Monday 4 December 2017

పరమాచార్యుల స్మృతులు : కరుణ, వాత్సల్యం



పరమాచార్యుల స్మృతులు :  కరుణ, వాత్సల్యం
(బాలూమామ స్వానుభవాలు : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

శ్రీవారు గుంటూరులో విడిదిచేస్తున్నప్పటిమాట.  ఒక రైతు బుట్టనిండా తన పొలంలో పండిన మిరపకాయలు తీసుకొచ్చి శ్రీవారికి సమర్పించాడు.

"ఈ భిక్షని మీరు స్వీకరించాలి" అన్నాడు.

ఆ రోజు భోజనంలో శ్రీవారికి మిరపకాయే.  ఆయన అనేక వంటకాలు వివరంగా చెప్పి చేయించారు. మిరప్పచ్చడి, మిరపకాయ-పెసలతో పప్పు,  మిరపకాయ కూర, మిరపకాయ పెరుగు పచ్చడి, మిరపకాయ-చింతపండు పచ్చడి, మిరపకాయ ముక్కల వేపుడు, దోరగా వేయించిన మిరపకాయలు, ఉడకబెట్టిన మిరపకాయలు. నన్ను నమ్మండి, మిరపకాయతో ముప్ఫైరకాలు.

ప్రతీ ఒక వంటకాన్నీ, ఏమీ మిగల్చకుండా అన్నింటినీ ప్రశాంతంగా తిన్నారు శ్రీవారు.  తిన్నందుకు ఏ తేడా చెయ్యలేదు.

--

మేము ఒకసారి తేనంబాకం నుండి వీధిలో నడచి వస్తూ ఒక ముస్లిం నడిపే టీ కొట్టు దాటాము.  శ్రీవారిని చూడగానే కొట్టు యజమాని కంగారుగా బయటకు పరిగెత్తుకువచ్చాడు. చేతిలో ఉన్న వేడిపాల గాజుగ్లాసు శ్రీవారివేపు జాపాడు.

"స్వామి ఇవి త్రాగాలి" అన్నాడు.

శ్రీవారు నన్ను ఆ గ్లాసు తీసుకోమన్నారు.  తీసుకున్నాను కానీ, ’ఎంతోమంది ఆ గ్లాసులో త్రాగి ఉంటారు, అలాంటి గ్లాసులో ఇచ్చిన పాలని ఏంచెయ్యాలో’  అనుకున్నాను. ఆ గ్లాసుని హాలులో ఒక మూల పెట్టాను.  సాయంత్రం అయ్యింది. శ్రీవారు వరండాలో కూర్చుని ఉన్నారు.

"ఆ గ్లాసుడు పాలు తీసుకురా. అదే ఈ రోజు నాకు భిక్ష.  పాలల్లోనో , పెరుగులోనో నానబెట్టిన అటుకులు కాదు. కావాలంటే అవి మీరు తినండి. నాకొద్దు.

నేను పెట్టినచోటునుండి ఆ గ్లాసు తీసుకొచ్చి శ్రీవారికి ఇచ్చాను.

"చూడు, చాలా ఆప్యాయంగా ఇచ్చాడు, త్రాగాల్సిందే" అని, తాగేశారు.

---

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.