Tuesday 15 November 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 71 - 75



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 71 - 75

ఆరూఢభక్తిగుణకుఞ్చితభావచాప
యుక్తైః శివస్మరణబాణగణైరమోఘైః ।
నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీన్ద్రః
సానన్దమావహతి సుస్థిరరాజలక్ష్మీమ్ ॥ 71 ॥


రాజు తన చాపమునుండి బాణపరంపర వర్షించి శత్రువులని నిర్జించి రాజ్యలక్ష్మిని పొందుతాడు. మనుష్యులు, తమ పాపములు అనే శత్రువులను జయించి మోక్షలక్ష్మిని పొందుట ఎలా సాధ్యమో శంకరులు చూపుతున్నారు.

బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, పరిపక్వత పొందిన భక్తి అనే అల్లెత్రాటితో‌ వంచబడిన మనస్సు అనే‌ వింటికి కూర్చబడినవీ, అమోఘములూ (వ్యర్థము కానివి) అయిన శివస్మరణము అనే‌ బాణ సమూహములతో‌ పాపములనెడి శత్రువులను నిశ్శేషముగా జయించి, విజయుడై ఆనందముతో‌ మోక్షసామ్రాజ్యలక్ష్మిని పొందుతాడు.

భక్తితో మనస్సును బంధించి నిరంతర శివనామస్మరణ చేయుట ద్వారా పాపరాశి ధ్వంసము చేసుకొని శివసాయుజ్యము పొందవచ్చునని శంకరుల ఉపదేశము.

ధ్యానాఞ్జనేన సమవేక్ష్య తమఃప్రదేశం
భిత్వా మహాబలిభిరీశ్వరనామమన్త్రైః ।
దివ్యాశ్రితం భుజగభూషణముద్వహన్తి
యే పాదపద్మమిహ తే శివ తే కృతార్థాః ॥ 72 ॥


భూగర్భములో‌ కొన్ని నిధులు దాగి ఉంటాయి. ఆ నిధులను కొన్ని శక్తులు ఆశ్రయించి ఉంటాయి. సర్పములు వాటిని చుట్టుకొని ఉంటాయి. అలాంటి నిధులను అంజనము (ఒకానొక కాటుక) ద్వారా ఎక్కడ ఉన్నాయో తెలుసుకొంటారు. ఆ నిధిని ఆశ్రయించి ఉండు శక్తులకు బలులు సమర్పించుట ద్వారా ప్రసన్నం చేసుకొని, అచ్చోట భూమిని త్రవ్వి ఆ నిధిని పొందుతారు.

శంకరులు శివపాదపద్మమే‌ భక్తులు పొందదగిన నిధి అంటూ అది పొందు విధానం ఉపదేశిస్తున్నారు.

శివా! నీ ధ్యానమనే అంజనముతో‌ బాగుగా చూచి, నీ నామములు, మంత్రములనే ఉత్తమబలులతో‌ అజ్ఞానమనే భూమిని భేదించి, దేవతలచే‌ ఆశ్రయించబడునదీ, సర్పాభరణము కలదీ‌ అయిన నీ‌ పాదపద్మమును ఈ‌జన్మలో పొందుతున్నవారు కృతార్థులు.

భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ-
భూదార ఏవ కిమతః సుమతే లభస్వ ।
కేదారమాకలితముక్తిమహౌషధీనాం
పాదారవిన్దభజనం పరమేశ్వరస్య ॥ 73 ॥


విష్ణుమూర్తి మహాలక్ష్మీదేవి,భూదేవి భార్యలుగా కలవాడు. అలాంటి విష్ణువు ఏమి కోరుకుంటాడు ?‌ విష్ణువు కూడా సేవించు శివ పాదపద్మములను మనలనూ సేవించమని శంకరులు ఉపదేశిస్తున్నారు.

శ్రీ మహాలక్ష్మి,భూదేవి దేవేరులైన విష్ణువే ఏమి కోరి వరాహరూపము ధరించెను ? (ఈశ్వర పాదారవింద దర్శనాపేక్షచే). కాబట్టి, ఓ బుద్ధిమంతుడా, నీవునూ (వివిధములు గా చెప్పబడే) మోక్షములు అనే ఓషధులు పండు పొలము అయిన పరమేశ్వర పాదారవిందముల సేవను పొందుము.

జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన పరమేశ్వరుని ఆద్యంతములు కనుగొనవలెనని వరాహరూపము ధరించి విష్ణువూ, హంసరూపములో‌ బ్రహ్మా ప్రయత్నించిన పురాణగాధ ఈ శ్లోకములో‌ ఉటంకించబడినది.

ఆశాపాశక్లేశదుర్వాసనాది-
భేదోద్యుక్తైర్దివ్యగన్ధైరమన్దైః ।
ఆశాశాటీకస్య పాదారవిన్దం
చేతఃపేటీం వాసితాం మే తనోతు ॥ 74 ॥


నా మనస్సులో‌ పరమేశ్వరపాదారవిందము ఎల్లప్పుడూ ఉండుగాక అని శంకరులు కోరుతూ, అపుడేమగునో‌ అన్యాపదేశంగా చెప్పుతున్నారు.

నా మనస్సు నందు ఆశాపాశములూ, క్లేశములూ, దుర్వాసనలూ (చెడు సంస్కారములు)‌ ఉన్నాయి. సాంబసదాశివుని పాదారవిన్దము నా మనస్సు యొక్క ఈ‌లక్షణాలు పోగొట్టి, దివ్యములూ, విస్తారములూ‌ అయిన పరిమళముల(సుసంస్కారములు) చేత నిండినదానిగా చేయుగాక.

పద్మములు సుగంధములు వెదజల్లి, చెడు వాసనలు దూరం చేయునట్లు, పరమేశ్వరుని పాదపద్మములు చెడు సంస్కారములను దూరం చేయునని భావము.

అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము - ఇవి పంచక్లేశములు.

కల్యాణినాం సరసచిత్రగతిం సవేగం
సర్వేఙ్గితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యమ్ ।
చేతస్తురఙ్గమధిరుహ్య చర స్మరారే
నేతః సమస్తజగతాం వృషభాధిరూఢ ॥75 ॥


శంకరులు మనస్సును ఉత్తమాశ్వముతో‌ పోలుస్తూ, సమస్తలోకములకూ‌ ప్రభువైన పరమేశ్వరుడను వృషభవాహనము బదులు ఈ‌ అశ్వమును యెక్కి సంచరింపమంటున్నారు. భక్తి నిండియున్న మనస్సుకూ‌ ఉత్తమాశ్వమునకూ‌ పోలిక ఎలా చెప్పారో చూడండి. చెప్పబడిన ప్రతీ లక్షణమూ అశ్వమునకూ, భక్తిపూరిత మనస్సునకూ‌ వర్తిస్తుంది.

వృషభవాహనుడా! మన్మధుని శత్రువా! జగదాధీశుడా! కల్యాణ లక్షణములు కలదీ, యజమానుడియందు అనురాగముకలిగి చిత్ర గతులలో‌ పోగలదీ, మిగుల వేగముకలదీ, అందరి అభిప్రాయము తెలిసికొనగలదీ, దోషములు లేనట్టిదీ, స్థిరలక్షణములు కలిగినదీ‌ అయిన నా మనస్సనే అశ్వమునెక్కి సంచరింపుము.

సదా నా మనస్సునందు ఉండమని భావము.







ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.