Wednesday 6 December 2017

పరమాచార్యుల స్మృతులు : శరణాగతవత్సలులు



పరమాచార్యుల స్మృతులు : శరణాగతవత్సలులు
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

కాశీయాత్ర పూర్తిచేసి మఠానికి తిరిగి వచ్చిన శ్రీవారిని కుప్పు సహాయంకోసమై అర్థించాడు.

"నా వద్ద ఏముంది ? ధనమూ లేదు, మరేమీ లేదు. నేనేంచెయ్యగలను ?"

కుప్పు ప్రార్థన ఆపలేదు. శ్రీవారు తప్ప మరి దిక్కులేరన్నాడు. కుప్పు మంచి ప్రతిభాశాలి. చాలా భాషలునేర్చినవాడు. డిగ్రీ పట్టా ఉందతనికి. ఒక్క రాత్రిలో శుద్ధ సంస్కృతంలో మహామాఘం ప్రాధాన్యతగురించి పద్యకావ్యం వ్రాశాడు. తమిళ, ఆంగ్లభాషలూ బాగా వచ్చు. చివరికి శ్రీవారి సిఫారసుమీద ఒక బ్యాంకులో ఉద్యోగం దొరికిందతనికి. ఒక సంవత్సరం గడిచిందేమో.

శ్రీవారు తంజావూరులో విడిదిచేస్తుండగా ఒకనాడు ఒక వ్యక్తి, పూజకోసం వేయించిన మంటపానికి దాదాపు బయట, కూర్చుని కనిపించాడు.  చొక్కా వేసుకుని ఉన్నాడు, ధూమపానం చేస్తూండగా కూడా ఎవరో చూశారు. శ్రీవారు ఆవ్యక్తిని తీసుకురమ్మన్నారు. ఆ మనిషి వచ్చేవాడిలాగా అనిపించలేదు, కానీ శ్రీవారి మాట జవదాటకూడదుగా. శ్రీవారి సహాయకులలో ఒకరు అతనిదగ్గరకువెళ్ళి శ్రీవారిని కలువవలసినదిగా కోరారు. అతడు వెంటనే వచ్చాడు.

"సరి అయిన దుస్తులు ధరించకపోవటం చేత రాలేదు", అన్నడతను సంజాయిషీ చెప్పుకుంటూ. శ్రీవారు అతనితో కాసేపు మాటలాడి, కుప్పు గురించి అడిగారు. అతడు జవాబివ్వటానికి సందేహించాడు. కొంతసేపు అడిగిన తరువాత కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. "అదేంటంటే.... కుప్పు సెలవులో ఉన్నాడు". చివరికి, తడవ తడవలుగా, మాకు ఈ వ్యక్తిద్వారా తెలిసిందేమిటంటే - కుప్పుకి బ్యాంకులో కాషియర్‍గా పని ఇచ్చారనీ, డబ్బు దొంగతనం చేయడం వల్ల తాత్కాలికంగా తొలగించారనీను.

ఆ రోజు పూజ ముగిసిన తరువాత శ్రీవారు కుప్పువాళ్ళ గ్రామానికి వెడుతున్నానని ప్రకటించారు.
"అదోచిన్న కుగ్రామం, మనందరినీ వాళ్ళు భరించలేకపోవచ్చు. పైగా ఇప్పటికిప్పుడు పీఠాన్ని తరలించలేము"  అంటూ అసమ్మతి తెలిపారు మఠ కార్యనిర్వహణాధికారి.
"పూజను తీసుకుని బయలుదేరుతున్నాను" అని ఆ గ్రామానికి బయలుదేరారు శ్రీవారు.

అవసరానికి అందరూ ఏకమవడం తంజావూరువాసుల ప్రత్యేకత. రాత్రికిరాత్రి వాళ్ళు సరంజామా కూర్చుకుని, మంటపాన్ని ఏర్పాటుచేశారు. పూజకూ ఇతర అవసరాలకూ సామగ్రి సిద్ధంచేశారు. ఆ కుగ్రామాన్ని తిరునాళ్ళలాగా మార్చేశారు.

శ్రీవారి సంగతంటారా, వారు తిన్నగా కుప్పువాళ్ళ ఎదురింటికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కుప్పు వాళ్ళింట్లోనే అటకెక్కి దుప్పటి ముసుగుతన్ని పడుకున్నాడు. రెండురోజుల తరువాత మూడోరోజు మధ్యాహ్నం, కుప్పు ఏంజరుగుతోందో చూడటానికి జాగ్రత్తగా బయటకు వచ్చాడు. శ్రీవారు కుప్పును పసిగట్టి, తీసుకురమ్మన్నారు. కొంతమంది వీధి దాటి అవతలప్రక్కకు వెళ్ళి ఒకటో రెండో దెబ్బలువేసి కుప్పుని శ్రీవారివద్దకు తీసుకొచ్చారు.  కుప్పు వెంటనే సాష్టాంగం చేస్తూ శ్రీవారి పాదాలమీద పడ్డాడు. పాదాలు పట్టేసుకున్నాడు. 

శ్రీవారివలె శరణాగతిచేసినవారిని క్షమించి రక్షించేవారెవరూ లేరు.  తమ పాదాలవద్ద ఆశ్రయంకోరినవారిని రక్షించు ప్రతిజ్ఞలో శ్రీవారు సాక్షాత్తూ శ్రీరాముడే. శరణాగతవత్సలులు.

కుప్పు సుమారు అయిదువేలరూపాయలు కాజేశారనుకుంటా. ఆ రోజుల్లో మఠంలో భిక్షావందనమునకు పదమూడురూపాయలు ఇవ్వవలసి ఉండేది. అయిదువేలరూపాయలు ఎంతపెద్దసొమ్మో మీరు ఊహించుకోవచ్చు. ఇది నలభైల్లో సంగతి. శ్రీవారు కుప్పుని తిట్టలేదు, ఒక్కమాట అడగలేదు. మఠ కార్యనిర్వహణాధికారిని పిలిపించి బ్యాంకుకు ఆ డబ్బును కట్టివెయ్యమన్నారు.

శ్రీవారు తరువాత తిరుచిరాపల్లిలో నేషనల్‍కాలేజీ స్థలంలో విడిది చేశారు. ఆరోజుల్లో ప్రతీ ఏటా చివరి ’రెండో శనివారం’ నాడు ఉపాధ్యాయుల పరిషత్తు సమావేశం జరిగేది. అవి తెల్లదొరతనం రోజులు. శ్రీవారు కళాశాల అధ్యక్షుడితో మాట్లాడారు. " ఈ కుర్రాడికి డిగ్రీ పట్టా ఉంది, చాలా భాషలు వచ్చు. మీరు మీ పాఠశాలలో ఉద్యోగం ఇవ్వగలరా ?".

"శ్రీవారి ఆదేశం. శ్రీవారు కోరుకుంటే పది ఉద్యోగాలు ఇవ్వగలను".

అలా కుప్పు జీవితంలో మళ్ళీ స్థిరపడ్డాడు. అప్పుడప్పుడూ దర్శనంకోసం వచ్చేవాడు. ఒక్కసారికూడా శ్రీవారు కుప్పుతో ఆ సంఘటన గురించి మాట్లాడలేదు. శ్రీవారు తమ భాషలోకానీ, ఇతరులతో తమ ప్రవర్తనలో కానీ ఎంతో ఉన్నతులు.

జీవితపు చివరిరోజుల్లో కుప్పుకు తన మలమూత్రవిసర్జనపై అదుపు ఉండేదికాదు. అలాంటి పరిస్థితిలో చనిపోయినవారికి మరుజన్మలేదంటారు. కుప్పు శ్రీవారినుండి ఒక్క చీవాటూ ఎరుగడు. 


No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.