Tuesday, 19 April 2016

పరమాచార్యుల అమృతవాణి : లోకక్షేమానికి క్షాత్రధర్మము



పరమాచార్యుల అమృతవాణి : లోకక్షేమానికి క్షాత్రధర్మము
(పరమాచార్యుల ఉపన్యాసములనుండి)

మన పెద్దలు పరోపకారార్ధమిదం శరీరం అని అన్నారు. మన దేహములో జవసత్త్వములున్నపుడే మనం ఇతరులకు శారీరకంగా సహాయం చేయగలుగుతాము. శరీర బలము ఒక్కటే కాదు, జీవితంలో ఆచారాలను క్రమంగా పాటించే ధర్మనిష్ఠ, అభయం బాటలలో ఋజుత్వం వుంటేనే మనం ఇతరులకు చేసే సేవ ఫలవంతం ఔతుంది. ఇటువంటి సేవా భావమునకు మనకు ఆదర్శంగా వుండేది ఎవరంటే, ఆంజనేయస్వామియే. వారు ఎప్పుడూ శాంతంగా వుండేవారు, ఆగ్రహం వచ్చిందంటే ఎవరినీ లెక్కచేయక, శతృవులను హతమార్చేవారు. వారికి బుద్ధిబలము ఎక్కువ. వారి స్వరూపమే వినయము. వారి హృదయం అనుక్షణమూ రామనామ స్మరణ చేస్తూ నామామృత రసానందంలో తేలిపోతూ వుండేది.

తాముగ ఎవరినీ హింసించేవారు కాదు. ఎవరయినా హింస చేయడానికి పూనుకొంటే ప్రతీకారం చేసేవారు. అంతే. స్వార్ధం కోసం తమ బలాన్ని ఎన్నడూ వారు వాడుకోలేదు. కానీ ఆ బలాన్ని దుర్బలులకు అండగా వుంచటానికి ఎన్నడూ వారు వెనుదీయలేదు. కానీ ఆ బలాన్ని కూడ ఇట్టి ఉదారపురుషుడే. ఆంజనేయస్వామి అవతారమని పరిగణింపబడే శ్రీ సమర్ధరామదాసు యొక్క అత్యంత ప్రియమైన శిష్యుడు శివాజీ. అందుకే వారికి అట్టి అమూల్య గుణసంపత్తి ఏర్పడింది.

మనకు దేశభక్తి వుండాలి. దేహంలో జవసత్వములుండాలి. వానితోబాటు సార్వకాలిక అభయస్థితి మనం భజించాలి. నిర్భయంతోపాటు స్వార్ధరాహిత్యం, పరోపకార పారీణత, అలవఱచుకోవాలి. ఈ గుణ సంపత్తినే క్షాత్రధర్మమని అంటారు. 'క్షతాత్‌ కిల త్రాయతే ఇతి క్షత్రం' ఇతరులను అపాయం నుంచి కాపాడుటే క్షాత్రం. మన యువకులకు ఈ క్షాత్ర ధర్మం ఎంతో అవసరం. బలిష్ఠులను చూసి మనం భయపడరాదు. ఎవరయినా మృగప్రాయంగా ప్రవర్తిస్తూ హింసకు పూనుకొన్నాడంటే ఎదిరించి సర్వత్యాగానికి సిద్ధంగా వుండాలి.

ఈ కాలపు తీరు చూస్తే మనలో క్షాత్రం పూర్తిగా లోపించిందనే అనాలి. ఎక్కడ చూచినా సమ్మెలు, నిరశన వ్రతములు, ఇండ్లను, ఆస్తులను, బస్సులను, బండ్లనూ తగల పెట్టడం ఇవీ ఈ రోజులలో మనకు కనబడే దృశ్యాలు. ఇదంతా బలవంతుల చిహ్నంకాదు. బలహీనుల చిహ్నమే. ఇతరులను హింసించడమే వీరి ఉద్దేశం. ఇట్టి వాతావరణంలో ప్రజల బలహీనత, ప్రభుత్వంలోనూ ప్రతిఫలిస్తుంది. ఈ దేశంలో భయం లేకుండా తలెత్తుకొని తిరగవలెననికోరుకొంటే, మరల మనమందరమూ క్షత్ర ధర్మాన్ని అభివృద్ధి చేయాలి. పరోపకార పారీణులు, శీలవంతులు, సత్యసంధులు, ఋజుప్రవర్తకులు అందరూ కలియకూడి దౌర్జన్యాన్ని ఎదుర్కొనుటకు సిద్ధపడాలి. లోక క్షేమానికి ఈ క్షత్రధర్మమెంతో అవసరం. అపుడే దేశంలో సుఖశాంతులు. మన రాజ్యాంగం చక్కబడవలెనంటే దారి ఇదే.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.