Tuesday, 19 April 2016

పరమాచార్యుల అమృతవాణి : సౌశీల్యం కలగటానికి మార్గము



పరమాచార్యుల అమృతవాణి : సౌశీల్యం కలగటానికి మార్గము

మనకు శీలసంపత్తి కలుగవలెనంటే వేదోక్తములైన ఆచారఅనుష్ఠానములను పాటించాలి. సదాచారము, సద్గుణములు అలవరచుకోవాలి. మంచి మనస్సున్న వాడే శీలవంతుడు కాగలడు. అందరూ సుమనస్కులుగా ఉండుటకు వీలు కావటంలేదు. మనసులో ఏ సందర్భములోనూ చెడుతలంపులు తలెత్తకుండా ఉంటేగానీ, సౌజన్యం ఏర్పడదు. అందరి మనస్సులలో సద్భావం కలగుటకొరకే శాస్త్రవిధులు, అనుష్ఠానాలూ మనమతం నిర్దేశించినది. పూజా పునస్కారములు, నైశ్వదేవం అతిథి సత్కారము, మొదలైనవన్నీ చిత్తశుద్ధి కలగడానికీ, సౌజన్యం సౌశీల్యం పెంపొందించుట కొరకూ ఏర్పడినవే. వీనికి అలవాటు పడితే మనస్సులో దురాలోచనలు ప్రవేశించుటకు సమయముకానీ, అవకాశముకానీ ఉండదు.

రెండవది మనం కర్మానుష్ఠానములను చేయునప్పుడు అహంకారానికి దారితీసే కర్తృత్వభావము అసలే ఉండరాదు. కర్మానుష్ఠానము చేయవలెననే సంకల్పమూ, చేసే శక్తీ, వసతులూ అన్నీ ఈశ్వరునివే. ఈ విధంగా మన పూర్వ వైదిక మతాచార్యులు తాము ఆచరించి మనకు మార్గనిర్దేశనం చేశారు.

ఒక అద్దంలో మన బింబం చూచుకోవాలంటే, అది శుభ్రంగా ఉండాలి. అది మకిలితో ఉంటే బింబం మసకమసకగా ఉంటుంది. అంతేకాదు అద్దం నిశ్చలంగా ఉండాలి. కదలుతూ ఉంటే బింబమూ చెదరుతూ ఉన్నట్లు అగపడుతుంది.

మన చిత్తం దర్పణం లాంటిది. ఆ చిత్త దర్పణంలో పరమాత్మను దర్శించాలంటే, చిత్త చాంచల్యం లేక స్థిరంగా, మాలిన్యరహితమై స్వచ్ఛంగా ఉండాలి.

మనింట్లో ఒకపాతరాగి పాత్ర ఉందనుకొందాం. అది బావిలో పడింది. కొన్ని ఏండ్లు నీళ్ళలోనే ఉంది. బయటకు తీసి దానిని శుభ్రపరచవలనంటె ఎంత శ్రమపడాలి? అట్లే అనేక జన్మలనుంచి మనం తెచ్చుకొన్న మలిన సంస్కార దూషితమైన ఈ చిత్తాన్ని ఎంత శ్రమపడితే శుభ్రం చేయగలం? అనేక జన్మసంపర్గమైన చిత్తమాలిన్యాన్ని ఎన్నో సత్కార్యములు చేస్తేకాని పోగొట్టుకొనలేము. అంతేకాదు. ఒక్కరోజు సత్కార్యం చేసి ఊరకుంటే చాలదు. ఈ సదాచారములను అనుదినం అనుష్ఠించాలి. అపుడే చిత్తనైర్మల్యం స్థిరంగా ఉండగలదు. ఇట్లు చేస్తూచేస్తూ రాగా ఒకరోజు ఈ చిత్తమనేది పలాయనమౌతుంది. ఆత్మ ఒక్కటే మిగిలిపోతుంది.

అందుచేత ఆత్మ సాక్షాత్కారం కావాలంటే అమనస్కమైన చిత్తరాహిత్యం, ఆ చిత్తరాహిత్యానికి సౌశీల్యం, సౌశీల్య సంపాదనకు వైదిక కర్మానుష్ఠానం, సదాచారా సంపత్తీ ఉండాలి. ఆత్మలాభానికి శీలం ఎంతో ముఖ్యమైనదన్న విషయం ఏనాడూ మరువరాదు.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.