Thursday 10 November 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 61 - 65



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 61 - 65

అఙ్కోలం నిజబీజసన్తతిరయస్కాన్తోపలం సూచికా
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సిన్ధు స్సరిద్వల్లభమ్ ।
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిన్దద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే ॥61॥

శంకరులు భక్తి అంటే‌ ఏమిటో నిర్వచిస్తున్నారు.

అంకోలచెట్టు విత్తనములు రాలి పడి మరల చెట్టును చేరినట్లు, సూది అయస్కాంతమును అంటుకున్నట్లు, పతివ్రత తన పెనిమిటిని అంటిపెట్టుకుని ఉన్నట్లు, లత చెట్టును పెనవేసుకుని ఉన్నట్లు, నదులు సముద్రుడిని చేరినట్లు, మనస్సు పశుపతి పాదారవిందములను పొంది, ఎల్లప్పుడూ అక్కడే ఉండుటను భక్తి అందురు.

ఆనన్దాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతచ్ఛాదనం
వాచా శఙ్ఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః ।
రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా-
పర్యఙ్కే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి ॥62॥

తల్లి బిడ్డడిని కాపాడినట్లు భక్తి భక్తుడిని సర్వవిధములుగానూ‌ కాపాడుతుంది అని శంకరులు ఉపదేశిస్తున్నారు.

ఓ‌ దేవా! భక్తి తల్లి, భక్తుడనే శిశువును ఆనందాశ్రువులచే ఒడలు పులకింపజేస్తుంది. నిర్మలత్వము (అనెడు వస్త్రము)చే కప్పుతుంది, మాటలనే శంఖపు ముఖమున ఉన్న నీ‌కథలనే‌ అమృతముతో‌ కడుపునింపుతుంది. రుద్రాక్షల చేతనూ, భస్మముచేతనూ శరీరమును రక్షిస్తుంది. నీ‌ భావన అనే పాన్పుపై పడుకోబెట్టి శిశువును కాపాడుతుంది.


మార్గావర్తితపాదుకా పశుపతేరఙ్గస్య కూర్చాయతే
గణ్డూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే ।
కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే ॥63॥


శంకరులు భక్తి ఎంత గొప్పదో‌ ఉపదేశిస్తున్నారు. ఈ‌ శ్లోకం భక్తకన్నప్ప యొక్క శివభక్తి విశిష్ఠతకు తార్కాణం.

దారులుతిరిగి (అరిగిపోయిన) చెప్పు పశుపతి శరీరం (శివలింగం) తుడుచు కూర్చె అయినది. పుక్కిలినీటితో‌ తడపుట త్రిపురాసురసంహారికి దివ్యాభిషేకం అయినది. కొంచెం తిని ఎంగిలిచేసిన మాంసపుముక్క, నైవేద్యము అయినది. ఆటవికుడు భక్తశ్రేష్ఠుడయినాడు. ఓహో! భక్తి చేయలేనిది ఏమున్నది ?


వక్షస్తాడనమన్తకస్య కఠినాపస్మారసంమర్దనం
భూభృత్పర్యటనం నమస్సురశిరఃకోటీరసంఘర్షణమ్ ।
కర్మేదం మృదులస్య తావకపదద్వన్ద్వస్య గౌరీపతే
మచ్చేతోమణిపాదుకావిహరణం శంభో సదాఙ్గీకురు ॥64॥

గతశ్లోకములలో‌ భక్తి అనగా మనస్సు శివపాదపద్మములను వదలక పట్టుకొనుట అన్న శంకరులు, ఆ పాదపద్మములు తన మనస్సులో‌ ఉంచమని శంభుని కోరుకుంటున్నారు.

పార్వతీ‌వల్లభా! యమునిఱొమ్ము తన్నవలెను. అతికఠోర అపస్మార అసురుని అణగదొక్కవలెను. కొండమీద తిరుగవలెను. నీకు నమస్కరించుచున్న దేవతల కిరీటముల రాపిడి ఓర్చుకోవలెను. నీ పాదములు అతి కోమలములు (అవి ఈ కఠినకార్యములు ఎలా చెయ్యగలవు ? ). శంభో! ఎల్లప్పుడూ నా చిత్తమనే మణిపాదుకలను నీపాదములకు తొడిగికొని విహరించుటకు అంగీకరింపుము.

## గౌరీపతే -- కిం వోచతే‌ అని పాఠభేదమున్నది


వక్షస్తాడనశఙ్కయా విచలితో వైవస్వతో నిర్జరాః
కోటీరోజ్జ్వలరత్నదీపకలికానీరాజనం కుర్వతే ।
దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే
యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభమ్ ॥65॥


శంకరులు, శివభక్తుని మృత్యువు చేరదనీ, దేవతలు సైతం నమస్కరించెదరనీ, మోక్షము లభిస్తుందనీ‌ ఉపదేశిస్తున్నారు.

ఓ‌ భవానీ‌పతీ! ఎవని మనస్సు నీ‌ పాదపద్మములను భజించుచున్నదో, వానిని చూచి యముడు (నీవు)‌ఱొమ్మును తన్నెదవనే భయముతో‌ పారిపోవుచున్నాడు. వానికి దేవతలు తమకిరీటములనున్న రత్నములనే దీపములతో నీరాజనములిచ్చుచున్నారు. ముక్తికాంత వానిని గాఢాలింగనము చేయుచున్నది. వానికి దుర్లభమైనది ఏమున్నది ?

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.