Monday 4 April 2016

రామాయణ ప్రభ : త్రికాలములలో శ్రీరాముని ధ్యాన శ్లోకములు



రామాయణ ప్రభ : త్రికాలములలో శ్రీరాముని ధ్యాన శ్లోకములు
(శ్రీరామ కర్ణామృతమునుండి)

ధ్యాయే ప్రాతస్సురేశం రవికులతిలకం రంజితానంతలోకం
బాలం బాలారుణాక్షం భవముఖవినుతం భావగమ్యం భవఘ్నమ్,
దీప్యంతం స్వర్ణక్లప్తై ర్మణిగణనికరై ర్భూషణై రుజ్జ్వలాంగం
కౌసల్యాదేహజాతం మమ హృదయగతం రామ మీషత్ స్మితాస్యమ్.


దేవతల కధిపతియైనవాడు , సూర్యవంశశ్రేష్ఠుడు , ఎల్లలోకాలనూ ఆనందింపజేయువాడు, బాలుడు, లేతసూర్యుని పోలిన ఎఱ్ఱనైన నేత్రములు గలిగినవాడు, శివాదులచే స్తోత్రము చేయబడువాడు, హృదయమందు ధ్యానింపదగినవాడు, సంసారబాధను పోగొట్టువాడు, శ్రేష్ఠుడు, మణులు పొదగబడిన కనకాభరణములచే ప్రకాశించువాడు , కౌసల్య కుమారుడు, నా హృదయందున్నవాడు , చిఱునవ్వుమోమువాడు అయిన రాముని ప్రాతఃకాలమందు ధ్యానము చేయుచున్నాను.

మధ్యాహ్నే రామచంద్రం మణిగణలలితం మందహాసావలోకం
మార్తాండానేకభాసం మరకతనికరాకార మానందమూర్తిమ్,
సీతావామాంకసంస్థం సరసిజనయనం పీతవాసో వసానం
వందేఽహం వాసుదేవం వరశరధనుషం మానసే మే విభాంతమ్.


మాణిక్యసమూహముచే సుందరుడు, చూపులతో చిరునవ్వులు చిందించువాడు, బహుసూర్యుల కాంతిగలిగిన వాడు, మరకత మణుల ప్రోగువంటి ఆకారము గలిగినవాడు, ఆనందస్వరూపుడు, ఎడమతొడపై సీత ఉన్నవాడు, పద్మములవంటి నేత్రములు కలిగినవాడు , పచ్చని వస్త్రమును ధరించినవాడు, అన్ని లోకములకు నివాసస్థానమైనవాడు, శ్రేష్ఠములైన ధనుర్బాణములు ధరించినవాడు, నా మనమున బ్రకాశించుచున్నవాడు అగు రామచంద్రుని మధ్యాహ్నమున నమస్కరించుచున్నాను.

ధ్యాయే రామం సుధాంశుం నతసకలభవారణ్యతాపప్రహారం
శ్యామం శాంతం సురేంద్రం సురమునివినతం కోటిసూర్యప్రకాశమ్,
సీతసౌమిత్రిసేవ్యం సురనరసుగమం దివ్యసింహాసనస్థం
సాయాహ్నే రామచంద్రం స్మితరుచిరముఖం సర్వదా మే ప్రసన్నమ్.


చంద్రుని వలె నుండువాడు, నమస్కరించువారికి సంసారారణ్యబాధ నంతయు హరించువాడు , నల్లనివాడు , శాంతుడు, దేవతలచే మునులచే నమస్కరింపబడువాడు, కోటి సూర్యుల కాంతి వంటి కాంతిగలిగినవాడు , సీతాలక్ష్మణులచే సేవింపబడుతున్నవాడు, దేవతలకు మనుష్యులకు సులభుడైనవాడు , గొప్పసింహాసనమందున్నవాడు , నవ్వుచే సుందరమైన మోముగల రామమూర్తి నెల్లపుడు సాయంకాలంమందు ధ్యానించుచున్నాను.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.