Tuesday, 19 April 2016

పరమాచార్యుల అమృతవాణి : మిత వ్యయం



పరమాచార్యుల అమృతవాణి : మిత వ్యయం
(పరమాచార్యుల ఉపన్యాసములనుండి)

మన కాలమంతా ద్రవ్యార్జలోనే గడచిపోతున్నది. ఈ ద్రవ్యాన్ని మనం సరిగా ఖర్చు పెట్టుతున్నామా అని యోచించాలి. మనం ఏ వస్తువునూ అవసరానికి అధికరించి కోరకూడదు. ఒక వస్తువు కొనేటపుడు, మనం బేరం చేసి ఎంత తక్కువ ధరలో కొనవచ్చునో అంత తక్కువ ధరలో కొంటాము. కానీ ఆ వస్తువు మనకు అవసరమా అన్న విషయం ఆలోచిస్తున్నామా? వస్తు సముదాయాన్ని వృధా చేసుకొంటూ పోవడం వలన మనకు సుఖం అధికమౌతుందని అనుకోవటం ఒక భ్రమ. జీవితం సుఖంగా గడవాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులుంటే చాలు. దానికి కావలసిన ధనం మాత్రం ఆర్జిస్తే చాలు. ఈ విషయం మనం గుర్తించగలిగితే, మన ఆచారాలు, అనుష్ఠానాలు వదలుకొని దేశాంతరాలకు పోయి విస్తార ధనార్జన చేయవలసిన అవసరం ఏర్పడదు. ఆత్మ విచారానికీ, ఈశ్వరధ్యానమునకూ, పరోపకారమునకూ మనకు వలసినంత కాలము కావాలంటే అవసరాలకు మించి వస్తువులను సముపార్జన చేసే లౌల్యమును వదలిపెట్టాలి.

మనం రెండు విధాలుగ కాలాన్ని వ్యయం చేస్తున్నాము. ఒకటి ధనానికోసం వెచ్చించే సమయం, రెండవది ధనార్జనతో సంపాదించిన వస్తువుల రక్షణలో వెచ్చించే సమయం. ఈ రెండూ మనకు మిగిలితే ఆ మిగిలిన కాలంలో ఆత్మ తుష్టికరములైన సాధనలను చేసి జీవితం శాంతంగానూ, సుఖంగానూ, ఆనందంగానూ తృప్తిగానూ గడపవచ్చును.

ఈ పొదుపు, వస్తువుల విషయంలోనే కాదు. సంభాషణలలోనూ పొదుపు ఉండేటట్లు చూడాలి. పదిమాటలలో చెప్పవలసిన విషయం ఒక్కమాటలో చెప్పగల సామర్ధ్యాన్ని మనం సంపాదించాలి. ఎప్పుడు మనకు ఈ విధమైనా వాచాసంయమన మేర్పడుతున్నదో, బుద్ధిలో ఒక తీక్షణమూ, వాక్కులో ఒక ప్రకాశమూ మనం స్ఫుటంగా చూడగలము. మన వాక్కులు వ్యర్ధంకారాదు. 'మౌనేన కలహం నాస్తి'. మితభాషణ వలన మనశ్శాంతీ ఆత్మ శ్రేయస్సూ వృద్ధి ఔతాయి.

కానీ ఈ కాలంలో మనం చూస్తున్నదేమంటే వృధావాగాడంబరం. దినపత్రికలు తెరచామంటే, మనం చూచేదంతా వివిధ కక్షలకు చెందిన నాయకుల ప్రసంగాలే. కార్య దక్షత లేకున్నా మాటలు మాత్రం కోటలు దాటుతాయి. తాము చేయలేని కార్యక్రమముల లోపాన్ని ఈ వాగ్విజృంభణలో వీళ్ళు కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తారు. పొదుపు అనే విషయం ఒక్క చేతలోనే కాక మాటలలోనూ వుండవలె.

అబ్బ కోరికలూ, సంకల్పం వల్లనే ఉద్భవిస్తున్నాయి. క్రొత్తక్రొత్త సంకల్పములు ఉదయించకుండా చూసుకొంటే, కోరికలూ క్రమక్రమంగా క్షీణిస్తాయి. కోరికలు క్షీణించే కొద్దీ మన కార్యక్రమాలూ, ధనార్జనా, వస్తు సంపాదనా తగ్గుతూ వస్తాయి. సంకల్పములు క్షీణించవలెనంటే సద్వస్తు ధ్యానముండాలి. అపుడు చిత్తవృత్తులు సమసిపోయి ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రతకు అపరిగ్రహం అత్యవసరం.

మనం సంపాదించే ధనమంతా స్వార్ధంకోసమే కాక దానధర్మాలకు కూడా వెచ్చించాలి. మన సమాజంలో సత్కార్యాలకోసం దానధర్మాలు చేసే సుకృతులు ఎంతోమంది వున్నారు. లోకంలో ఎంతో మంది దుఃఖితులూ దరిద్రులూ వున్నారు. వారు కష్టపడుతుంటే మనకున్నదికదా అని మనం వృధాగా ధనమును ఖర్చు పెట్టడం పాపం. మనధనంతో దీనుల దుఃఖాశ్రువులను తొలగించగలిగితే అంతకంటే పుణ్యకార్యం వేరే వుండదు. ధనం వుంటే మాత్రం చాలదు. దానిని సద్వినియోగం చేస్తున్నామా, పరోపకారానికి అది ప్రయోజనపడుతున్నదా, దీన జనోద్ధరణ దీని వలన జరుగుతున్నదా అని మనం జాగ్రత్తగా గమనించవలె. ధనం సద్వినియోగం అయ్యేకొద్దీ, మనకు లక్మీకటాక్షం కూడా సమృద్ధిగా వుంటుంది.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.