Tuesday, 19 April 2016

పరమాచార్యుల అమృతవాణి : ఆస్తిక్యబుద్ధితో శాంతి



పరమాచార్యుల అమృతవాణి : ఆస్తిక్యబుద్ధితో శాంతి
(పరమాచార్యుల ఉపన్యాసములనుండి)

గడచిన అర్ధశతాబ్దములో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాచరికం, సామూహిక విధానం, విజ్ఞానం, గృహజీవనం - వీటన్నిటిలో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చినవి. ఐదువేల ఏండ్లుగా నడుస్తున్న జీవనవిధానం, ఒక్కపెట్టున ఈ అర్ధశతాబ్దంలో తలక్రిందులుగా మారిపోయింది. ఈ అనుభవాన్ని తఱచిచూస్తే, చాలగొప్ప మార్పులు ఏర్పడినవని మనం సులభంగా గ్రహిస్తాం. ఈ అనుభవాల మధ్య ఒక్క విషయం మనకు స్ఫుటంగా గోచరిస్తుంది. మానవానీకం శాస్త్రనిష్ఠనుంచీ, భగవద్ధర్మము నుండి ఎంతెంత వైదొలగుతున్నదో అంతంత చిక్కులపాలవుతున్నది అని మనం సులభంగా తెలుసుకొంటాము. సైన్సు అభివృద్ధి అయిన కొద్దీ అన్ని దేశాలలోనూ ఒక అశాంతి తలెత్తి ప్రజలలో నెమ్మది లేకపోయింది. మున్ను ప్రజలలో వున్న నిశ్చింత, నెమ్మదీ, సౌజన్యం పూర్తిగా లోపించినదనే అనాలి. మనిషి కుశాగ్ర బుద్ధియై శక్తులను వశపఱచుకొన్నందువలన వచ్చిన ఆపదే ఇది.

సరే వ్యాధిని తెలుసుకొన్నాం. దీనికి మందేమి? భగవదావేశితమైన మనస్సులో అశాంతీ, భీతీ ఎన్నడూ వుండదు. ఈ కాలంలో పోలీసుస్టేషన్లూ, న్యాయస్థానాలు కొల్లలుకొల్లలుగా వున్నాయి. ప్రభుత్వం వీని విషయంలో జాగ్రత్తగానే వున్నది. కానీ ప్రజలలో ఆస్తిక్యం ప్రబలమయ్యే పనులు మాత్రం ప్రభుత్వం చేయటం లేదు. ప్రభుత్వం మతబోధనలు గూర్చీ, నైతిక బోధనలు గూర్చీ అస్తమానమూ మాట్లడుతున్నా కార్యరూపంలో మాత్రం ఏవీ కనబడటంలేదు. మన పెద్దలు అనుదినమూ లోకాస్సమస్తాస్సుఖినోభవంతు' అని ప్రార్ధించేవారు. ఈ ప్రార్ధన సర్వమత సమత్వ చిహ్నం. అందుచేత ప్రజా శాంతి కొఱకు మనమందరమూ, ఆస్తిక్యం పెంచుకొని, పరస్పర వైషమ్యులులేక, ఒద్దిక కలగి మెలగటం అలవాటు చేసుకోవాలి.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.