జయేంద్రవాణి : సత్సాంగత్యం ఎందుకు అవసరము ?
(జగద్గురువులు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతీ సంయమీంద్రుల అనుగ్రహభాషణములనుండి)
ఒకానొకప్పుడు ధర్మపుత్రుడు, దుర్యోధనుడు కలిసి ఒక చోటకు వెళ్లారు. మామూలుగ వారిద్దరూ కలిసి బయటకు వెళ్లటం జరిగేది కాదు. వారు జ్ఞాతులైన, బాల్యం నుండి వారి మధ్య సఖ్యత లేని కారణంగా వారు చాల అరుదుగా కలిసి సంచరించే వారు. కాని ప్రపంచంలోని పలుప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉంటారో పరిశీలిద్దామని వారిరువురు కలిసి వెళ్లటానికి నిశ్చయించుకున్నారు.
ఒక రోజున ధర్మపుత్రుడు, దుర్యోధనుడు ఒక నగరాన్ని చూట్టానికి వెళ్లారు. ధర్మపుత్రుడు ప్రతి దాంట్లోను మంచిని మాత్రమే చూడగల్గితే, దుర్యోధనుడు వానిలోని చెడును మాత్రమే దర్శించ గల్గుతున్నాడు. ఒకే విషయం ఒకరికి మంచిగా తోస్తే అదే విషయం రెండవ వానికి చెడుగా కన్పిస్తుంది. ఇది ఎలా సంభవం? ఇచ్చట సమస్య వ్యక్తి తాను పరిశీలించిన పూర్తి విషయంపై ఏర్పడే మానసికధోరణి మాత్రమే. వస్తుదోషం అంటూ ఏమీ ఉండదు.
వారు అలా వెళుతుండగా మాంసవిక్రయం కొరకు జంతువధ చేస్తున్న ఒక కసాయి వాడు వారిద్దరకు కనిపిస్తాడు. తన జీవనోపాధి కొరకై జంతువులను వధిస్తున్నాడు గనుక కసాయి వానిని ధర్మపుత్రుడు చెడ్డవాణ్ణిగా తలంచాడు. కసాయివాడు చేసేపని అక్రమమైనది గనుక అతడు చెడ్డవాడేనని దుర్యోధనుడు కూడ అంగీకరించాడు. వారిరువురు ఈ విషయంపై ఏకాభిప్రాయం కల్గియుండటం చాల అరుదైన సంఘటనే. జంతు హింస పాపమని యిరువురు విశ్వసించారు. ఇరువురు కసాయివాడు చెడ్డవాడనే అభిప్రాయాన్ని సమర్థించారు.
కొంత సేపయిన తర్వాత ఆ కసాయివాడు ఆ మాంసంలో కొంత భాగాన్ని తన దుకాణం బయట కుక్కలకు ఆహారం గాను, మరి కొంత భాగాన్ని మాంసాహారులైన పక్షులకు ఆహారంగాను వేయటం వారు గమనించారు. అలా చేసిన తర్వాతనే కసాయివాడు తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదిజూచి ధర్మపుత్రుని హృదయం స్పందించింది. నిస్సందేహంగా ఇతడు తన జీవనోపాధికై జంతువధ చేస్తున్నాడు. ఐనా కొంత మాంసాన్ని జంతువులకు, పక్షులకు ఆహారంగా యిచ్చి తన ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాతనే తన వ్యాపారాన్ని ఆరంభిస్తున్నాడు. మనం మన భోజనానికి ఉపక్రమించే ముందు చుట్టుప్రక్కల అతిధులెవరైనా ఉన్నారేమో నని చూచి వారికి భోజనం పెట్టిన తర్వాతనే మనం భుజించాలి. ఇలాంటి ధర్మం మరొక చోట చూడం. ఇది మనదేశంలో మాత్రమే చూడగలం. ఇది ధర్మాన్ని గురించిన అతని అవగాహన.
ప్రతిదినం మనం కూడ చాల జీవరాసుల్ని చంపుతాం. బెండకాయ, దోసకాయ, వంకాయ, పొట్లకాయ మొదలైన కూరగాయల్ని తరుగుతాం. వీటన్నిటిలోనూ ప్రాణం ఉంది. మనం తినే బియ్యం కూడ ప్రాణం గలదే. ఐనా మనం భుజిస్తాం. కొంత మంది సపోటా పండు తింటారు. కాని మరికొందరు దాని రంగునకు ఇష్టపడక దాన్ని తినటానికి ఆసక్తి చూపరు. కనుక ఒక వస్తువు పట్ల వ్యక్తి కనబరచే మానసిక వైఖరి మీదే అంతా ఆధారపడి ఉంటుంది. అందుచే ప్రతివాడు తన చిత్తప్రవృత్తిని బట్టి పనులను చేస్తాడు. విషయాలను పరికిస్తాడు. కసాయివాడు పాపకార్యమైన జంతువధను చేస్తున్నప్పటికి కొంత మాంసాన్ని ఇతర ప్రాణికోటికి ఆహారంగా యిచ్చికాని తన వ్యాపారాన్ని ప్రారంభించటం లేదు. ఐతే వ్యాపార మంటేనే మోసాలు, అబద్ధాలు అప్రమాణాలు మొదలైన అన్ని రకాల దుర్మార్గాలకు పాటుపడాల్సి ఉంటుంది. ఐనా కసాయివాడు తన వ్యాపారాన్ని ఆరంభించక ముందే ఒక ధర్మమైన పనిని చేసేవాడు. అప్పుడు ధర్మపుత్రుడు ఆలోచించ ప్రారంభించాడు. ''మొదట కసాయివాడు చాల చెడ్డవాడని నిర్ధారించాను. కాని అతనిలో కూడ మంచితనం ఉందని ఇప్పుడు అభిప్రాయపడుతున్నాను.'' దాన్ని గురించి పదేపదే ఆలోచించి తనలో ఇట్లా అనుకున్నాడు ''నేను ఇన్నాళ్లూ దుర్యోధనునితో కలిసి ప్రయాణిస్తున్నాను. కనుక అతని వాసనా బలం నాలో ప్రవేశించింది. నా ధర్మ నిర్ణయంలో పొరపాటు మొదట జరిగిందంటే దానికి కారణం అతని సాహచర్యమే.''
కాబట్టి సాహచర్యమే ఈ తేడాలకు కారణ భూతమౌతుంది. ఇచ్చట దృష్టిదోషం తప్ప వస్తుదోషం ఏమీ లేదు. అనగా వస్తువులో ఏ లోపం లేదు. లోపమల్లా మన దృష్టిలోనే. మనకు సత్సాంగత్యం, దేవాలయాలకు పోవుట, భగవంతుని కొలుచుట, మతపరమైన ప్రవచనాలు వినుట మొదలైన సత్కాలక్షేపాలు సమకూరితే ప్రతిది మనకు మంచిగా కన్పిస్తుంది. ప్రజలందరు మన దృష్టిలో సత్పురుషు లౌతారు. కనీసం అలాంటి సమయాల్లో నైనా మనకు మంచి భావాలు కల్గుతాయి, మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి, మంచిగా ప్రవర్తిస్తాం. ఇతర సమయాల్లో మనం చెడుగా ప్రవర్తించవచ్చు, చెడ్డ వారం కావచ్చు. సత్పురుషులెప్పుడూ ప్రతి విషయాన్ని సమదృష్టితో సరియైన స్థితిలో చూస్తారు. సాహచర్యం మారినా, పరిసరాలు చెడినా, విలువలు నిర్ణయాలు తారుమారౌతాయి. ఇది చాలమంది సాధారణ వ్యక్తులలో సంభవిస్తుంది.
రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు మొదలైనవారు ఏ పరిసరాలలో నున్న వారు చెడ్డవారే. పరిసరాల ప్రభావం వారిపై ఏ విధంగాను పడదు. కాని మన విషయంలో దోషం మన బాహ్య చర్మం పైనే ఉంటుంది. మన రక్తంలోకి అది చొరబడలేదు. రక్తం పరిశుద్ధంగా ఉన్నంత వరకు, సత్సాంగత్యంలో మనం గడిపినంత వరకు ప్రతి విషయంలోను మనం మంచినే చూస్తాము. మన వివేకం, బుద్ధి కూడ మంచి స్థితిలో ఉంటాయి. పరిసరాలు, సహచర్యం చెడుగా పరిణమించి నప్పుడే మనం చెడుగా మారుతాం.
మనం మన సంస్కృతిని, మతాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే చాలు మంచి వారమౌతాం. దుష్ట వాతావరణమున్నా అది దానంతట అదే అదృశ్యమౌతుంది. ఒక వేళ వున్నా కొంతకాలం వుండి వెంటనే రహిత మౌతుంది.
కనుక పరిసరాల్ని మెరుగు పరచుకునే ప్రయత్నం మనం చేయాలి. మనకు మన మతం, మన ధర్మాలు, చేయవలసిన విధులు వున్నాయని గుర్తుంచుకోవాలి. మన ఆచార వ్యవహారాలతో బాటు మన సంప్రదాయాలను, సంస్కృతిని కూడ మనం కాపాడుకోవాలి.
ప్రాథమిక మత సిద్ధాంతాలను అవగాహన చేసికొని సగుణోపాసన ద్వారా భగవదారాధన చేయటమే మన కనీస కర్తవ్యం. మనం సత్సాంగత్యాన్ని, పుణ్యపురుషుల సహచర్యాన్ని సమ కూర్చుకొని స్వధర్మాల్ని నిర్వర్తిస్తూ మంచి పరిసరాల్ని సృష్టించుకోవాలి. అడ్డంకుల భయాన్ని గాని, నిస్పృహని గాని దరిచేరనీయ నవసరం లేదు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో మనగల్గటానికై మన ప్రాచీనమైన, గొప్పదైన మతాన్ని పుష్టికరం కావించుచూ, దాని పునరుజ్జీవనానికై మనలో ప్రతివాడు తనవంతు కృషి చేయాలి.