Monday 21 November 2016

శంకరస్తోత్రాలు :‌ శివానన్దలహరీ : 86 - 100


శంకరస్తోత్రాలు :‌ శివానన్దలహరీ (86 - 100)

పూజాద్రవ్యసమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే
పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్ ।
జానే మస్తకమఙ్ఘ్రిపల్లవముమాజానే న తేఽహం విభో
న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా ॥ 86 ॥


శంకరులు, పూజాద్రవ్యములున్ననూ పూజచేయుట కష్టమే‌ అని అంటున్నారు. దిగంతాలు వ్యాపించియున్న స్థాణుస్వరూపమును భావన ఎటుల చేసేది ?

ఉమాపతీ ! పూజాద్రవ్యములన్నియూ విశేషముగా సమకూర్చబడినవి. కానీ పూజ ఎట్లు చేయుదును ? దుర్లభమైన హంస వరాహ రూపములు నేను పొందలేను. కాబట్టి నాకు నీ‌ శిరస్సు, పాదపద్మములు తెలియవు. ప్రభో! ఆ రూపములు ధరించిన బ్రహ్మ, విష్ణువుల చేతనే యదార్థము తెలిసికొనబడలేదు. (వారూ‌ తెలిసుకొనలేకపోయారు). నేనెంత ?
జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన పరమేశ్వరుని ఆద్యంతములు కనుగొనవలెనని వరాహరూపము ధరించి విష్ణువూ, హంసరూపములో‌ బ్రహ్మా ప్రయత్నించిన పురాణగాధ ఈ శ్లోకములో‌ ఉటంకించబడినది.

అశనం గరళం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః ।
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదామ్బుజభక్తిమేవ దేహి ॥ 87 ॥


శంకరులు భగవంతుని ఏమి ప్రార్థించవలెనో‌ మనకు నేర్పుతున్నారు.

శంభో! నీవు భుజించునది విషము. నీకు ఆభరణము సర్పము. నీవు ధరించు వస్త్రము గజ చర్మము. నీ‌ వాహనము ఒక ముసలి యెద్దు. ఇక నాకు నీవు ఏమి ఈయగలవు ? ఈయుటకు నీవద్ద ఏమున్నది ? నీ‌ పాదపద్మములయందు భక్తిని మాత్రము ప్రసాదింపుము.

ఈశ్వరుడు గుణదోషములు లేనివాడు. అట్టి వానిని సాధారణ ప్రాపంచిక కోర్కెలు కాక భక్తిమాత్రమే కోరదగిన వస్తువు అనిశంకరులు ఉపదేశిస్తున్నారు.

యదా కృతాంభోనిధిసేతుబన్ధనః
కరస్థలాధఃకృతపర్వతాధిపః ।
భవాని తే లఙ్ఘితపద్మసంభవః
తదా శివార్చాస్తవభావనక్షమః ॥ 88 ॥


శివార్చన, స్తుతి, ధ్యానము సాధారణవిషయములు కావని శంకరులు ఉగ్గడిస్తున్నారు.

ఓ‌ శివా! ఎప్పుడు నేను - సముద్రమునకు సేతువుగట్టినవాడనూ (శ్రీరాముని వంటి వాడను), అఱచేతితో‌ పర్వతరాజమును అణచినవాడను (అగస్త్యుడు వింధ్యాచలమును అణచెను, అటువంటివాడను), బ్రహ్మనుమించినవాడనూ అవుతానో‌ అపుడు నేను నిను పూజించుటకు, స్తుతించుటకు, ధ్యానించుటకు సమర్థుడనవుతాను.
నతిభిర్నుతిభిస్త్వమీశపూజా-
విధిభిర్ధ్యానసమాధిభిర్న తుష్టః ।
ధనుషా ముసలేన చాశ్మభిర్వా
వద తే ప్రీతికరం తథా కరోమి ॥ 89 ॥


శంకరులు శివుడు భోళాశంకరుడని, భక్తసులభుడని ఈ శ్లోకములో‌ చూపుతున్నారు.

ఈశ్వరా! నీవు నమస్కారములచేతనూ, స్తుతిచేతనూ, పూజావిధులచేతనూ, ధ్యాన సమాధులచేతనూ సంతోషించుటలేదు. నీకు (పూజ)‌ధనుస్సుతోనా , రోకలితోనా, రాళ్లతోనా ?‌ నీకు ఏది ప్రీతియో‌ చెప్పుము, అటులనే చేసెదను.

అర్జునుడు ధనుస్సుతోనూ, రాళ్లతోనూ‌ ఇతర రీతులనవలంబించి శివునితో‌ పోరాడెను. కానీ‌ శివుడు ప్రసన్నుడాయెను, పాశుపతము ఉపదేశించెను. శివభక్తులు (నాయనార్లు) శివుని రోకటితోనూ, రాళ్లతోనూ కొట్టితిరనీ, వారిని శివుడనుగ్రహించెననీ‌ గాధ.

సాధారణ (బాహ్య పటాటోపాల) సాత్వికపూజా విధానములు భక్తి పండనిచో శివుని మెప్పించలేవు. భక్తి పండిన చోట శివుడు సర్వదా ప్రసన్నుడనీ‌ శంకరుల ఉపదేశము.

వచసా చరితం వదామి శంభో-
రహముద్యోగవిధాసు తేఽప్రసక్తః ।
మనసా కృతిమీశ్వరస్య సేవే
శిరసా చైవ సదాశివం నమామి ॥ 90 ॥


శంభో! నేను శాస్త్రవిధిన నిన్ను పూజించుట తెలియనివాడను. నోటితో నీ చరిత్ర పలుకుతాను. మనస్సులో ఈశ్వరుని స్వరూపము ధ్యానించుతాను. సదాశివుని శిరస్సుతో‌ నమస్కరించుతాను.

త్రికరణశుద్ధిగా శివుని సేవించుట ముఖ్యమని శంకరుల ఉపదేశము.

ఆద్యాఽవిద్యా హృద్గతా నిర్గతాసీ-
ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ ।
సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం
భావే ముక్తేర్భాజనం రాజమౌళే  ॥ 91 ॥


చంద్రశేఖరా! నీ‌ అనుగ్రహము వలన అనాదిగా నా హృదయమందున్న అజ్ఞానము నాశనమాయెను. హృద్యమైన (అందమైన, మనోహరమైన) జ్ఞానము హృదయమున ఉన్నది. అనుదినమూ శ్రీకరమూ, మోక్షప్రదమూ అగు నీ‌ పాదపద్మములను నేను మనస్సున ధ్యానించుచున్నాను.

శంకరులు త్రికరశుద్ధిగా శివుని సేవించమంటూ, మనస్సుద్వారా చేయవలసిన శివపాదపద్మ ధ్యానము ఉపదేశిస్తున్నారు.

దూరీకృతాని దురితాని దురక్షరాణి
దౌర్భాగ్యదుఃఖదురహంకృతిదుర్వచాంసి ।
సారం త్వదీయచరితం నితరాం పిబన్తం
గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః  ॥92 ॥

గౌరీనాథా! పాపములు, చెడు అక్షరములతో‌ కూడినవి, దౌర్భాగ్యము-దుఃఖము-దురహంకారము కలవీ అగు చెడు వాక్కులు తొలగిపోయినవి (విడచిపెట్టితిని). వేదసారమైన నీ‌ చరిత్రమును నిత్యమూ పానము చేయుచున్న నన్ను ఈ జన్మలో‌ నీ‌ కటాక్షములతో ఉద్ధరింపుము.

శంకరులు త్రికరశుద్ధిగా శివుని సేవించమంటూ, వాక్కుద్వారా చేయవలసిన శివకథా పఠనము ఉపదేశిస్తున్నారు.

సోమకలాధరమౌళౌ
కోమలఘనకన్ధరే మహామహసి ।
స్వామిని గిరిజానాథే
మామకహృదయం నిరన్తరం రమతామ్  ॥93 ॥


శివుని సాకారధ్యానం శంకరులు ఉపదేశిస్తున్నారు.

శిరస్సున చంద్రకళ ధరించినవాడూ, కోమలమైన నల్లమబ్బువంటి కంఠము కలవాడూ, గొప్ప తేజోరూపుడూ, ప్రభువూ అగు గిరిజానాథునియందు నా హృదయము ఎల్లప్పుడూ రమించుగాక.

సా రసనా తే నయనే
తావేవ కరౌ స ఏవ కృతకృత్యః ।
యా యే యౌ యో భర్గం
వదతీక్షేతే సదార్చతః స్మరతి  ॥ 94 ॥


శివుని గురించి పలికెడి నాలుకయే‌ నాలుక. శివుని దర్శించు కన్నులే‌ కన్నులు. శివుని అర్చించు కరములే‌ కరములు. శివుని ఎల్లప్పుడూ‌ స్మరించువాడే కృతకృత్యుడు (ధన్యుడు).

ప్రహ్లాదుడు "కమలాక్షునర్చించు కరములు కరములు" అన్నటులే. త్యాగరాజులవారు "ఎన్నగ మనసుకు రాని" అన్నటులే. భగవత్ప్రసాదిత శరీరమూ, ఇంద్రియములచే భగవత్సంబంధిత కార్యములు చేయించుటయే వాటికి కృతకృత్యత.

అతిమృదులౌ మమ చరణా-
వతికఠినం తే మనో భవానీశ ।
ఇతి విచికిత్సాం సంత్యజ
శివ కథమాసీద్గిరౌ తథా వేశః  ॥ 95 ॥


పార్వతీపతీ! " నాపాదములు అతి కోమలములు, నీ‌ మనస్సు అతి కఠినము" అనే సంశయమును విడిచిపెట్టు. శివా! అలా అయితే, పర్వతమందు ఎట్లు సంచరించినావు ?
పర్వతమందు సంచరించు నీ పాదములు నా మనస్సు కఠినమైననూ అందు సంచరించగలవు కాబట్టి శీఘ్రమే‌ నా మనస్సు నందు నీ‌ పాదపద్మములను ఉంచమని శంకరుల ప్రార్థన.

ధైర్యాఙ్కుశేన నిభృతం
రభసాదాకృష్య భక్తిశృఙ్ఖలయా ।
పురహర చరణాలానే
హృదయమదేభం బధాన చిద్యన్త్రైః ॥ 96 ॥


మదపుటేనుగును అదుపులోకి ఎలా తెచ్చుకుంటాము ?‌ అంకుశంతో  కదలకుండా చెయ్యాలి. గొలుసుతో‌ బలంగా లాగి, పనిముట్ల సహాయముతో, గట్టి స్థంభానికి కట్టి వేయాలి. మనస్సు మదించిన ఏనుగు వంటిది. దానిని అదుపులోకి తెచ్చుకుని కట్టివేయుట ఎట్లు ? శంకరుల ఉపదేశం -

భగవద్వాక్యములు, శాస్త్రవాక్యముల వలన వచ్చిన ధైర్యము అను అంకుశము వలన కదలకుండా చేయబడిన మనస్సు అనే‌ యేనుగును - భక్తి అనే గొలుసుచేత బలముగా లాగి - ఈ‌శ్వరలీలావిశేషముల పరిజ్ఞానములు అను పనిముట్లతో‌ - త్రిపురాసురసంహారి పాదములనే స్తంభమునకు - కట్టివేయుము.

ప్రచరత్యభితః ప్రగల్భవృత్త్యా
మదవానేష మనః కరీ గరీయాన్ ।
పరిగృహ్య నయేన భక్తిరజ్జ్వా
పరమ స్థాణుపదం దృఢం నయాముమ్ ॥ 97 ॥


భక్తితో మనస్సును బంధించమని శంకరులు మరలా ఉపదేశిస్తున్నారు.

మనస్సనే‌ ఈ‌ బలిష్ఠమైన మదపుటేనుగు అడ్డులేక అంతటనూ తిరుగుతున్నది. దృఢమైన ఈ యేనుగును భక్తి త్రాటితో యుక్తిగా బంధించి బ్రహ్మపదమును (పరమేశ్వరుని పాదమును) చేర్చుము.

సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం
సద్భిఃసంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యామ్ ।
ఉద్యద్భూషావిశేషాముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం
కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ ॥ 98 ॥

శంకరులు తమ కవితాకన్యకను శివునికి అర్పిస్తున్నారు.

గౌరీవల్లభా! కల్యాణి అయిన నా కవితాకన్యకను నీవు స్వీకరింపుము. ఈమె సర్వాలంకారములు కలది, సరళమైన పదములు కలది, మంచి నడవడిక కలది, మంచి వర్ణము కలది, బుద్ధిమంతులచే పొగడబడునది, సరసగుణములున్నది, సులక్షణములు కలది, ప్రకాశించు ఆభరణములు కలది, వినయము కలది, స్పష్టమైన అర్థరేఖ కలది.

ఈ శుభ కన్యకా లక్షణములు, శంకరుల కవితాకన్యకకూ‌ వర్తించునట్లు కావ్యాలంకారం.

ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్యజలధే
గతౌ తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా ।
హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరన్తౌ శ్రమయుతౌ
కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోఽసి పురతః ॥ 99 ॥


పరమశివా! కరుణాసముద్రుడా! ఇది నీకు తగునా ? నీ‌ పాదపద్మములు, శిరస్సు చూచుటకై హరి, బ్రహ్మలు జంతురూపములు ధరించి భూమిలోనూ‌ ఆకసములోనూ సంచరించి శ్రమచెందిరి. ప్రభూ! శంభో! నాకు ఎలా అగుపించెదవో చెప్పుము.

శివుడు భక్తపరాధీనుడు కాబట్టి విష్ణుబ్రహ్మలకూ కన్పడని తన స్వరూపం భక్తులకు దర్శనము చేయునని ఉపదేశం.

స్తోత్రేణాలమహం ప్రవచ్మి న మృషా దేవా విరిఞ్చాదయః
స్తుత్యానాం గణనాప్రసఙ్గసమయే త్వామగ్రగణ్యం విదుః ।
మాహాత్మ్యాగ్రవిచారణప్రకరణే ధానాతుషస్తోమవ-
ద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః ॥ 100 ॥


శంభో! స్తోత్రము చాలు. నేనబద్ధము చెప్పను. బ్రహ్మాదిదేవతలు, స్తుతించతగినవారిని లెక్కించునప్పుడు నీవు అగ్రగణ్యుడవని తెలిసికొనుచున్నారు. మహాత్మ్యములో గొప్పవారిని గూర్చి విచారించునప్పుడు , వారు తుచ్ఛధాన్యపుపొట్టు రాశి వలె ఎగురబట్టబడుతున్నారు. నీ భక్తులు నిన్ను సర్వోన్నత ఫలముగా తెలుసుకొనుచున్నారు.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.