Friday 1 December 2017

సాక్షాత్తూ పరమేశ్వరుడే



సాక్షాత్తూ పరమేశ్వరుడే
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

మేమప్పుడు మైలాపూరులో ఉండేవాళ్ళం. ప్రతీరోజూ ప్రొద్దున్నా, సాయంత్రం - రోజుకి రెండు సార్లు - నేను శివదర్శనానికి కపాలేశ్వరుని దేవాలయానికి వెళ్ళేవాడిని.

పరమాచార్యులకి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వచ్చేది. రామకృష్ణయ్యరు - హోమియోతెలిసినవారు, వైద్యుడు కాదు - తన హోమియో నిఘంటువు చూసి ఏవో బల్లిగుడ్లలాంటి తెల్లని చిన్న గోళీలు ఇచ్చేవారు. స్వామివారు అవి రెండు రోజులు తీసుకొన్న తరువాత కొంత ఉపశమనం ఉండేది.  అయ్యప్ప, శబరిమల ప్రాచుర్యంలోకి వస్తున్న రోజులవి. నల్లధోవతులు కట్టుకుని జనాలు గుడికి వచ్చేవారు. మాకు నల్ల దుస్తులంటే ద్రవిడకజగం (రాజకీయపార్టీ) కి సంబంధించినవిగా మాత్రమే తెలుసు. దాంతో నేను కొంత ఆశ్చర్యపోయాను. కొంతమందిని అడిగితే ఒక వ్యక్తి నాతో ఇలా అన్నాడు - "నీకు తెలియదా ? మేము శబరిమల వెడుతున్నాం. ఎంతో శక్తివంతమైన దేవుడు. పిల్లల్లేనివారికి సంతానం కలుగుతుంది. అనారోగ్యం నయమవుతుంది. నిశ్చయంగా ఒక సజీవ దేవత".

అప్పట్లో నేను చిన్నవాణ్ణి, బోలెడు భక్తి ఉంది. ఇది 35 ఏండ్ల క్రింది మాట. పరమాచార్యులకి ఛాతీనొప్పి నయమవటానికి నేను శబరిమల యాత్ర చేస్తానని మొక్కుకున్నాను.  నేను స్వాములవారి దగ్గరకు వెళ్ళి నేను శబరిమల వెడుతానని మ్రొక్కుకున్నాననీ, వారి దీవెనలూ అనుగ్రహము కావాలనీ అడిగాను.

"శబరిమల ఏంటి ? ఈ అకస్మాత్తు కోరిక ఏంటి ? నువ్వు నాతో ఉండగా యాత్రలెందుకు ? నన్నెందుకు అడుగుతున్నావు ?"

"నేను మ్రొక్కుకున్నాను, అది తీర్చుకోవాలి. శ్రీవారు దయచూపాలి"

శ్రీవారు ఒక గుడ్డతీసి నాపైకి విసిరారు. "ఇదివరలో శబరిమలకి తెల్లధోవతులతోనే వెళ్ళేవాళ్ళు.  బ్రాహ్మణులు మద్యమాంసాలకు దూరంగా ఉంటారు. కాబట్టి శబరిమలకు వెళ్ళటానికి విశేష కట్టుబాట్లు అవసరం లేదు. నలుపు ధరించటం ఈమధ్య వచ్చిన ఆనవాయితీ.  సంవత్సరం పొడవునా మద్యమాంసాలు సేవించేవారు, వారి పశ్చాత్తాపానికి సూచనగా నలుపు ధరించటం మొదలయ్యింది. నీకు అవసరం లేదు. గుడిలోకి వెళ్ళినప్పుడు ఈ తుండు నీ చుట్టూ కట్టుకో.  మరోమాట. నేను చెప్పినట్లే చెయ్యాలి. ఒక వంద నిమ్మకాయలు కొనుక్కుని, నీతో ఒక చేతిసంచీలో తీసుకువెళ్ళు. ఈ తాజా నిమ్మకాయలు తప్ప వేరే ఏమీ తినకూడదు. వీటి రసం తీయకూడదు. పచ్చిగానే తినాలి".

ఆ నిమ్మకాయలు మాత్రం తింటూ నలభై రోజులు ఉన్నాను.  శ్రీవారి కరుణవలన నాకు అది సరిపోయింది. నేను వెళ్ళటానికి సిద్ధమయి నాగరాజయ్యర్ కారులో శబరిమల బయలుదేరాము.

కొండ పైన గుడిలో 18 మెట్లకీ 18 కొబ్బరికాయలు కొట్టాను. భక్తులు అక్కడి పూజారి వద్దకు ప్రసాదానికై వెడుతున్నారు. నేను కూడా శ్రీవారికోసం ప్రసాదం ఆ పూజారిని అడిగాను. శ్రీవారికోసమే కదా వచ్చింది ?

"ఎక్కడనుంచి వస్తున్నావు ?"

"నేను పరమాచార్యుల సేవకుడిని"

"ఓ, పరమపూజ్యులు వారు"

" అవును, వారు పరమపూజ్యులు"

"వారి వల్లనే మేము బాగున్నాము. మాకు కోట్లరూపాయల ఆదాయం, అంతా సక్రమంగా జరుగుతోంది"

"నాకు కొంత ప్రసాదం కావాలి"

వెంటనే ఆ పూజారి ఒక పెద్ద నెయ్యి డబ్బా తీసుకుని, ఆ డబ్బాడు నెయ్యీ విగ్రహంపై పోశారు. సుమారు కేజీన్నర పట్టే సీసా తీసుకుని, దాని నిండా ఆ నేతిని పట్టారు.  తరువాత తమ రెండు చేతులనిండా విభూతి తీసుకుని విగ్రహానికి అభిషేకించారు. ఇలా రెండుసార్లు చేసి, ఆ విభూతిని సేకరించి నాకు ఇచ్చారు.  నేను ప్రసాదాన్ని జాగ్రత్త చేసుకున్నాను.  సాష్టాంగం చేసి అయిదువందల రూపాయలు సమర్పించాను. నాకోసం రెండు సీసాల అరవణ పాయసం కొనుక్కున్నాను.  యాత్ర అయిపోయింది కదా, నేను తినవచ్చు.  నా తిరుగు ప్రయాణం మెదలుపెట్టాను.

తిరుగు ప్రయాణం ఎర్నాకులం మీదుగా వచ్చాను. ఏ మార్గంలోనైనా వెనక్కిరావచ్చు. రెండు మార్గాలున్నాయి. వందిపెరియార్ మీదుగా ఒకటి, సలక్కాయం మీదుగా రెండోది. నేను సలక్కాయంమీదుగా ఎర్నాకులం వచ్చాను. నాతో దర్శనానికి వచ్చిన ఒక న్యాయవాది - నాకు బాగా తెలిసినవాడు, స్నేహితుడూ - నన్ను వారి ఇంటికి తీసుకునివెళ్ళాడు. భోజనం అయ్యాక బయలుదేరబోతోంటే అతను ఇలా అన్నాడు. " నువ్వు నిరాకరించకూడదు. మా అమ్మ, తొంభై ఏళ్ళది, ఈ ప్రక్కనే ఓ పల్లెటూళ్ళో ఉంటోంది. శ్రీవారి దగ్గరవారిని చూస్తే చాలా సంతోషిస్తుంది. మనం అక్కడకు వెళ్ళిన తరువాత నువ్వు బయలుదేరవచ్చు."

మేము కొల్లెనగోడు అనే ఆ పల్లెటూరికి బయలుదేరాము. ఆ తల్లి నన్ను చూచి చాలా సంతోషించింది. ఆవిడ పేరు అంగచ్చి, వాళ్ళు నంగవరం వారు. కాఫీ ఇవ్వబోయి, నేను వద్దంటే మజ్జిగ ఇచ్చింది. కాసేపైనతరువాత నేను బయలుదేరబోతోంటే ఆమె ఇలా అంది - " కృష్ణయ్యర్ మామ ను కలువకుండా ఎలా వెడతావు ? ఓ పిల్లాడా, ఇలావచ్చి ఈ అబ్బాయిని కృష్ణయ్యర్ మామ దగ్గరకు తీసికెళ్ళు "

నాకు కృష్ణయ్యరూ తెలియదు, రామయ్యరూ తెలియదు. సరే, మేము బయటకి వెళ్ళి వీధికి అవతలప్రక్కన ఉన్న ఇంట్లోకి వెళ్ళాము.  అక్కడ ఓ పడకకుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న తొంభై అయిదు ఏండ్ల ఒక వృద్ధుడిని చూశాను.

"ఓయ్ రాజూ, ఎవరిది ?"

నన్ను పరిచయం చేశారు. "నేను పరమాచార్యుల సేవకుడిని" అన్నాను.

ఆయన అమాంతం కుర్చీలోంచి లేచి, సాష్టాంగం చేసి నా పాదాలు పట్టుకున్నారు. నేను నిర్ఘాంతపోయి వెనక్కిదూకాను.

"మీరిలా చెయ్యకూడదు. మీరా పెద్దవారు, నేనో, చిన్నవాణ్ణి,  ఇలా చేయడం దోషం"

"నేను సాష్టాంగం చేసింది నీకు కాదు, శ్రీవారికి. ఆ సర్వేశ్వరుడికి. శ్రీవారు సాక్షాత్తూ ఈశ్వరుడని నీకు తెలియదా ?  ఆ భగవంతుడే అని తెలియదా ? తంజావూరువాళ్ళు సాధారణంగా తెలివైనవారు, నువ్వేమో తెలివితక్కువవాడిలా ఉన్నావే ?"

"మీరలా ఎలా అంటున్నారు ? అందరూ అంటున్నారనా ? అందరూ శ్రీవారిని పొగిడేవారే "

"విను. చాలా దశాబ్దాలక్రితం శ్రీవారు కేరళ వచ్చి మా ఊరిలో నలభై అయిదు రోజులు ఉన్నారు. ప్రతీ ఉదయం శ్రీవారు మూడింటికల్లా లేచి ఒక గంట జపం చేసేవారు.  తరువాత స్నానమూ, నిత్యకృత్యాలూ, చంద్రమౌళీశ్వరపూజా చేసేవారు. తరువాత ఒక అయిదునిముషాలలో వారు హడావిడిగా భోజనం అయిందనిపించేవారు.  వెంటనే భక్తులవద్దకు వచ్చి, ఏదైనా ఆధ్యాత్మికవిషయం పై ఉపన్యసించేవారు. రోజూ ఇలాగే నడిచేది - పూజ, ప్రసాదం, అంతులేకుండా భక్తులను కలవటం - మళ్ళా మధ్యాహ్నమూ ఇదే, సాయంత్రమూ ఇదే, రాత్రీ ఇదే. వారు ఏమీ తినేవారే కాదు, మూడు గంటలకు మించి నిద్రపోయేవారూ కాదు. ఒకరోజు నేను శ్రీవారిని ఇలా ప్రార్థించాను.

"శ్రీవారు నాకోసం ఒక పని చెయ్యాలి"

"ఏమిటది ?"

"శ్రీవారు సాక్షాత్తూ గురువాయురప్ప, ఎర్నాకులట్టుఅప్పన్, వేరు కాదు. ఈ అంతులేని శ్రమ, నిద్రలేకపోవటం శ్రీవారి శరీరంలో ఉష్ణం కలిగించింది. ఈ వేడి వలన కళ్ళు బాగా ఎర్రగా ఉంటున్నాయి.  శ్రీవారు, తమకు తైలస్నానం చేయించటం కోసం నాకు అనుమతినివ్వాలి. కేరళ ఔషధతైలాలకి ప్రసిద్ధి. శ్రీవారు కరుణించి నాకు ఈ అనుమతినివ్వాలి".

"సరే అయితే", అన్నారు శ్రీవారు, "శనివారం రా ".

నేను మూలికలూ, వేళ్లను ఉపయోగించి తైలం తయారుచేసి, శనివారం శ్రీవారి వద్దకు తీసుకుని వెళ్ళాను. శ్రీవారు నన్ను ఈ తైలం వారి తలపైనా, శరీరం పైనా మర్దించాను. అప్పుడు వారి శిరస్సుపై చక్రవర్తిరేఖ చూశాను. చేతులపై శంఖచక్రముద్రలున్నాయి.  పాదముల మడమలపై పద్మరేఖ చూశాను.  నువ్వు తంజావూరువాడినంటున్నావు. తంజావూరువాళ్ళు తెలివైనవారు, నీకు తెలివిలేనట్టుంది.   శ్రీవారిని సేవిస్తానంటున్నావు, ఆయన శరీరంపై ఈ రేఖలు చూడలేదా ?  వారుకూడా అందరిమల్లేనే మలమూత్రవిసర్జన చేస్తారు అని మోసపోకు. ఆయన నిన్ను వెర్రివాడిని చేస్తున్నారు. శ్రీవారు సాక్షాత్తూ ఈశ్వరుడు తప్ప వేరుకాదు. "

ఆ వృద్ధుడు నాతో అలా అన్నారు. కాస్సేపయ్యినతరువాత నేను వెళ్ళటానికి లేచాను. నన్నొక్కనిముషం ఉండమని ఆయన లోపలికి వెళ్ళారు. లోపలినుండి పద్ధెనిమిది రుద్రాక్షలను పట్టుకొచ్చారు. అందులో ఏకముఖి నుండి పద్ధెనిమిది ముఖాలున్న రుద్రాక్షవరకూ ఉన్నాయి. అవన్నీ నా చేతిలో ఉంచి, ఆయన అన్నారు - " తీసుకోవయ్యా, ఇవి నావద్ద చాలాకాలంగా ఉంచాను. నువ్వు తీసుకోవాలి".

నేను రుద్రాక్షలు తీసుకున్నాకా, ఆయన నా చెయ్యిపట్టుకుని "నువ్వు నాకో మాట ఇవ్వాలి" అన్నారు.

"ఏమని మాట ఇవ్వాలి ?"

"చివరి శ్వాస వరకూ శ్రీవారిని సేవిస్తానని. ఇతరులు నిన్ను ఇబ్బంది పెడతారు. వదిలించుకోవటానికి చూస్తారు. ఓ దుర్మార్గుడు వచ్చి నిన్ను తరిమేయవచ్చు.  పట్టించుకోవద్దు. మఠం బయట ఒక స్టూలు వేసుకుని శ్రీవారిని కనిపెట్టుకుని ఉండు. వదలద్దు సుమా. నమ్మకస్థుడైన సేవకువై ఉండు, వదిలిపెట్టద్దు. "

నాకు ఆయన మజ్జిగ ఇచ్చారు.

"మరో మాట. శ్రీవారికి నా ప్రార్థనగా నడవవద్దన్నానని చెప్పు. వారు చాలా నడుస్తారు. ఆ పాదాలపై రేఖలు చెరిగిపోతే ప్రపంచానికే అరిష్టం. కాబట్టి నడువకూడదు.  ఇంకో విషయం. వారికి నా తరపున ఇరవై నాలుగు సాష్టాంగాలు చెయ్యి".

నేను మాట ఇచ్చి బయలుదేరాను.

టాక్సీలో ప్రయాణం చేశాను. శ్రీవారు ఒక అడవి మధ్యలో ఉన్న కట్టుకోడిపురం అనే ఊరిలో - బహుశ నాగలాపురం దగ్గరనుకుంటా - ఉన్నారు. ప్రయాణం చాలా కష్టమయ్యింది. రోడ్డు ఎత్తుపల్లాలతో ఉంది. చాలా కష్టంమీద శ్రీవారి వద్దకు చేరాను.  శ్రీవారు ఓ గోనెపట్టాపై విశ్రాంతి తీసుకుంటున్నారు. నేతినీ, విభూతినీ వారెదురుగుండా ఉంచి, సాష్టాంగం చేశాను.  వెంటనే  శ్రీవారు ఆ కేజీన్నర నెయ్యి సీసామూత తీసి ఒక్కగుటకలో నేతినంతా తినేశారు.  ఆకులో చుట్టబడిన విభూతి అంతా తన తలపై ఒంపేసుకున్నారు. నేనేమీ మాట్లాడకముందే శ్రీవారు నాతో ఇలా అన్నారు.

"అయితే నువ్వు శబరిమల వెళ్ళావా ? కృష్ణయ్యరు నీతో ఏం చెప్పాడు ?"

"శ్రీవారు సాక్షాత్తూ పరమేశ్వరుడేనని చెప్పారు"

ఒక్క క్షణంలో శ్రీవారు లేచి నుంచుని దండం పట్టుకున్నారు. ఆరడుగుల పొడవని తోచింది. కళ్ళు చింతపిక్కల్లా ఎర్రగా ఉన్నాయి.  ఆయన నిజంగా శూలపాణి అయిన పరమేశ్వరుడే.

"అలా అన్నాడా ? అన్నాడా ?"

"అవును. శ్రీవారి పాదాలపై రేఖలు చెరిగిపోతే ప్రపంచానికే అరిష్టం. కాబట్టి నడువకూడదని ప్రార్థిస్తున్నానని చెప్పమని కూడా అన్నారు"

"రేఖలు చెరిగిపోవని చెప్పు. నేను పాదుకలు ధరిస్తానని చెప్పు. ఫోన్ చేసి చెప్పు".  తరువాత నేను కృష్ణయ్యరు గారికి ఫోన్ చేసి శ్రీవారి సందేశం తెలియపరచాను.

అప్పుడు నేను కృష్ణయ్యరుగారిచ్చిన రుద్రాక్షలు శ్రీవారికి ఎదురుగా ఉంచి సమర్పణ చేశాను.

"ఇవి నీకు ఇచ్చినవి"

"నేను ఆ కానుకకు అర్హత లేనివాణ్ణి. అజ్ఞానిని.  శ్రీవారు మాత్రమే ధరించయోగ్యమయినవి "

" ఇలా ఎలా ధరించను ?"

"నేను వీటిని ఒక మాలగా తయారు చేయిస్తాను" అని,  ఒక చక్కటి మాల తయారు చేశాను. శ్రీవారు దానిని ధరించారు కూడా. ప్రదోషం రోజుల్లో శ్రీవారు రుద్రాక్షలు ధరించేవారు. తరువాత ఆ మాలను బాలస్వామివారికి ఇచ్చారు. కానీ నేనెప్పుడూ బాలస్వామివారు వాటిని ధరించగా చూడలేదు, పూజలో కూడా. జయేంద్ర స్వామివారు ప్రదోషం రోజుల్లో తప్పనిసరిగా రుద్రాక్షలు ధరిస్తారు.

"నేను శ్రీవారిని ఒకటి అడగాలని కోరుకుంటున్నాను"

"ఏం కోరుకుంటున్నావో అడుగు"

"రామయ్యర్లూ, కృష్ణయ్యర్లూ శ్రీవారి శిరస్సుపై తైలం అలదారు, శరీరంపై రేఖలు చూశారు. శ్రీవారితో ఎప్పుడు ఉండి సేవించుకునే మేము మాత్రం ఎప్పుడూ ఏమీ చూడలేదు"

శ్రీవారు కాళ్ళుజాపి ముందుకు వంగారు.

"నా తలమీద, కాళ్ళమీద ఉన్న రేఖలు చూడు. దగ్గరగా రా,  కావాలంటే రేఖలని ముట్టుకో. నేనేమైన పోలీసునా ? టీటీ నా? నేనేం చేస్తాను ?  ’శంకరాచార్యులకు తలపై ఈ రేఖలు ఉన్నాయి’ అని వ్రాయబడిన బోర్డు మెడచుట్టూ తగిలించుకోనా ? "

నేను శ్రీవారి తలపైనా పాదములపైనా ఉన్న రేఖలని స్పర్శించాను.

కరుణామూర్తి అనేపదం ప్రపంచంలో శ్రీవారికి మాత్రమే వర్తిస్తుంది. శ్రీవారి దయ వేరొకరికి ఉండదు.

1 comment:

krish said...

నేను మీ బ్లాగ్ చదివాను నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను మీ బ్లాగ్ చదవధానికి పరమాశ్చర్యాలు వారి గురించి తెలుసుకుంటున్నాను పరమాచారులు వారు నడిచే దేవుడు.. నేను మీ బ్లాగ్ ని రోజు చుసుతు ఉంటాను మీరు ఇలాంటి పోస్ట్స్ రాస్తూఉండాలి అని న కోరిక.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.