది.

మనం స్తోత్రం చేయాలంటే జాగ్రత వహించాలి. బంధు మిత్రులను పరోక్షంలో పొగడవలెనే కానీ ప్రత్యక్షంగా పొగడరాదు. సేవలకులను పని పూర్తికాగానే మెచ్చుకోవచ్చును. తండ్రి తన కుమారుణ్ణి ఏనాడూ ప్రత్యక్షంగా మెచ్చుకోరాదు.

ప్రత్యక్షే గురవః స్తుత్యాః పరోక్షే మిత్ర బాంధవాః
కార్యాంతే దాస భృత్యాశ్చ న స్వపుత్రాః కదాచన ||

నేను ఇంతసేపూ మీ దోషం చూపాను. తండ్రి పిల్లల ముందు వారి గుణగానం చేయరాదు. వారి తప్పులు కావలిస్తే, దిద్దుకోడానికి చూపవచ్చును అని శాస్త్రం చెబుతున్నది. అందుచేత నేను మీ దోషాలను చూపటంలో దోషం లేదు మరి!

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.