శ్రీ జయేంద్రవాణి: ప్రశ్నోత్తరములు : 6
1. తులసిపూజ చేయు విధానమును తెలియగోరుచున్నాను?
జ: తులసి మొక్కలో ముందు నీరు పోయవలెను. తరువాత కుంకుమ పెట్టి పుష్పము సమర్పించవలెను. తరువాత పాలు , పళ్ళు నైవేద్యము పెట్టి కర్పూరము వెలిగించి హారతి ఇవ్వవలెను. పిమ్మట మూడుసార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించవలెను.తులసి మన్నును ప్రసాదముగా నుదుట పెట్టుకొనవలెను. " తులసి పూజా విధానం" అనే పుస్తకం దొరుకుతుంది.
2. కొన్ని రోజులలో తులసి కోయకూడదు అంటారు. ఏ ఏ రోజులలో కోయకూడదు ? శ్రాద్ధము ఆరోజువస్తే కోయవచ్చునా ?
జ: శుక్రవారము, ఆదివారము, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి వంటిరోజులలో తులసి కోయకూడదు అన్నది సాధారణ నియతి. శ్రాద్ధము ఏరోజు వచ్చినా తులసి కోయవచ్చును.
3. తులసిపూజను పురుషులు చేయవచ్చునా ?
జ: బాగా చేయవచ్చును.
4. పూజగదిలో సుద్దతో ముగ్గులు వేయవచ్చునా ?
జ: ఇంట్లో, ఇతరగదులలో సుద్దతో ముగ్గులు పెట్టవచ్చును. కానీ పూజగదిలో మాత్రం బియ్యపు పిండితో మాత్రమే ముగ్గు వేయవలెను.
5. బియ్యపుపిండితో ముగ్గు వేయటంలో ఏమైనా అంతరార్థం నిండి ఉన్నదా ?
జ : బియ్యపుపిండి తో ముగ్గు పెట్టిన ఇంట్లో శుభం జరుగుతుంది. ముగ్గు మంగళ చిహ్నం.